Pages - Menu

Pages

2, ఏప్రిల్ 2022, శనివారం

ఇమ్రాన్ ఖాన్ జాతకం - గోచార శపితయోగం


పాకిస్తాన్ పరిస్థితి దృష్ట్యా ఇమ్రాన్ ఖాన్ జాతకంవైపు ఒక చూపును సారిద్దాం. పండగనాడు కూడా పాతమొగుడేనా అన్నట్టు, ఉగాది పండుగనాడైనా సాయిబుగారి జాతకం చూద్దాం.

జాతకానికి అలాంటి పట్టింపులేవీ ఉండవుగా మరి !
 
పాకిస్తాన్ పీఎం ఇమ్రాన్ ఖాన్, 5 అక్టోబర్ 1952 న లాహోర్ లో పుట్టాడు. ఇతనిది అశ్వనీ నక్షత్రం. ఈ నక్షత్రం వారికి దేహశక్తి ఎక్కువగా ఉంటుంది. గుర్రంలాగా కష్టపడగలరు. కనుక, మిలటరీ, ఆటలు, బాక్సింగ్ వంటి యుద్ధవిద్యలు వీరికి బాగా నప్పుతాయి. కుజుడు గనుక మంచిస్థితిలో ఉంటే వీటిలో రాణిస్తారు. ఈ జాతకంలో కుజుడు మిత్రస్థానం లోనే ఉన్నాడు. నవాంశలో స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు. పైగా, గజకేసరీయోగంతో కోణదృష్టిలో ఉన్నాడు. కుజబలం ఉంది గనుక క్రికెటర్ గా రాణించాడు.

ఇదే గజకేసరీయోగం అధికారాన్ని కూడా ఇచ్చింది. దానికి బలం చేకూర్చినది ఉచ్చబుధునితో కలసి ఉన్న బుధాదిత్య యోగం. అందుకే పాకిస్తాన్ కు పీఎం అయ్యాడు. అయితే, శనిస్పర్శవల్ల ఈ యోగం భంగమైపోతుంది. దీనికి ముహూర్తం సరిగ్గా ఫిబ్రవరి 24 న, అదికూడా శనీశ్వరునితోనే, పడింది. ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను, చేసిన తప్పులకు శిక్షలు వేసేది శనీశ్వరుడే అని. దీనిని ఎవరూ తప్పించుకోలేరు. 

24 ఫిబ్రవరి 2022

ఆ రోజున ఇమ్రాన్ రష్యా వెళ్ళాడు పుతిన్ని కలవడానికి. ఆ సమయంలో అతని జాతకం ఏమీ బాగాలేదు. కారణం? గోచారశని ఆ రోజున అతని రాహువుమీద డిగ్రీయుతితో సంచరించాడు. ఇది శపితయోగాన్ని నిద్రలేపుతుంది. ఇతని నవాంశలో శనిరాహువు లిద్దరూ సింహంలో ఉన్నారు. అధికారపరంగా శపితయోగం ఉంది. కనుక అదేరోజున ఇమ్రాన్ ఖర్మకాలింది.

సరిగ్గా, అదేరోజున పుతిన్, ఉక్రెయిన్ మీద యుద్ధాన్ని ప్రకటించాడు. ఆ సమయంలో ఇమ్రాన్ పక్కనే హోటల్లో టిఫిన్ చేస్తున్నాడు. ఆ సమయానికి అతనక్కడుండటం అమెరికాకు అనుమానం తెప్పించింది. 'వీడు మనతో నాటకాలేస్తున్నాడు. మనదగ్గర డబ్బులు తీసుకుని రష్యాకు వంతపాడుతున్నాడు. వీడిని దించేద్దాం' అనుకుంది. పావులు కదిపింది. తన చేతిలో ఉన్న పాక్ రాజకీయవర్గం చేత ఇమ్రాన్ ప్రభుత్వానికి సపోర్ట్ విరమింప జేయించింది. అవిశ్వాస తీర్మానం పెట్టించింది. ఇమ్రాన్ పని అయిపోయింది. రేపటితో ఇతని పదవి ఊడిపోతుంది.

నవాంశలోని శపితయోగం అలా పనిచేసింది.

ఇతనిజాతకంలో గజకేసరీయోగం ఉంది నిజమే. అయితే,  గురువు వక్త్రత్వం వల్ల అది బలహీనంగా ఉంది. ప్రస్తుతం ఇతనికి నడుస్తున్న గోచార శపితయోగం ముందు దాని బలం వీగిపోయింది. పదవీగండం ఏర్పడింది.

నవాంశలో ఇంకొక యోగం కూడా ఉంది. అదే, మిథునంలో అమావాస్యయోగం. మిథునమంటే అమెరికా. కనుక, అమెరికా వల్ల ఇతని జీవితంలో అమావాస్య ఏర్పడింది. ఏ అమెరికాను చూచుకొని ఇన్నాళ్లూ మనతో విర్రవీగారో అదే అమెరికా వల్ల ఇప్పుడు పాకిస్తాన్ లో ప్రభుత్వం మారుతోంది.

ఈ తెలుగు ఉగాది ఇమ్రాన్ పదవికి ఎసరుపెట్టబోతున్నది. షెబాజ్ షరీఫ్ కు అదృష్టం పట్టబోతున్నది. ఈ విధంగా గ్రహాలముందు రాజులూ మహారాజులూ కూడా తలలు వంచవలసిందే మరి ! ఆఫ్టరాల్ వాళ్ళూ మనలాంటి మానవమాత్రులేగా !