“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

24, ఏప్రిల్ 2022, ఆదివారం

ఆ గుడి చాలా పవర్ ఫుల్ అంటగా?

నిన్న పనుండి ఒకచోటకు వెళితే అక్కడ ఒక కొలీగ్ ఆఫీసర్ కలిశాడు. చాలా నియమనిష్టలు పాటిస్తూ, గుళ్ళూ గోపురాలూ తిరుగుతూ, పారాయణాలు చేస్తూ చాలా భక్తిగా ఉంటాడు. ఆ మాటా ఈ మాటా మాట్లాడాక 'ఎక్కడ సెటిలవుతున్నారు?' అన్న ప్రస్తావన వచ్చింది.

'జిల్లెళ్ళమూడిలో కొన్నాళ్ళు, ఒంగోలు ఆశ్రమంలో కొన్నాళ్ళు ఉంటాను. మిగతా సమయం మనదేశం, ఇతర దేశాలు తిరుగుతాను. హైద్రాబాద్ అప్పుడప్పుడు వస్తాను' అని చెప్పాను.

'జిల్లెళ్ళమూడి అమ్మగారిని మీరు చూశారా?' అడిగాడాయన సంభ్రమంగా.

'చిన్నపుడు ఒక అయిదు నిముషాలు చూశాను' అన్నాను.

'మరి ఇలా, ఎలా?' అన్నాడు.

'భావజాలంలో సారూప్యత. అంతే' అన్నాను.

'అదేంటి? మీది గుంటూరేకదా? రిటైరయ్యాక అక్కడ ఉండరా?' అన్నాడు.

'ఇంట్రెస్ట్ లేదు' అన్నాను. 

'గుంటూరు విద్యానగర్ లో సాయిబాబా గుడి చాలా పవర్ ఫుల్ అట కదా?' అడిగాడు అమాయకంగా.

అరవైలలోకి వస్తున్న ఆయన అలా అడిగితే నవ్వొచ్చింది. జాలేసింది.

'ఏం? కొండరాళ్లతో కట్టారా?'  అడిగా నవ్వుతూ.

ఆయనకర్ధం కాలేదు.

'అదికాదు. అక్కడకు చాలామంది  మహనీయులు వచ్చారట. వాళ్లలో జిల్లెళ్ళమూడి అమ్మగారు కూడా ఉన్నారట' అన్నాడు.

ఆయన ఏ పుస్తకం లోంచి ఇది చదివాడో అర్ధమైంది. అయినా తెలీనట్టు 'అవునా? ఎవరు చెప్పారు?' అనడిగా.

'సాయి సచ్చరిత్ర పారాయణం చేస్తున్నా. అందులో రాసుంది' అన్నాడు.

'ఓ ! భరద్వాజగారు రాసినదా?' అన్నా.

'అవును' అన్నాడు.

'మహనీయులు వచ్చినందుకు గుడికి మహత్యం వచ్చిందా?' అన్నా నవ్వుతూ.

ఇదికూడా ఆయనకు వెలగలేదు.

'మీది గుంటూరే కదా ! ఈ గుడి మహత్యం మీకు తెలిసే ఉంటుందని అడుగుతున్నా' అన్నాడు.

'నేను గుంటూరులో ఉన్న పాతికేళ్లలో ఒక్కసారికూడా ఆ గుడికి పోలేదు' అన్నా మళ్ళీ నవ్వుతూ.

'ఎందుకు? మీరు సాయిబాబాను నమ్మరా?' అడిగాడాయన.

'ఆయనే నన్ను నమ్మడం లేదు. అయినా నాకు మహత్యాలంటే చాలా భయం. వాటికి  ఆమడ దూరంలో ఉంటా' అన్నా.

'ఏంటో మీరు చెప్పేది ఏమీ అర్ధం కావడంలేదు' అన్నాడు.

'కొన్ని అర్ధం కాకపోవడమే మంచిది లెండి' అన్నా మళ్ళీ నవ్వుతూ.

'జిల్లెళ్ళమూడి అమ్మగారిని  నమ్మితే మంచి జరుగుతుందా?' అడిగాడు ఊరుకోకుండా.

'నమ్మకపోయినా జరుగుతుంది' అన్నా.

ఆయనకు కొంచం కోపం వచ్చింది.

'అవుననుకోండి. జరిగేది ఎలాగూ జరుగుతుంది. ఎవరూ తప్పించలేరు. కాకపోతే కొంచం... ' అన్నాడు అర్ధోక్తిగా.

ఇంతలో టీ వచ్చింది. సిప్ చేస్తూ, 'అవును. కొంచం షుగర్  ఎక్కువైంది' అన్నా.

ఆయన అదో రకంగా చూశాడు.

అంతకంటే ఎక్కువగా ఏడిపించడం ఎందుకనిపించి, 'జిల్లెళ్ళమూడి అమ్మగారి తత్త్వం అర్ధమైతే ఒక మిరకిల్ జరుగుతుంది' అన్నా.

'ఏంటది?' అన్నాడు ఆత్రంగా.

'అడుక్కునే మనస్తత్వం పోతుంది, దేవుడినైనా సరే' అన్నా.

'అదేంటి?' అన్నాడు అయోమయంగా.

'ఇదీ అర్ధం కాలేదా? మీరు చేస్తున్న పుస్తకం పారాయణం ఇంకో లక్షకోట్ల సార్లు చెయ్యండి. అర్ధం కావచ్చు. అప్పటికీ అర్ధం కాకపోతే గుంటూరెళ్లి సాయిబాబా గుడిగోడను మీ తలతో మోది చూడండి. ఎంత పవర్ ఫులో తెలుస్తుంది. ఉంటామరి. బై' అని లేచొచ్చేశా.