నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

5, మే 2022, గురువారం

లౌకికం - ఆధ్యాత్మికం

నిన్న ఏదో పనిమీద మిత్రుడు రవికి ఫోన్ చేశా. తనప్పుడే లలితాపారాయణ చేసి పూజ ముగించి లేస్తున్నాడు. ఇక ఆఫీసుకి బయలుదేరాలి. ఆ టైంలో నేను ఫోన్ చేశా.

'ఏంటి సంగతి?' అన్నాడు ఏదో అర్జెంట్ ఆఫీసు పనేమో అని.

'కంగారు పడకు. అర్జన్ట్ ఏమీ లేదు' అంటూ నేను వినిన న్యూస్ ఒకదానిని గురించి చెప్పా.

'అబ్బా ! ఇప్పుడే పూజ ముగించి లేస్తున్నా. ఇలాంటి లౌకికవిషయాలు ఇప్పుడే చెప్పాలా నువ్వు?' అన్నాడు విసుగ్గా.

నవ్వాను.

'ఇన్నాళ్లుగా ఇన్నేళ్ళుగా నాతో స్నేహం చేస్తున్నావు. ఇదేనా నన్నర్ధం చేసుకున్నది? ఇంకా నువ్వు చాలా ఎదగాలి. లౌకికం, ఆధ్యాత్మికం అంటూ విడివిడిగా లేవు. అవి మన మనసులో ఉన్నాయి. ఆ భేదం పోవాలి. ఉన్నది ఒకటే జీవితం. దానిని నువ్వు కంపార్ట్ మెంట్లుగా విడదీసి, ఇది పవిత్రం, ఇది అపవిత్రం, ఇది లౌకికం ఇది ఆధ్యాత్మికం అంటూ విడగొట్టి చూస్తున్నంతవరకూ ఏమీ లాభం లేదు. నీకున్నది ఒకటే మనసు, ఒకటే జీవితం. దానిని రూములుగా విడగొట్టకు' అన్నా.

'ప్రస్తుతానికి ఇంకా అంత స్థాయి రాలేదు' అన్నాడు నిజాయితీగా.

'జిల్లెళ్ళమూడి అమ్మగారు కూడా.'లౌకికం ఆధ్యాత్మికం అంటూ రెండు లేవు నాన్నా' అనేవారు తెలుసా?' అడిగా.

'ఓహో అలా అన్నారా?' అన్నాడు.

'అవును. అన్నారు. గంగాజలానికీ, మురికినీటికీ, మంత్రాలకూ బూతుమాటలకూ ఏమీ భేదం నీకు కనిపించకుండా పోయినప్పుడే నీవు ఆధ్యాత్మికంగా ఒక కనీసస్థాయికి చేరినట్లు లెక్క అవుతుంది. నువ్వు చదువుతున్న లలితానామాలలో 'సవ్యాపసవ్య మార్గస్ధా' అంటే అర్ధం ఏమిటి? నేనిచ్చిన 'లలితాసహస్రనామ రహస్యార్థప్రదీపిక' చదవమంటే చదవవు. అటకనెక్కించావా?' అడిగా.

'అటకా? అదొక శ్రమ ఎందుకు?ఎక్కడో ఉంది చూడాలి.' అన్నాడు.

'అయితే పాత కాగితాలలో అమ్మేశావా? ఎప్పుడో రోడ్డుపక్కన బజ్జీ సమోసా తినేటప్పుడు ఆ కాయితాలు  నా పొట్లంలోకే వస్తాయేమో? అప్పుడు నా పద్యాలు నేనే చదువుకుంటూ బజ్జీలు తినొచ్చు. మరిన్ని పద్యాలు చదవాలంటే, 'అమ్మా. ఇంకొక వాయి బజ్జీలియ్యి' అని బండివాడినే అడగొచ్చు. అంతేగా? అన్నా నవ్వుతూ.

'మరీ అంతకాదులే. ఎక్కడో ఉంది. చదవాలి' అన్నాడు.

'ఉత్తపారాయణం చెయ్యడం కాదు. నామాలను చదివి అర్ధం చేసుకో. దానిని జీవితంలోకి అనువదించుకో. అప్పుడే ఏ స్తోత్రానికైనా ఒక అర్ధం పరమార్ధం ఉంటాయి. అలా చెయ్యకపోతే, పారాయణం దారి పారాయణానిదే, జీవితం దారి జీవితానిదే అవుతుంది. చాలామంది చాదస్తులు చేసేది అదే. నువ్విపుడు చేస్తున్నది తప్పని నేననడం లేదు. కానీ ఇది సరిపోదు. ఇంకా ముందుకు ఎదగాలంటే నేను చెప్పినట్టు చెయ్యి' అన్నాను.

'ఆమ్మో. అంత ఎదుగుదల అప్పుడే నాకొద్దులే. నన్నిలా సామాన్యుడిగా బ్రతకనియ్యి చాలు' అన్నాడు.

'సామాన్యుడు, అసామాన్యుడు అనేది కూడా మళ్ళీ మనసు చేసే గారడీనే. అదొక మెంటల్ బ్లాక్. అంతే' అన్నా.

'సర్లే. ఏంటంటావ్ ఇప్పుడు?' అన్నాడు.

'ఇంకా కొన్ని చెత్త న్యూసులున్నాయి. చెప్పమంటావా?' అన్నా నవ్వుతూ.

'ఇప్పటికి నా మైండ్ చెడగొట్టింది చాలు. ఇకాపు. పవిత్రంగా లలిత చదువుకుంటుంటే, లౌకిక విషయాలు  చెబుతున్నావ్ ఫోన్ చేసి' అన్నాడు మళ్ళీ కోపంగా.

'చెబుతున్నది కూడా లలితే' అన్నా మళ్ళీ నవ్వుతూ.

'చెప్పాగా. నేనింకా అంత ఎదగలేదని. ఇక ఫోన్ పెట్టెయ్. తర్వాత మాట్లాడతా. ఆఫీసుకు టైమౌతోంది' అన్నాడు.

నవ్వుకుంటూ ఫోన్ పెట్టేశా.