జ్యోతిష్య పరంగా చూద్దాం.
ప్రస్తుతం కుంభరాశి నుండి వృషభరాశి వరకూ గ్రహాలన్నీ గుమిగూడి ఉన్నాయి. ఏదో దుర్ఘటన జరిగినప్పుడు జనం గుంపులుగా గుమిగూడి చూచినట్టు ఈ దృశ్యం ఉన్నది. గత వారం నుంచీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అన్ని దుర్ఘటనలకూ ప్రస్తుతం ఖగోళంలో ఉన్న ఈ గ్రహస్థితే కారణం.
కుజుడు, గురువు దాదాపుగా ఒకే డిగ్రీమీద ఉంటూ, శపితయోగంలో బందీలై ఉన్నారు. వారిమీద శని, ప్లూటో, శుక్ర, బుధుల ప్రభావాలున్నాయి. అందుకనే, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దుర్ఘటనలు గత వారం నుంచీ జరుగుతున్నాయి. అవన్నీ వివరించడం నా ఉద్దేశ్యం కాదు.
మేషరాశి కొండకోనలను సూచిస్తుంది, అదేవిధంగా నేపాల్ దేశాన్ని కూడా సూచిస్తుంది. ప్రస్తుతం మేషరాశి తీవ్రమైన అర్గలదోషంతో ఉన్నది. అందులోనే, చంద్రుడు రాహుగ్రస్తుడై, విమానాలకు సూచకుడైన శుక్రునితో కలసి అర్గళంలో ఉన్నాడు. మరణానికి కారకుడైన యముడు (ప్లూటో) యొక్క కేంద్రదృష్టి వీరిపైన ఉన్నది. నవాంశచక్రంలో, నీచరాహువుతో కూడి ఉన్న చంద్రుడిని వక్రబుధుడు కలుస్తున్నాడు. అంటే, యాంత్రికప్రమాదం సూచింపబడుతున్నది. లెక్క సరిపోయిందనుకుంటాను.
ఈ విమానంలో 22 మంది ప్రయాణీకులున్నారు. రూట్ నంబర్ 4 అవుతున్నది. 2, 4 అనే అంకెలు రాహుకేతువులకు సూచికలు. వీళ్ళు నవాంశలో నీచస్తితులలో ఉన్నారు. 4 అంకెను సూచించే కేతువు ఒంటరివాడుగా తులలో దూరంగా ఉన్నాడు. అందుకే, ఎక్కడో కొండల్లో విమానం కూలిపోయింది. ప్లూటో (మరణం) యొక్క కేంద్రదృష్టి ఈయనమీద కూడా ఉన్నది. 24 గంటలు గడిచిన తర్వాత కూడా శవాలు కొండలలో దిక్కులేకుండా పడి ఉన్నాయి. ఇలాంటి చావులకు కేతువే కారకుడు. ఈ గ్రహయోగాలన్నీ కలసి ఈ భయంకర విమానప్రమాదానికి కారణమైనాయి.
సూక్ష్మవిషయాలను స్పష్టంగా చూపించే షష్ట్యంశ (D-60) చక్రాన్ని గమనిద్దాం.
ఈ పాయింట్స్ అన్నిటినీ అన్వయం చేసుకోండి. నేనక్కర్లేదు, మీరే చెప్పగలుగుతారు ఏం జరిగి ఉంటుందో?
ప్రస్తుతం అమెరికానుండి, మిడిల్ ఈస్ట్ నుండి, యూరోప్ నుండి, ఇండియానుండి, శ్రీలంక వరకూ ప్రతిచోటా జరుగుతున్న దుర్ఘటనలన్నిటికీ ఈ చార్ట్ లో కనిపిస్తున్న గ్రహయోగాలే కారణం. ఇవి ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క విధంగా ప్రభావాన్ని చూపిస్తాయి.
మొత్తం మీద ఈ అమావాస్య, ప్రపంచానికి ఈ బహుమతిని ఇచ్చింది !