వేషాలను నమ్మబోకు తమ్ముడూ
మోసాలకు లొంగబోకు తమ్ముడూ...
మన గడ్డం స్వాములోర్ల కతలు ఇనుకో తమ్ముడూ...
స్వాములోర్ల మంటారు
సాంప్రదాయమంటారు
చాదస్తాల్ నూరిపోసి
చీకట్లో ముంచుతారు || వేషాలను ||
నీతులెన్నొ చెబుతారు
నిష్ఠలంటు నీల్గుతారు
నీవే మా గురువంటె
నీళ్ళలోకి దించుతారు || వేషాలను ||
గడ్డాలే పెంచుతారు
గుడ్డాలే కడతారు
దొడ్డిదారి పనులుచేసి
అడ్డంగా ఎదుగుతారు || వేషాలను ||
సత్యాలను చెప్పబోరు
షాపులనే తెరుస్తారు
మా అంగడి మంచిదంటు
నాసిసరుకు అమ్ముతారు || వేషాలను ||
నాయకులతొ జతకట్టి
నల్లధనం దాస్తారు
బయటకు నీతులు చెబుతూ
బ్రతికేస్తూ ఉంటారు || వేషాలను ||
లోకంలో ప్రతివిషయం
మాకెరికేనంటారు
శివరాత్రికి చిందులేసి
సినిమా చూపిస్తారు || వేషాలను ||
శాంతిదూతలమనే ప్రభువు బిడ్డల చరిత్రలు ఇవిగో తమ్ముడూ...
పాస్టర్లం అంటారు
పగలే ఎగదోస్తారు
ప్రేమా కరుణా అంటూ
పెత్తందార్లౌతారు || వేషాలను ||
మూలాలను మరుస్తారు
ముచ్చట్లే చెబుతారు
మాటలకోటలు కట్టి
మూటలనే పెంచుతారు || వేషాలను ||
విదేశీయ ధనం తెచ్చి
పెద్దముద్ద వాళ్ళు మింగి
మెతుకులనే విదిలించి
మేడలెన్నొ కడతారు || వేషాలను ||
కులద్వేషం నింపుకుంటు
పైకి ప్రేమ కబుర్లంట
జీససునే శిలువేస్తూ
జీవిస్తూ ఉంటారు || వేషాలను ||
శాంతిదూతలం అంటు
చెత్త చెత్త వాగుతారు
మతం అడ్డుపెట్టుకోని
మహరాజులు అవుతారు || వేషాలను ||
ఇకపోతే, సాయెబ్బుల సంగతులు వినరా తమ్ముడూ...
మైనార్టీలంటారు
మసీదులే కడతారు
ఆల్ ఖైదా జతకట్టి
అందర్నీ చంపుతారు || వేషాలను ||
శాంతిశాంతి అంటారు
సేవకులం అంటారు
పదవి చేతికందగానె
ప్రభువులుగా మారుతారు || వేషాలను ||
ప్రాంతాలకు చిచ్చుపెట్టి
ప్రజాస్వామ్యమని చెబుతూ
ప్రజాధనం బొక్కుతారు || వేషాలను ||
తెల్లబట్టలేసుకోని
మల్లెపువ్వులాగ తిరిగి
నల్లధనం కూడబెట్టి
నమ్మినోణ్ణి ముంచుతారు || వేషాలను ||
పవరులోకి రాకముందు
పత్తిత్తుల మంటారు
పవరు చేతికందగానె
పచ్చనోట్ల పండుతారు || వేషాలను ||
కంచెచేను మేసినట్టు
గట్టు కట్టు దాటినట్టు
దొరికింది దొరికినట్టు
దోచేస్తూ ఉంటారు || వేషాలను ||
ముందు నీతి చెప్పినోడు
వెనుక దొంగ అవుతాడు
ఇంకొకడు నీతి చెబితె
వాణ్ని అణగదొక్కుతాడు || వేషాలను ||
అసలీ లోకమే పెద్ద రొచ్చుగుంటరా తమ్ముడూ..
లోకంలో ఎటుచూచిన
లొసుగులతో నిండిపోయె
లొల్లిలేని బ్రతుకు జూడ
కల్లగానె మిగిలిపోయె || వేషాలను ||
నీతిమాట ఎత్తబోతె
నేతిబీరకాయ లెక్క
నీతన్నది లేదులేదు
బూతేరా లోకమంత || వేషాలను ||
అవకాశం రానివాడు
అరుస్తూనె ఉంటాడు
అవకాశం దొరికితేను
అడ్డంగా దోస్తాడు || వేషాలను ||
మతమన్నది మహామాయ
రాజకీయమసలు మాయ
అవసరమూ అవకాశం
అంతే ఈ లోకమంత || వేషాలను ||
చిన్నదొంగ పెద్దదొంగ
గల్లిదొంగ గజదొంగ
అంతా దొంగలమయమే
ఇంతేరా ఈ లోకం || వేషాలను ||
ఇవన్నీ వదిలేయ్ రా. నువ్వు మనిషివి. మనిషిలా బ్రతుకు. అంతే చాలు.
లోకమంత పెద్దమాయ
జీవితమొక చిన్నమాయ
మాయలన్ని మంటగలిపి
మనిషిలాగ బ్రతుకు చాలు || వేషాలను ||
బురదగుంట లోన నిలిచి
బురద కడుగు ప్రయత్నాలు
బుద్ధిలేని వాళ్లపనులు
బుద్ధిగ నీ బ్రతుకు బ్రతుకు || వేషాలను ||
మూడునాళ్ళ బ్రతుకులోన
మోసమేల? మాయలేల?
విడిదిలాంటి జీవితాన
విషపుతిండి తినగనేల? || వేషాలను ||
కులం మతం కుళ్ళునంత
కుంపటి కెక్కించమంట
మానవత్వ సువాసనల
మనసులోన నింపమంట || వేషాలను ||
ఒకడినోరు కొట్టకుండ
ఒంటిగ నిను బ్రతకమంట
బ్రతుకు చెల్లిపోయినాక
ఎవడికెవడు? తెలియమంట || వేషాలను ||
గుబులు లేని గుండెతోటి
మచ్చలేని మనసుతోటి
సామాన్యపు బ్రతుకు బ్రతికి
దారిబట్టి ఏగమంట || వేషాలను ||
వేషాలను నమ్మబోకు తమ్ముడూ
మోసాలకు లొంగబోకు తమ్ముడూ...