నిన్నంతా అదిలాబాద్ స్టేషనూ, చుట్టుపక్కల యూనిట్లూ ఇన్స్పెక్షన్ చేశాను. అక్కడ ఎండలు మండిపోతుంటాయి. వద్దని కొందరు సలహా ఇచ్చారు. 'ఏమీ పరవాలేదు. మన రెసిస్టెన్స్ ఎంత ఉందో టెస్ట్ చేసుకుందాం' అన్నాను.
కృష్ణా ఎక్స్ప్రెస్ ఎక్కి ఉదయం ఆరింటికి అదిలాబాద్ లో దిగాం. దిగడంతోనే అక్కడ ఆరా అంతా లేజీగా, లెయిడ్ బ్యాక్ గా అనిపించింది. ఇలా స్లీపీగా, లేజీగా ఉండే ఊర్లు నాకు బాగా నచ్చుతాయి. జనాలు చెప్పినట్లు ఎండలు నిజంగానే మండిపోతున్నాయి. కానీ గుంటూరు ఎండలతో పోల్చుకుంటే తక్కువే అనిపించాయి. హ్యుమిడిటీ తక్కువ కావడంతో ఇక్కడ చెమటలు లేవు. కానీ ఇదే డేంజర్ అనుకుంటా, ఉన్నట్టుండి వడదెబ్బ తగిలి పడిపోతారు. చెమట పడుతూ ఉంటే బాడీ టెంపరేచర్ ని కాపాడుతుంది.
స్వదేష్ ఖందారే అని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆ సెక్షన్లో ఉన్నాడు. ఆరున్నర అడుగుల ఎత్తులో మంచి బలిష్టంగా పహిల్వాన్ లాగా ఉన్నాడు. తెలుగు రాదు. సంభాషణ అంతా హిందీలోనే సాగింది.
టిఫిన్ చేసే సమయంలో, మాటల మధ్యలో, 2015 లో సివిల్స్ ఇంటర్వ్యూ దాకా వెళ్లానని కొద్దిలో పోయిందని అన్నాడు. 1988 లో నాకూ అదే జరిగిందని చెప్పాను. నిరుత్సాహ పడవద్దని, డిపార్ట్ మెంటల్ ఎగ్జామ్స్ వ్రాయమని చెప్పాను. తనది జబల్ పూర్ అని తెలిసింది. జబల్ పూర్ లో మా స్నేహితుడు నాగేశ్వర్రావు 1980 లో పీజీ చేశాడని అన్నాను. అప్పుడే తను పుట్టానని అన్నాడు.
ఓషో కూడా జబల్ పూర్ యూనివర్సిటీలో పనిచేశాడని అన్నాను. ఓషో పేరు వినడంతోనే అతని ముఖం వెలిగింది.
'మీరు ఓషో బుక్స్ చదువుతారా?' అన్నాడు.
'ఒకప్పుడు చదివాను. 1997 నుంచి 2000 వరకూ పిచ్చిపుట్టినట్లు చదివాను. అన్నీ నమిలేశాను. అప్పట్లో పూనా ఓషో ఆశ్రమానికి కూడా వెళ్ళొచ్చాను చూద్దామని' అన్నాను.
'ఎలా ఉంది మీకక్కడ?' అన్నాడు.
పెదవి విరిచాను.
'ఆశాభంగం చెందాను' అన్నాను.
అతను ఓషో సాహిత్యానికి బాగా ప్రభావితుడైనట్లు కనిపించాడు. అది సహజమే. పుస్తకాల వరకూ చదివితే, ఓషో చాలా గొప్పస్థాయిలో కనిపిస్తాడు. కానీ, ఓషో జీవితం తెలిస్తే, ఆ ఉన్నతమైన అభిప్రాయమంతా ఎగిరిపోతుంది. అదే విషయం అతనితో అన్నాను. పాపం అతనికి లోతుపాతులు తెలియవు. చాలా విషయాలు వివరించి చెప్పినమీదట కన్విన్స్ అయ్యాడు. అయితే, ఓపెన్ గానే తీసుకున్నాడు.
నెట్ ఫ్లిక్స్ లో 'వైల్డ్ వైల్డ్ వెస్ట్' చూడమని అతనితో చెప్పాను. అలాగే, ఒరిగాన్ లో ఏం జరిగిందో లోతుగా రీసెర్చి చెయ్యమని, అప్పుడతనికి నిజాలు తెలుస్తాయని చెబుతూ నా బ్లాగ్ లు చూడమని, నా బుక్స్ చదవమని చెప్పాను.
తన డైరీలో ఓషో కోట్స్ రాసుకున్నవి నాకు చూపించాడు.
'ఓషో కోట్స్ చాలా బాగుంటాయి. మేధస్సు పరంగా ఆయనకు సమఉజ్జీలు చాలా తక్కువమంది ఉంటారు. కానీ చెప్పినవాటిని జీవితంలో ఆచరించడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యాడు. ఆయనొక మంచి తెలివైన లెక్చరర్ మాత్రమే' అని అన్నాను.
అదిలాబాద్ ఊరు ఒక చిన్న టౌన్ లాగా కనిపించింది. మరాఠీలు, గుజరాతీలు, ముస్లిమ్స్, తెలుగువాళ్లు అక్కడ ఉంటున్నారు. ఈ ఊర్లో పురాతనమైన దేవాలయం ఏముందని అడిగితే ఎవరూ చెప్పలేకపోయారు. రైతు బజార్ దగ్గరలో ఒక జగన్నాధ మందిరం ఉందని , అది చాలా పాతకాలం నాటిదని అన్నారు. శక్తిపీఠం అని ఒకటి ఈమధ్యనే కట్టారని, ఒక గుట్టమీద ఉంటుందని, చూపిస్తామని అక్కడి స్టాఫ్ అన్నారు గాని, ఇంకోసారి చూద్దాంలే అని సున్నితంగా తిరస్కరించాను.
ఇక్కడకు దగ్గరలోనే మాహూర్ అనే ఊరుందని, అక్కడ రేణుకాదేవి గుడి చాలా ఫేమస్ అని అన్నారు. ఆమె మా తాతమ్మే గనుక చూద్దామని అనుకున్నాను. కానీ 80 కి. మీ ఉంటుందని, పోయిరావడానికి 4 గంటలు పడుతుందని అన్నారు. 'ముందు వచ్చినపని చూచుకుందాం, గుడులు ఈ సారి వచ్చినపుడు చూద్దాం లే' అన్నాను.
అదిలాబాద్ నుండి కిన్వట్, పింపల్ కుట్టి ఊర్లవైపు రెండు గేట్లున్నాయి. వాటి ఇన్స్పెక్షన్ చేశాను. ఊరిబైటకు పోయినప్పుడు అక్కడ ఏవైనా ఫామ్ హౌసులు కనిపిస్తే వాటి ఫోటోలు తీసుకోవడం నాకలవాటు. మా ఆశ్రమ నిర్మాణంలో పనికివస్తాయని నా ఉద్దేశ్యం. దానిని స్వదేశ్ గమనించాడు. 'ఎందుకు సార్ ఫోటోలు తీస్తున్నారు?' అని అడిగాడు. చెప్పాను.
'ఏ ఆశ్రమం మీది?' అన్నాడు.
'ఓన్లీ మెడిటేషన్' అని చెప్పాను.
'నేనూ మీ ఆశ్రమంలో చేరుతాను. నాకు మెడిటేషన్ అంటే చాలా ఇష్టం' అన్నాడు.
నవ్వి, 'అలాగే, ముందు నీ ఫేమిలీ బాధ్యతలు నెరవేర్చు. ఇంకా నువ్వు ప్రయాణం మధ్యలో ఉన్నావు. ఇప్పుడే ఆశ్రమానికి రాలేవు. మధ్యమధ్యలో వచ్చి నేర్చుకుని నీ జీవితంలో వాటిని అనుసరించు' అని సలహా ఇచ్చాను.
ఆశ్రమం అప్ డేట్స్ కోసం, మా వెబ్ సైట్స్, మా ఫేస్ బుక్ చూడమని చెప్పాను.
ఇక్కడ భూముల రేట్లు ఎలా ఉన్నాయని అడిగితే, ఎకరం కోటి దాకా ఉందని అన్నాడు. ఆశ్చర్యం వేసింది. 'నీళ్లు కనపడటం లేదు. అంత రేట్లా?' అంటే, తెలంగాణా ఎఫెక్ట్ అన్నాడు.
'మా ఫ్రెండ్, నాతోపాటు సివిల్స్ కి ప్రిపేర్ అయినవాడున్నాడు. అతనికి కూడా ఇంటర్వ్యూలో పోయింది. అతనిప్పుడు Lets Talk India అనే సంస్థను పెట్టాడు. Social Media లో బాగా పాపులర్ అయింది. ఆలిండియా లెవల్లో చాలా క్లిక్ అయింది. అతనికి కూడా ఫిలాసఫీ చాలా ఇష్టం. మీ వెబ్ సైట్స్ పరిచయం చేస్తాను. మీతో కలవడానికి అతను చాలా సంతోషపడతాడు' అన్నాడు.
'సరే, కలవమను' అన్నాను.
తిరుగుప్రయాణంలో, 'జగ్గీ వీడియోస్ కూడా చూశాను. బాగా అనిపించాయి. మీ అభిప్రాయం ఏమిటి?' అన్నాడు.
'ఓషోని కాపీ కొడతాడు. ఓషో చేసిన తప్పులు చేయకుండా జాగ్రత్తపడుతున్నాడు. పొలిటికల్ సపోర్ట్ తీసుకుంటున్నాడు. శివుడి క్రింద షెల్టర్ తీసుకున్నాడు. మార్కెటింగ్ టీమ్ గట్టిది. మంచి బిజినెస్ మ్యాన్. అంతే. ఇంటలెక్చువల్ అప్పీల్ తప్ప, ఆయనలో కొత్తదనమూ లేదు, ప్రత్యేకతా లేదు. దగ్గరవకు, మోసపోతావ్' అన్నాను.
'మీ జబల్ పూర్ లో ఏదో ఉంది. ప్రస్తుతం ఇండియాని ఊపుతున్న గురువులందరికీ అక్కడే బీజాలున్నాయి. ఓషో అక్కడివాడే, మహేష్ యోగి అక్కడివాడే. ఆయన గురువైన బ్రహ్మానందస్వామి నుంచే సిద్ధసమాధియోగా పుట్టింది. జగ్గీ, రవిశంకరూ ఇద్దరూ దాని ప్రోడక్ట్ లే. ఇప్పుడు వేరే కుంపట్లు పెట్టుకున్నారు. రిషి ప్రభాకర్ పోయాడు. వీళ్ళు నిలబడ్డారు. కొత్తసీసాలో పాతసారా. అంతే' అన్నాను.
అతను చాలా ఆశ్చర్యపోయాడు, 'ఈ విషయాలన్నీ మాకు తెలీవు' అనిమాత్రం అన్నాడు.
'ఎలా తెలుస్తాయి? పుస్తకాలు చదివితే అంతవరకే తెలుస్తుంది? అబ్బో అనుకుంటారు. అసలు నిజాలు తెలియాలంటే దగ్గరకు పోయి చూడాలి. తమిళనాడులో జగ్గీ గురించి చాలా కధలున్నాయి. వాటిలో నిజాలు కూడా ఉన్నాయి. వాళ్ళని కదిలిస్తే చెబుతారు చేదువాస్తవాలు' అన్నాను.
అతనేమీ మాట్లాడలేదు.
ఆదిలాబాద్ నుండి కొంతమంది స్టాఫ్, ఫెమిలీని జబల్ పూర్, నాగపూర్ లలో పెట్టి, వీకెండ్స్ లో అక్కడకు పోయి వస్తారని తెలిసింది. ఇదే హైవే మీద అయిదారు గంటల్లో ఆ ఊర్లకు పోవచ్చని చెప్పాడు. ఆశ్చర్యం వేసింది. ఎవరి కారణాలు వాళ్ళవి పాపం !
రోజంతా తిరిగి తిరిగి పనిచేశాము. ఈలోపల అతను నెట్లో మన వెబ్ సైట్లు చూచాడు. ఇంకేముంది? చాలా ఇంప్రెస్ అయిపోయాడు. రెండ్రోజులు ఉండమంటాడు. తన కార్లో అదిలాబాద్ అంతా తిప్పి చూపిస్తానంటాడు. నాకేమో తిరగడం ఇంట్రెస్ట్ లేదు.
అతనికి వింత అనిపించినట్లుంది.
'ఇప్పటిదాకా వచ్చినవాళ్ళందరూ 'అటు పోదాం ఇటు పోదాం, ఇక్కడ గుళ్ళూ గోపురాలూ తిప్పండి' అన్నవాళ్ళేగాని, తిప్పుతామంటే వద్దన్నది మీరే' అన్నాడు.
'అది వాళ్ళ ఇంట్రెస్ట్. ఇది నా ఇంట్రెస్ట్. పరుగెత్తి పాలు త్రాగడం కంటే, నిలబడి నీళ్లు త్రాగితే నాకు హాయిగా ఉంటుంది' అని హిందీలో సాధ్యమైనంత అర్థమయ్యేటట్లు చెప్పాను.
అర్ధం కానట్లు ముఖం పెట్టాడు.
అప్పుడు భోజనం చేస్తున్నాం.
'భోజనంలో మీరు ఒక్కొక్కటి తింటారు. నేను మొత్తం కలగలిపి తింటాను' అన్నాను.
'అస్సలర్ధం కాలేదు. దీనికంటే ఆ సామెతే సులువుగా ఉంది' అన్నాడు.
మొదటిరోజే హై డోస్ ఎందుకని, నవ్వేసి ఊరుకున్నా.
ఆదిలాబాద్ చాలా వెనుకబడిన టౌనంటారు. కానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడూ తినని మంచి భోజనం అక్కడ దొరికింది. హైదరాబాద్ లో కూడా అలాంటి భోజనం తినలేదు. కొన్ని విచిత్రాలలాగే ఉంటాయి. ఎడారిలోనే ఒయాసిస్సులుండేది మరి !
మొత్తమ్మీద సాయంత్రానికి వదల్లేక వదల్లేక సెలవు తీసుకున్నాడు. 'మీరిక్కడికి రావడం నా అదృష్టం. ఈసారి వచ్చినపుడు రెండ్రోజులు ఉండేటట్లు రావాలి. అన్నీ తిప్పి చూపిస్తా'నంటాడు. అతన్ని బాధపెట్టడం ఎందుకని, 'సరే అలాగే వస్తాలే' అని చెప్పాను.
రాత్రికి మళ్ళీ కృష్ణా ఎక్స్ప్రెస్ లో తిరుగు ప్రయాణం. మాతోపాటు బండెక్కి కూచున్నారు. బండి కదులుతుంటే, 'ఇక దిగండి' అని వాళ్ళను క్రిందకు తొయ్యవలసి వచ్చింది. వదలడం లేదు. ఒక్కరోజుకే అలా అయిపోయారు. మరి ఏళ్ళనుంచీ అంటిపెట్టుకుని ఉన్నవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆలోచిస్తే నాకే బాధనిపించింది.
బండి కదిలింది. ఆలోచిస్తూ బెర్త్ లో వెనక్కు వాలాను.
'మనలాంటి సేమ్ వేవ్ లెన్త్ ఉన్నవాళ్ళకోసం వెదుకులాటేనేమో జీవితమంటే? అందుకేనేమో, కొందరు ఒక్కరోజులోనే వదల్లేనట్లు అతుక్కుపోతారు. మరికొందరు ఏళ్ల తరబడి తెలిసున్నా ఏమీ ఉండదు' అనుకుంటూ కళ్ళు మూసుకున్నాను. మధ్యలో ఒకసారి లేచిచూస్తే, బాసర స్టేషన్ లో ఉన్నాం. మళ్ళీ కళ్ళు మూసుకున్నా.
లేచేసరికి తెల్లవారింది. సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేసింది.