నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

1, మే 2022, ఆదివారం

గుండె గుడి

మా ఆశ్రమాన్ని ఎనౌన్స్ చేసినప్పటినుండీ రకరకాల ఈ మెయిల్స్ ను నేనందుకుంటున్నాను. ఇంతకుముందయితే, రకరకాల సమస్యలను ఏకరువు పెడుతూ, వాటికి నివారణోపాయాలు అడుగుతూ మెయిల్స్ వచ్చేవి.  సిన్సియర్ గా ఉన్నారని నాకనిపిస్తే ఆ సమస్యలు ఎలా పోతాయో చెప్పేవాడిని. అడిగేవారిలో తింగరితనం కనిపిస్తే అదే రకంగా జవాబులిచ్చేవాడిని. కానీ ఆశ్రమం ఎనౌన్స్ చేశాక ఈ ట్రెండ్ చాలావరకూ మారింది. ఇప్పుడు ఇంకోరకంగా వస్తున్నాయి.

'మీరు అమ్మవారి భక్తులు కదా ! మీ ఆశ్రమంలో కాళీమాతకు గుడి కడితే ఎలా ఉంటుందో ఆలోచించండి' అని ఒక మహాభక్తుడు మెయిలిచ్చాడు

'ఓకె అలాగే, మీరు స్పాన్సర్ చేసి కట్టించండి. నాకేం అభ్యంతరం లేదు' అన్నాను

'ఆమ్మో గుడంటే మాటలా? కనీసం ఏభై లక్షలు అవదా?' అన్నాడు

'అంతేనా? ఏభై కోట్లు పెట్టి అయినా కట్టవచ్చు సరదాగా ఉంటే' అన్నాను

 'ఆమ్మో. మావల్ల ఎక్కడౌతుంది?' అన్నాడు.

'అంతేలెండి. సలహాలంటే కిలోల లెక్కన ఇవ్వచ్చు. పనిమాత్రం మేం చెయ్యాలి. అప్పుడు మీకు సరదాగా ఉంటుంది. వీలైతే ఇంకో కిలో సలహాలు ఉచ్చితంగా పారేస్తారు. అంతేకదా?' అన్నాను మొహమాటం లేకుండా'

'అది కాదండి ఆశ్రమమంటే గుడి ఉండాలి కదా?' అన్నాడు పట్టు వదలకుండా.

'ఉంటుంది. గుడి ఉండదని ఎవరన్నారు. అడుగడుక్కీ ఉంటుంది' అన్నాను

'అదెలా?' అడిగాడు

'మాలో ప్రతీవాడి గుండె ఒక గుడిగా మారుతుంది మాలో ప్రతివాడూ ఒక నడిచే గుడే/ మాకు ప్రత్యేకంగా ఒక గుడి అక్కర్లేదు కాళీమాత మా గుండెల్లోనే ఉంటుంది' అన్నాను

'అర్ధమైంది' అన్నాడు

'మీలాంటి వాళ్ళకి అంత తేలికగా అర్ధం కాదు. చెప్తా వినండి. ప్రస్తుతం లోకంలో ఎన్నో గుళ్ళున్నాయి.  ఎవరి మతానికి వాళ్లకి మందిరాలున్నాయి, కానీ మనుషుల్లో ఎంతమంది మనుషులుగా ఉన్నారు? కనుక ప్రస్తుతం కావలసింది ఇంకా ఇంకా గుళ్ళు కాదు. వ్యాపారసంస్థలూ కాదు. మనిషిని మనిషిగా, ఆ తరువాత ఒక దేవతగా తీర్చిదిద్దే బడి కావాలి. అదే మా ఆశ్రమం. ఇంతకు ముందు పోస్టులలో చెప్పా చూడండి.  'మా ఆశ్రమం, మిగతా ఆశ్రమాల లాగా వ్యాపార ఆశ్రమం కాదు, ఇక్కడ వ్యాపారం ఉండదు' అని. మా దగ్గర అసలైన వ్యవహారం మాత్రమే ఉంటుంది. మీరు చూడగలిగితే, మా ఆశ్రమంలో అడుగడుగునా మీకు దైవత్వం తొణికిసలాడుతూ కనిపిస్తుంది.

మా ఆశ్రమంలో గుడి ఉండదు, ఎందుకంటే మా ఆశ్రమమే ఒక పెద్ద గుడి. అంతేకాదు, ఇది జీవితాలను మార్చే బడి. కుళ్లిపోతున్న మనిషి జీవితాన్ని దైవత్వంతో నింపే అమ్మ ఒడి. మాయతో నిండి అఘోరిస్తున్న ఈ ప్రపంచం నుంచి మిమ్మల్ని కాపాడే దడి. మీరు కనీ వినీ ఎరుగని అతీతానుభవాలను ప్రసాదించే దివ్యత్వపు జడి. ఇక్కడ గుడి, సిమెంట్ కట్టడాలలో ఉండదు, మా మనసులలో ఉంటుంది, మా జీవనవిధానంలో ఉంటుంది' అన్నాను.

తిరిగి రిప్లై రాలేదు/

బహుశా ఆయన తలలో ఒక జీరో క్యాండిల్ లైటన్నా వెలిగి ఉంటుందని భావించా

అంతేకదూ !