Pages - Menu

Pages

4, మే 2022, బుధవారం

Elon Musk Astro Chart - Terrific Dhana Yogas

'ఎంతసేపూ యాక్సిడెంట్లు, చావులు, యుద్ధాలు, ప్రకృతి దుర్ఘటనలు ఇలాంటివి విశ్లేషణ చేయడమేనా? కాస్త మంచిమాటలు కూడా అప్పుడప్పుడు వ్రాయవచ్చు కదా?' అంటూ నిన్నరాత్రి కర్ణపిశాచి కల్లోకొచ్చి మరీ అడిగింది.

'సరే ఏం రాయమంటావో కోరుకో' అన్నాను.

'ఎలాన్ మస్క్ జాతకం రాయి. అంత డబ్బు ఎలా వస్తుందో తెలుసుకోవాలనుంది' అంటూ ముచ్చటపడింది.

'దానికి జాతకం ఎందుకు? గతజన్మలలో ఎన్నో దానధర్మాలు లెక్కలేనన్ని చేసుంటే అలాంటి జన్మ వస్తుంది' అన్నాను.

'కాదు చూడవా ప్లీజ్' అంటూ తెగ బ్రతిమిలాడింది.

'సరే పో' అని దానిని కలలోనుంచి పంపించేశా.

ఈ పోస్ట్ అలా మొదలైందన్నమాట !

ఎంతోమంది సెలబ్రిటీస్ జాతకాల లాగా ఇతనికి కూడా జనన సమయం ఎవరికీ తెలియదు.  జననప్రదేశం మాత్రం ప్రిటోరియా సౌతాఫ్రికా. పుట్టింది 28 జూన్ 1971. కర్ణపిశాచినడిగితే సాయంత్రం 6. 50 అని చెప్పింది. ఆ సమయానికి వేసిన జాతకచక్రం ఇది.   

సరే మకరలగ్న జాతకమైంది. ఇక ధనయోగాలు చూద్దాం.

భయంకర ధనయోగాలు

లాభాధిపతి అయిన కుజుడు ఉచ్ఛస్థితిలో లగ్నంలో ఉండటం భయంకర ధనయోగం.    కుజుడు చతుర్ధాతిపతి కూడా. అంటే, మనస్సును సూచిస్తాడు. కనుక ఇతను ఒక ప్లాన్ వేశాడంటే అది కనకవర్షాన్ని కురిపించాల్సిందే. ఈ జాతకంలో ఇదొక సక్సెస్ యోగం.

రాహువు లగ్నంలో ఉండటం వల్ల దూరాలోచన దురాలోచన రెండూ ఉంటాయి. శనిని సూచిస్తున్నందువలన చాపకింద నీరులాంటి భయంకరమైన ప్లానింగ్ ఉంటుంది. పైగా పట్టుదలకు మారుపేరైన మకరలగ్నం. మహామొండివాడైన కుజుని ఉచ్ఛస్థితి. ఇంతకంటే 'సక్సెస్ మంత్ర' ఇంకేముంటుంది?

లాభస్తానంలోని గురువువల్ల అమితమైన పుణ్యబలం కనిపిస్తున్నది. అందుకే ఏది పట్టుకున్నా బంగారమౌతుంది. గురువు వక్రతవల్ల ద్వాదశాధిపత్యం మంచిదౌతుంది. పరాయిదేశంలో లాభాలపంటను పండిస్తుంది. ఇదే కారణం చేత, గురువు దశమమైన తులలోకి పోతాడు. దశమంలో గురువు వల్ల పట్టిందల్లా బంగారమౌతుంది.

సుఖవిలాస యోగం

బుద్ధిస్థానమై, భౌతికసుఖాలకు ఆలవాలమైన వృషభంలో కలిగిన శనిశుక్రుల యోగం భయంకరమైన విలాస, సుఖయోగం. ఇతను తలపెట్టే ప్రతి ప్రాజెక్టునూ సక్సెస్ చేసే గ్రహానుగ్రహం ఇదే.

బుధాదిత్యయోగం

ద్వితీయ వృత్తిస్థానమై,  అమెరికాను సూచిస్తున్న మిధునంలో ఉన్న బుధాదిత్యయోగం వల్ల, మంచి తెలివితేటలూ, సౌతాఫ్రికాలో పుట్టినప్పటికీ అమెరికాలో స్థిరపడి భయంకరమైన సక్సెస్ ను సాధించడం జరిగింది. చిన్నవయసులోనే కంప్యూటర్ ప్రొగ్రామింగ్ లో విపరీతమైన తెలివి ఇందుకే కలిగింది.

రోగ యోగం

అయితే, ఇది రోగస్థానం కూడా కావడం వల్ల ఇతనికి  యాస్పర్జర్ సిండ్రోమ్ అనే రోగం దాపురించింది. ఇది ఒకరకమైన ఆటిజమే. ఈరోగం ఉన్నవాళ్లు చేసిందే చేస్తూ, పర్ఫెక్షనిస్ట్ లుగా,  ఒక విధమైన మొండి మనుషులుగా ఉంటారు. జాతకంలో ఇతర అదృష్టయోగాలు కలిస్తే, ఈ పోకడ భయంకరమైన అదృష్టాన్నిస్తుంది. లేకపోతే దురదృష్టాలతో జీవితాంతం బాధపడే మెంటల్ పేషంట్ ని చేస్తుంది. జాతకంలో ఇలాంటి సూక్ష్మమైన తేడాలుంటాయి. 

సాధారణంగా, ఉండవలసిన దానికంటే తెలివితేటలు ఎక్కువైతే, కొంచెం పిచ్చిదోరణి తప్పకుండా ఉంటుంది. లేదా నరాల సంబంధిత జబ్బు ఉంటుంది. అయిన్ స్టీన్, స్టీఫెన్ హాకింగ్ లు దీనికి ఉదాహరణలు.

ఇతని ముఖంలో కొంచం ఆటిజం కవళికలున్నట్లు గమనించవచ్చు.

మొండి అధికారి

లగ్నసప్తమాలైన మకర కర్కాటకాలలో ఉన్న రాహుకేతువులవల్ల, తనమాట ఎదుటివారు వినడమేగాని, ఎదుటివారిమాటను తను ఎట్టిపరిస్థితిలోనూ వినని భయంకరమైన ఎడ్మినిస్ట్రేటర్ కనిపిస్తున్నాడు. అంటే మొండి సీతయ్యన్నమాట.

ఎదురులేని యోగం

సప్తమాధిపతి అయిన చంద్రుడు అష్టమంలో పడటంవల్ల ప్రత్యర్థుల మాట చెల్లకపోవడం, ఇతనికి ఎదురు ఎవరూ నిలవలేకపోవడం, అయితే అదే సమయంలో వివాహజీవితం చెడిపోవడం కనిపిస్తున్నాయి.

గోచారం

ప్రస్తుతం ఇతనికి సప్తమశని మొదలైంది. అందుకే ట్విట్టర్ ఉద్యోగులతో మనస్పర్థలు మొదలయ్యాయి. ప్రస్తుతం అంతా బాగానే ఉన్నప్పటికీ, ఇంకొక రెండున్నరేళ్ల తర్వాత రాబోతున్న అష్టమశని సమయంలో మాత్రం తీవ్రమైన ఒడుదుడుకులు తప్పవని అనిపిస్తున్నది.

ఏ మనిషికైనా జీవితమంతా మొదటినుంచీ చివరిదాకా ఒకేలాగా ఉండదుకదా మరి !