జీవితంలో ఎదురుదెబ్బలు ఎందుకు తగులుతాయి? మనిషి జీవితం ఎందుకు నాశనమౌతుంది? రకరకాలుగా సాగిన మనిషి జీవితంలో చివరికి ఏం మిగులుతుంది?చదవండి.
---------------------------------
అలవాట్లతో కొందరు
అహంతో కొందరు
అగచాట్లతో కొందరు
ఆత్రంతో కొందరు
అలవాట్లతో కొందరు నాశనమౌతారు. దురలవాట్లతో కొందరైతే, అతి మంచి అలవాట్లతో మరికొందరు అవుతారు. తనకు మాలిన ధర్మంతో నాశనమైనవాళ్లు ఎందరో ఉన్నారు. అదే విధంగా, అహంకారం పెరిగిపోయి కొందరు నాశనమౌతారు. జీవితమంతా కష్టాలతో ఇంకొందరు నాశనమౌతారు. అన్నింటినీ అనుభవించేసెయ్యాలన్న ఆత్రంతో ముందుముందుకు దూకి మరికొందరు నాశనమౌతారు.
అలవిగాక కొందరు
అలసిపోయి కొందరు
అచ్చిరాక కొందరు
అతికి పోయి కొందరు
కొంతమందికి అలవికాని భార్య లేదా భర్త ఉంటారు. వాళ్ళ మూర్ఖపు దారిలోనే వాళ్ళు పోతుంటారు గాని వీరిమాట వినరు. అలాంటివాళ్లతో కొంతమంది జీవితం పాడైపోతుంది. కుటుంబం కోసం, పిల్లలకోసం చేసీ చేసీ ఇంకొందరి జీవితం నాశనమౌతుంది. మరికొంతమందికి, దేనిని పట్టుకున్నా పాడైపోతూ ఉంటుంది. వాళ్ళు అలా నాశనమౌతారు. ఇంకొంతమంది ప్రతిదానికీ చాలా అతి చేస్తుంటారు. అలాంటివాళ్ళు అతికి పోయి గుల్ల అవుతారు.
కళ్లుమూసి కొందరు
కావరంతో కొందరు
కష్టపడక కొందరు
కనిపించక కొందరు
కొంతమంది, ఎదురుగా ఉన్నదానిని కూడా చూడలేరు. పిల్లి కళ్ళుమూసుకున్నట్లు బ్రతుకుతూ ఉంటారు. వారి జీవితాలు అలా గడిచిపోతాయి. ఇంకొందరికి కండకావరంతో కళ్ళు నెత్తికెక్కుతాయి. ఎవరినీ లెక్కచెయ్యరు. విర్రవీగుడుతో వారి బ్రతుకులు ముగుస్తాయి. మరికొందరికి కష్టపడటం అస్సలు ఇష్టం ఉండదు. ఎంతసేపూ ఎదుటివారి కష్టం మీద బ్రతికేద్దామని చూస్తూ ఉంటారు. వారి జీవితాలు అలా ముగుస్తాయి. ఇంకొందరికి ఎంత వెదికినా వారు వెదుకుతున్న దారి కనిపించదు. వారి జీవితాలు నిరాశతో ముగుస్తాయి.
భయంతో కొందరు
బాధలతో కొందరు
బరినిదాటి కొందరు
బలిసిపోయి కొందరు
కొంతమందికి జీవితమంతా భయంలో గడిచిపోతుంది. ఎవరో ఒకరికి అనుక్షణమూ భయపడుతూనే వారు బ్రతుకుతారు. మరికొందరికి అన్నీ ఉంటాయి గాని, బాధలతో యుద్ధం చేస్తూ ఉంటారు. వారి జీవితమంతా బాధలే సరిపోతాయి. ఇంకొందరు హద్దులలో ఉండరు. గిరిగీసుకుని బ్రతకడం వారికసలు ఇష్టం ఉండదు. హద్దు మీరి ప్రవర్తిస్తూ చేతులు కాల్చుకుని నాశనమౌతారు. మరికొందరికి అన్నీ ఎక్కువే. జీవితంలో దేనికీ లోటు లేకపోవడంతో విచ్చలవిడిగా బ్రతికేసి అనేక తప్పులు చేస్తూ నాశనమౌతారు.
చేతులారా కొందరు
చేవచచ్చి కొందరు
చేతగాక కొందరు
చెయ్యలేక కొందరు
కొందరేమో, చేతులారా చేసుకున్న ఖర్మలు అనుభవిస్తూ నాశనమౌతారు. ఇంకొందరికి ఏది చేద్దామన్నా ఓపిక ఉండదు. నీరసంగా బ్రతుకుతూ వారి జీవితాలు వెళ్లిపోతాయి. మరికొందరికి ఏదీ చేతకాదు. ఎవరినీ కంట్రోల్ చెయ్యలేరు. జీవచ్ఛవాలలా బ్రతుకుతూ వారెళ్లిపోతారు. ఇంకొందరికి శక్తి ఉంటుంది, చేద్దామన్న ప్లాన్సూ ఉంటాయి. కానీ, ఏదో ఒక కారణం చేత, ఏదో ఒకటి అడ్డుపడుతూ ఉంటుంది. వారి జీవితాలు అలా వెళ్లిపోతాయి.
తెలిసి తెలిసి కొందరు
తెంపులేక కొందరు
తెలివిమీరి కొందరు
తెలివిలేక కొందరు
కొందరేమో, తెలిసి తెలిసి తప్పులు చేస్తారు. తప్పని తెలిసినా తప్పించుకోలేరు. ప్రమాదం వైపే వారు ప్రయాణిస్తారు. వారి బ్రతుకులు అలా తెల్లవారతాయి. మరికొందరు ఎంతసేపూ కలలు కంటూ ఉంటారు. వాటిని నిజాలు చేసుకునే ధైర్యమూ తెగింపూ వారికీ ఉండవు. వారి ఖర్మ అంతే. ఇంకొందరికి అతితెలివి చాలా ఎక్కువగా ఉంటుంది. అందరికంటే మేమే తెలివైన వాళ్లమని భావిస్తూ, పప్పులో కాలేసి మోసపోతూ ఉంటారు. మరికొందరు తెలివితక్కువగా అందరి చేతుల్లోనూ మోసపోతూ ఏడుస్తూ బ్రతికేస్తూ ఉంటారు. వారివి ఏడుపు జీవితాలు.
స్వార్ధంతో కొందరు
సౌఖ్యంతో కొందరు
సరదాగా కొందరు
సరిపోక కొందరు
కొందరు చాలా స్వార్ధపరులు. ఎదుటివాడు ఏమైపోయినా వారికనవసరం. వారి పబ్బం గడిస్తే వారికి చాలు. వారి జీవితాలు అలా గడుస్తాయి. ఇంకొందరు, సుఖాలకు బాగా అలవాటు పడి ఉంటారు. ఆ సుఖాలకోసం అందరిజీవితాలతో ఆడుకుంటూ ఉంటారు. వారు అలా బ్రతికేస్తారు. మరికొందరికి జీవితంలో గమ్యాలంటూ ఏవీ ఉండవు. జులాయిలలాగా గాలికి బ్రతికేస్తూ ఉంటారు. ఇంకొందరికి ఎంతున్నా సరిపోదు. ఇంకా ఇంకా కావాలి. అంతులేని ఆ వేటలో చివరకు వాళ్ళే బలి అవుతారు.
కావాలని కొందరు
చావాలని కొందరు