Pages - Menu

Pages

26, ఏప్రిల్ 2022, మంగళవారం

మీ విధానంలో జ్యోతిష్యం నేర్చుకుంటే ఏమౌతుంది?

మొన్నొకాయన ఇలా మెయిల్ ఇచ్చాడు.

'మీరు రాసిన 'వైద్యజ్యోతిష్యం' చదివాను. బాగుంది. మీతో కొంచం మాట్లాడాలి. ఫోన్ నంబర్ ఇస్తారా?'

'సరే పాపం కష్టపడి బుక్కు చదివాడు కదా? ఏం మాట్లాడతాడో చూద్దాం', అనుకుని ఇచ్చాను.

వెంటనే ఫోన్ చేసాడు. సంభాషణ ఇలా నడిచింది.

'మీ ఎనాలిసిస్ విధానం నాకు బాగా నచ్చింది. మీ విధానంలో జ్యోతిష్యం నేర్చుకుంటే ఏమౌతుంది?'

ఇలా అన్నాను.

'జ్యోతిష్యం మీద విరక్తి కలిగి, జ్యోతి మీదకు మనసు పోతుంది'

ఆయన ఖంగుతిన్నాడు. కాసేపు ఫోన్లో మౌనం.

'అంటే, అర్ధం కాలేదండి' అన్నాడు.

'ఇందులో అర్ధం కానంత బ్రహ్మసూత్రాలు ఏమీ లేవండి. ప్రతిదానికీ గ్రహాలు, తిధులు అంటూ చూసుకునే ధోరణి పోతుంది. లోకంలో మీరు చూస్తున్న జ్యోతిష్యం అంటే విరక్తి కలుగుతుంది. వెలుగు వైపు దృష్టి మళ్లుతుంది. ఆ వెలుగుని నేను జ్యోతి అన్నాను' అని చెప్పాను.

'ఓ అదా ! చంపేశారు. నేను ఇంకేదో అనుకున్నాను' అని గొల్లున నవ్వాడు.

నేను మౌనంగా ఉన్నాను.

'ఇంకొక్క ప్రశ్న అడగవచ్చా?' అడిగాడు.

'ఓ అడగండి' అన్నా, 'రోలు - పోటు' సామెతని గుర్తు చేసుకుంటూ.

'మీరు అంటున్న వెలుగు ఏమిటి?' అన్నాడు.

'జీవితంలోని మౌలికవిషయాల గురించి మీలో ఆలోచన తలెత్తుతుంది. ఆ దారిలో మీలో ఆలోచనా తరంగాలు పుడతాయి. పాత పోస్టులలో అవేంటో వ్రాశాను. చదువుకోండి' అన్నాను.

'అంటే, ఆ వెలుగు అందినప్పుడు, ఇక జ్యోతిష్యంతో పని ఉండదంటారా?' అన్నాడు.

'ఉండదు' అన్నాను.

'పోనీ, వేరేవాళ్లకు మేము చెప్పొచ్చా మీ దగ్గర నేర్చుకుని?' అడిగాడు.

'డబ్బులు తీసుకోకుండా చెప్పవచ్చు' అన్నాను.

'తీసుకుంటే ఏమౌతుంది?' అన్నాడు.

'వాళ్ళ కర్మ మీ నెత్తిన కూచుంటుంది. మీరు మునుగుతారు' అన్నాను.

'ఆమ్మో. ఇది కొంచం డేంజర్ సబ్జెక్ట్ లాగుంది కదండీ?' అన్నాడు నెమ్మదిగా.

'కొద్దిగా కాదు. చాలా డేంజర్. ఆటలాడితే చేతులు కాలతాయి' అన్నాను సీరియస్ గా.

'అలా కాలకుండా ఉండాలంటే?' మళ్ళీ ప్రశ్న.

'స్వార్ధానికి అతీతంగా ఒక ఋషిలా మీరు బ్రతకాలి. అప్పుడు కాలవు' అన్నా.

'అది కష్టం కదండీ?' అన్నాడు.

'అవును. కష్టమే' అన్నాను.

'మరి చాలామంది జ్యోతిష్కులు ఉన్నారు కదా లోకంలో. వాళ్ళు చేస్తున్నది తప్పంటారా?' అడిగాడు కుతూహలంగా.

'వాళ్ళు తప్పనడానికి నేనెవర్ని? అది వాళ్ళిష్టం. ఈ లోకంలో ఎవడి ఖర్మ వాడిది. చేసుకున్నవాడు పడతాడు. అంతే' అన్నాను.

'మరైతే జ్యోతిష్యం నేర్చుకోవడం తప్పేగా?" అన్నాడు.

'అలా అని నేననలేదు. సరైన దారిలో నేర్చుకోండి అని మాత్రమే అంటున్నాను' అన్నాను.

'అంటే మీ దగ్గరా?' అడిగిన ప్రతి ప్రశ్నకూ చెబుతున్నాను కదా, కొంచం కొంటెదనం ధ్వనించింది.

'అట్లా నేర్పడానికి నేను సిద్ధంగాలేను' అన్నాను.

'సరేనండి. ఇంకో ప్రశ్న అడగవచ్చా?' అన్నాడు.

'ఒక ప్రశ్న అని, ఇప్పటికి ముప్పై ఆరు ప్రశ్నలు అడిగారు. ముచ్చట్లకు నాకు టైం లేదు. నాకు వేరే పనుంది. ఇక ఫోన్ చెయ్యకండి.  చేస్తే మీ నంబర్ బ్లాక్ చేయబడుతుంది' అని ఫోన్ కట్ చేశాను.