Pages - Menu

Pages

29, మే 2022, ఆదివారం

'సర్వసార ఉపనిషత్' - మా క్రొత్త పుస్తకం విడుదల


కృష్ణ యజుర్వేదాంతర్గతమైన 'సర్వసార ఉపనిషత్' ను మా 43 వ పుస్తకంగా నేడు విడుదల చేస్తున్నాము. పేరుకు తగినట్లే ఇది అన్ని ఉపనిషత్తుల సారమై యున్నది. దీనికి, 'సర్వసారోపనిషత్, సర్వోపనిషత్, సర్వోపనిషత్సారము' అని వేర్వేరు పేర్లున్నాయి.

నిత్యజీవితంలో మనం -- జ్ఞానం, అజ్ఞానం, బంధం, మోక్షం, పంచకోశములు, జీవుడు, ఆత్మ, పరమాత్మ, పరబ్రహ్మము అనే పదాలను చాలా సాధారణంగా వాడేస్తూ ఉంటాము. కానీ వాటి అర్ధాలేమిటో మనకు తెలియవు. తెలుసని అనుకుంటాం గాని, నిజానికి వీటి అసలైన అర్ధాలు మనకు తెలియవు. అవి సరిగా అర్ధమైతే గాని, వేదాంతము అర్ధం కాదు. వేదాంతమంటే ఉపనిషత్తులలో చెప్పబడిన జ్ఞానభాగం.

ఉపనిషత్తులు 108 ఉన్నాయి గాని, వాటిలో ప్రామాణికములైనవి పది ఉపనిషత్తులే. ఆదిశంకరులు వీటికి భాష్యం వ్రాశారు. వేలాది ఏళ్ల కాలగమనంలో ఎన్నో కొత్తకొత్త ఉపనిషత్తులు పుడుతూ వచ్చాయి. వాటిల్లో కొన్ని, పది ఉపనిషత్తులలోని కొన్ని విషయములను తీసుకుని వివరిస్తూ వచ్చాయి. చిన్నవైన ఈ ఉపనిషత్తులను  సామాన్యోపనిషత్తులంటారు. వాటిలో ఇది ఒకటి.

దీనిని కూడా ఉచితపుస్తకంగా విడుదల చేస్తున్నాము. Google Play Books నుండి దీనిని ఇక్కడనుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఈ పుస్తకం తయారు కావడానికి ఎంతో శ్రమించి అతి తక్కువకాలంలో దీని టైప్ సెట్టింగ్, డీటీపీ వర్క్ చేసిన నా శిష్యురాలు అఖిలకు. అద్భుతమైన ముఖచిత్రాన్ని చిత్రించి ఇచ్చిన శిష్యుడు ప్రవీణ్ కు, సంస్థ కార్యక్రమాలలో మాకందరికీ వెన్నుదన్నుగా నిలుస్తున్న నా శ్రీమతి సరళాదేవికి కృతజ్ఞతలు. ఆశీస్సులు.

ఉపనిషత్తులలోని ఈ అద్భుతమైన జ్ఞానాన్ని చదివి అర్ధం చేసుకోండి. అసలైన హిందూమతం యొక్క స్థాయి ఏమిటో, అదేం చెప్పిందో గ్రహించండి. అలా అర్ధం చేసుకున్న విషయాలను మీమీ జీవితాలలో ఆచరించడానికి ప్రయత్నించండి. అప్పుడే ఈ దేశంలో పుట్టినదానికి సార్ధకత ఉంటుంది.

ఈ దేశంలో పుట్టి, అద్భుతమైన ఈ దేశపు ప్రాచీనవిజ్ఞానాన్ని తెలుసుకోలేకపోతే, దానిని అందిపుచ్చుకోలేకపోతే, అంతకంటే దురదృష్టం ఇంకేమీ ఉండదు మరి !

మా ఇతర పుస్తకాలలాగే దీనిని కూడా ఆదరిస్తారు కదూ !