Pages - Menu

Pages

2, ఏప్రిల్ 2022, శనివారం

ఒకడు - ఇంకొకడు

మంటల్లో నెయ్యిని పోస్తూ

మరోలోకం అనేవాడొకడు

తానే లేకుండాపోతూ

తన్మయమయ్యే వాడొకడు


జీవహింస కూడదంటు

ఆత్మహింస పడేదొకడు

అప్పుచేసి పప్పుకూడు

ఆదమరచి తినేదొకడు


అన్నీ ఉన్నాయిగాని

ఆ క్షణానికి లేవంటాడొకడు

అసలేవీ లేకపోయినా

ఉన్నట్లుగా ఉంటాయని ఒకడు


మనసే అంతా అని ఒకడు

మనసెక్కడుందని ఇంకొకడు

ఆత్మే అంతా అని ఒకడు

ఆత్మే లేదంటూ ఇంకొకడు


సృష్టికి కర్తని ఒకడు

సృష్టే కర్తని ఇంకొకడు

ఆదీ అంతమని ఒకడు

అనాది అంటూ ఇంకొకడు


మట్టీ కుండని ఒకడు

మట్టే కుండని ఇంకొకడు

కుమ్మరి చేశాడని ఒకడు

కుమ్మరెలా వచ్చాడని ఇంకొకడు


రెండే అంటూకూడా

ఒక్కదాన్ని చూస్తాడొకడు

ఒకటే అంటూకూడా

రెంటితో బ్రతుకుతాడొకడు


బొందిని దాటితే స్వర్గమని ఒకడు

బొందితోనే స్వర్గమని ఇంకొకడు

బొందిలోకి స్వర్గమని ఒకడు

'మీ బొంద' స్వర్గమే లేదని ఇంకొకడు


బ్రతికున్నవాడిని చంపి

చచ్చాక పూజించేదొకడు

చస్తావా మారతావా

అంటూ చంపబోయేదింకొకడు


నన్ను నమ్ముకుంటే

అన్నీ ఇస్తానని ఒకడు

నన్ను నమ్మకుంటే

అన్నీ లాక్కుంటానని ఇంకొకడు


మంత్రగత్తెలంటూ

మంటల్లో కాల్చేవాడొకడు

కరుణా జాలీ అంటూ

కబుర్లు చెప్పేవాడొకడు


దేవుడొక్కడే అంటూ

వాడికి రూపం లేదంటూ

బ్రతికున్న మనిషిపైన

బాంబులేసే వాడొకడు


మాయమాటలు చెబుతూ

మతాలు మార్చేదొకడు

మెడమీద కత్తిపెట్టి

కుచ్చుటోపీ పెట్టేదొకడు


ఆకారాన్ని పూజించేదొకడు

అవకాశాన్ని ఆరాధించేదొకడు 

కొయ్యని కొలిచేవాడొకడు

గోడకి మొక్కేవాడొకడు 


పొద్దంతా డబ్బంటూ

కుక్కలాగా బ్రతికేదొకడు

ఇదంతా అర్ధం కాక

బిక్కచూపులు చూచేదొకడు


ఇన్నీ తెలిసినా

మట్టిలో కలిసేదొకడు

ఇవేవీ తెలియకపోయినా

మట్టిలో మాణిక్యం మరొకడు