Pages - Menu

Pages

5, మే 2022, గురువారం

'తారాస్తోత్రం' రెండవ ప్రచురణ విడుదల

నా తొలిరచనలలో ఒకటైన 'తారాస్తోత్రం' రెండవ ప్రచురణ నేడు విడుదలౌతున్నది.

2013 లో నేను గుంటూరులో ఉన్న సమయంలో ఆశువుగా నా మనసులో ఉద్భవించిన 27 సంస్కృత శ్లోకములు, 260 తెలుగు పద్యములు 2015 లో ఈ గ్రంధంగా రూపుదిద్దుకున్నాయి. ఈ శ్లోకములు పద్యములలో మంత్ర, తంత్ర రహస్యములు అనేకములు దాగున్నాయి.

సంస్కృతము, గ్రాంధిక తెలుగుభాషలు ఏమాత్రమూ రాని నా నోటిద్వారా ఈ అద్భుతమైన స్తోత్రం అవతరించడం, తారా మహామంత్రోపాసన వల్ల, జగన్మాత కాళి అనుగ్రహం వల్ల మాత్రమే సాధ్యమైంది. ఆ అనుగ్రహమే ఇప్పటికి పదివేల పద్యాలను నానోట పలికించింది. 50 పైగా గ్రంధాలను వ్రాయించింది. ఇది కాళీకటాక్షమే గాని వేరొకటి కాదు.

ఈ స్తోత్రంలో సమయాచార, దక్షిణాచార, వామాచార, కౌలాచారములు, కుండలినీయోగము, మంత్ర తంత్రోపాసనా రహస్యములు గర్భితములై ఉన్నాయి. సూక్ష్మగ్రాహులైన పాఠకులు వీటిని అర్ధం చేసుకోగలరు.

అంతర్జాతీయ పాఠకుల ఉపయోగార్ధమై,  అప్పటిలోనే దీనిని ఆంగ్లభాషలోకి అనువదించాలని అనుకున్నప్పటికీ, ఏడేళ్ల తర్వాత మాత్రమే అది సాధ్యమౌతున్నది. ఈ ఆలస్యానికి  కారణం, శ్లోకాలను పద్యాలనూ ఆంగ్లంలోకి తేవడం అసాధ్యం కావడమే. ఈ పనిని ఆంగ్లభాషలో ఉద్దండులైన నా శిష్యులలో ఎవరైనా చేస్తారేమోనని ఏడేళ్లుగా ఎదురుచూచాను. కానీ ఎవరూ ముందుకు రాలేదు. సరే, ఇలాంటి అద్భుతమైన గ్రంధం ఒక్క తెలుగుభాషకే పరిమితం కాకూడదన్న ఉద్దేశ్యంతో దీనిని నేనే ఆంగ్లంలోకి అనువదించాను.

త్వరలో ఇది A Hymn To Goddess Tara అనే ఆంగ్లపుస్తకంగా విడుదల కాబోతున్నది. ఈ క్రమంలో తెలుగుప్రతిని మళ్ళీ కూలంకషంగా పరిశీలించి, కొన్ని మార్పులు చేర్పులతో, సరిక్రొత్త ముఖచిత్రంతో, రెండవ ప్రచురణగా విడుదల చేస్తున్నాము.

తొమ్మిది సంస్కృతశ్లోకములతో నానోట ఆశువుగా పలికిన మరొక అద్భుతస్తోత్రమే - 'కాళీకటాక్ష స్తోత్రం'. ప్రస్తుతం ఇది 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉన్నది. ఇప్పుడు దీనిని కూడా జిజ్ఞాసువుల పారాయణార్ధమై ఈ పుస్తకంలో పొందుపరచాము.

ఈ గ్రంధాన్ని అనేకమార్లు  తిరగామరగా చదివి, నేను సూచించిన ఎన్నో మార్పులను, డీటీపీ వర్క్ ను, ఎంతో భక్తిశ్రద్ధలతో చేసిన నా శిష్యురాలు అఖిల ధన్యురాలు. అలాగే, ముఖచిత్రాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన నా శిష్యుడు ప్రవీణ్ ధన్యుడు. వీరికి నా ఆశీస్సులు. ఈ పనిలో నిరంతరం నాకు తోడునీడగా నిలచిన నా శ్రీమతి సరళాదేవికి ఆశీస్సులు. వీరి సహకారమే లేకుంటే నా గ్రంధాలలో ఒక్కటి కూడా వెలుగుచూచేది కాదు. వీరిని నిత్యమూ రక్షించమని జగన్మాత కాళిని ప్రార్ధిస్తున్నాను.

తంత్రసాధకుల, తంత్రాభిమానుల, ఆధ్యాత్మికజిజ్ఞాసువుల దాహాన్ని ఈ గ్రంధం  తీరుస్తుందని భావిస్తున్నాం.