నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

4, మే 2022, బుధవారం

K.A.Paul జాతకం ఎలా ఉంది?

'KAPaul పైన జరిగిన దాడిని చూచారా?' అడిగాడొక కొలీగ్.

'చూశాను' అన్నా.

మా అమ్మాయి రిఫర్ చేస్తే ఆ వీడియోను మొన్ననే చూశా.

'మీ ఉద్దేశ్యం ఏమిటి?' అన్నాడు కొలీగ్. 

'నాకేమీ ఉద్దేశ్యాలు లేవు' అన్నా.

'అతని జాతకం ఎలా ఉందో చూడొచ్చు కదా, మా వాడే అందుకని అడుగుతున్నా' అన్నాడు.

'మా వాడే' అంటే, మా కులమే అని అర్ధమన్నమాట. కొలీగ్ ది కాపు కమ్యూనిటీ. నాకు మంచి ఫ్రెండ్ కూడా.

'సరే. చూస్తా. కానీ ఖచ్చితమైన జననవివరాలు కావాలి' అన్నా. 

'తేదీ నెట్లోనే ఉంది. పుట్టింది చిట్టివలస. టైం తెలీదు' అన్నాడు. 

'సర్లే పైపైన చూస్తాలే' అని  చెప్పా. మిత్రధర్మం కదా, కాదనలేం.

---------------------------------------------------------

కేఏ పాల్, 28 సెప్టెంబర్ 1963 న పుట్టాడు. ఆ రోజున, జ్యేష్ఠ 4 వ పాదం, మూల 1 వ పాదాలు నడిచాయి. ఈయన ఆకారాన్ని, వ్యవహారాన్ని బట్టి ఈయనది జ్యేష్టా నక్షత్రమని, వృశ్చికరాశి అని నా ఊహ. దీనికి నా లాజిక్స్ ని ముందుముందు చెబుతాను. అలాంటప్పుడు, ఉదయం 11 లోపు ఈయన పుట్టి ఉండాలి. అందులోకూడా ఈయనది తులాలగ్నం అయ్యే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే, ఎత్తుపళ్లవల్ల నవ్వినప్పుడు పళ్ళు కొట్టొచ్చినట్లు కనపడతాయి. ఇవి కుజ రాహువుల లక్షణాలు. తులలో కుజుడున్నాడు. ఉచ్ఛరాహువు మిధునం నుంచి చూస్తున్నాడు.

తులాలగ్న జాతకులకుండే ఒక విధమైన ఆకర్షణాశక్తి ఇతని ముఖంలో ఉంది. తృతీయంలోని ఉచ్చకేతువు వల్ల తమ్ముడి మరణం సూచింపబడుతున్నది. ఇతని తమ్ముడు అనుమానాస్పద పరిస్థితులలో చనిపోయాడు. నవమంలో ఉచ్చరాహువు వల్ల, పరాయిమతానికి మారిన తండ్రి కనిపిస్తున్నాడు. అంతేగాక, అమెరికాలో స్థిరపడటం కూడా సూచింపబడుతున్నది.

లగ్నం నుంచి కమ్యూనికేషన్ ను సూచించే మూడవ ఇంట, చంద్రుని నుంచి వాక్స్థానం లోను ఉన్న ఉచ్ఛకేతువు వల్ల, గట్టిగా మాట్లాడగలిగినప్పటికీ, ఒక విషయం మీద మాట్లాడుతూ ఉన్నట్టుండి ఇంకో దాంట్లోకి వెళ్లిపోవడం, అరిచి గొడవచేసినట్లుగా మాట్లాడటం, మాటలలో కంటిన్యుటీ మిస్ కావడం, చెబుతున్న విషయంలో క్లారిటీ లేకపోవడం, క్రైస్తవకూటాలలో మాట్లాడినట్లు మాట్లాడటం మొదలైన లక్షణాలు ఈయన మాటలలో ఉంటాయి. ఇది కేతు ప్రభావం.

కనుక ఇతనిది తులాలగ్నం వృశ్చికరాశి అవవచ్చు.

ఇప్పుడు శనిగురువుల గోచారరీత్యా గత సంఘటనలను సరిపోల్చుదాం. ఎవరి జాతకంలోనైనా, ముఖ్యమైన సంఘటనలు వీరి నీడలోనే జరుగుతాయి.

-------------------------------------------------------

1971 మార్చ్ లో 8 ఏళ్ల వయసులో ఇతను క్రైస్తవమతాన్ని స్వీకరించాడు. ఆ సమయంలో గోచారగురువు జననకాల నీచచంద్రునిమీద సంచరించాడు. శనీశ్వరుడు ఆరింట మేషంలో నీచలో ఉన్నాడు. కనుక, పరాయిమతాన్ని స్వీకరించాడు.

1983 లో తన తండ్రిచేత వాళ్ళ చర్చ్ లోనే ఆర్డైన్ చేయబడ్డాడు. ఆ సమయంలో కూడా గోచారగురువు మళ్ళీ వృశ్చికంలోనే జననకాలచంద్రుని మీద సంచరించాడు. శనీశ్వరుడు ద్వాదశంలో ఉచ్చలో ఉంటూ వక్రించి లాభస్థానంలోకి పోతున్నాడు. కనుక మతప్రచారకునిగా మారాడు.

1989 లో అమెరికాకు మకాం మార్చాడు. ఆ సమయంలో, గురువు ఏడింట వృషభంలో ఉంటూ దూరదేశంలో జీవనాన్ని సూచిస్తున్నాడు. శనీశ్వరుడు రెండింట ధనుస్సులో ఉంటూ కుటుంబం అస్థిరం కావడాన్ని సూచిస్తున్నాడు.

1993 లో GUM (గాస్పెల్ టు ది అన్ రీచ్డ్ మిలియన్స్) అనే సంస్థను స్థాపించాడు. ఆ సమయంలో, రాహువు జననకాలచంద్రునిమీద ఉన్నాడు. శనీశ్వరుడు నాలుగింట ఉండగా అర్ధాష్టమశని జరుగుతోంది. గురువు ఏకాదశంలో వక్రించి దశమంలోకి పోతున్నాడు. కనుక ఒక సంస్థను స్థాపించాడు. అయితే అర్ధాష్టమశని ప్రభావం వల్ల అది అలాగే ఉండిపోయింది. తరువాత గుర్తింపును కోల్పోయింది.

2003 జనవరిలో వాషింగ్టన్ లో జరిగిన పీస్ సమ్మిట్ లో చాలామంది సెలబ్రిటీలతో కలసి పాల్గొన్నాడు. ఆ సమయంలో, శనీశ్వరుడు సప్తమంలో వృషభంలో వక్రించి ఉంటూ షష్ఠంలో నీచలోకి వచ్చాడు. గురువు నవమంలో ఉచ్ఛస్థితిలో ఉంటూ వక్రించాడు. కనుక సెలబ్రిటీ అయ్యాడు.

2005 లో GUM మెంబర్షిప్ ను Evangelical Council Of Financial Accountability రద్దుచేసింది. కారణాలు, ఫండ్స్ అవకతవకలు, నిర్వహణలో లోపాలు. ఆ సమయంలో, శనీశ్వరుడు మిథునంలో ఉన్నాడు. ఈయనకు అష్టమశని జరుగుతున్నది. గురువు లాభస్థానమైన కన్యలో వక్రించి ఉన్నాడు. 

31 జనవరి 2010 న ఇతని  అన్న డేవిడ్ రాజు అనే వ్యక్తిని మహబూబ్ నగర్ జిల్లాలో కొమ్మిరెడ్డిపల్లి అనే ఊరిలో ఒక కారులో చనిపోయి ఉండగా కనుగొన్నారు. ఇది హత్యేనని అప్పట్లో అనుమానాలు వెల్లువెత్తాయి. ఇతని హస్తం ఉండవచ్చని, ఇది ఆస్తుల తగాదా అని కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో, ఇతని కుటుంబస్థానమైన ధనుస్సులో రాహువు నీచస్థితిలో ఉన్నాడు. అన్నను సూచించే కన్యలో వక్రశని ఉన్నాడు.. హింసాత్మకసంఘటనలకు కారకుడైన నీచకుజుడు కర్కాటకం నుంచి పంచమదృష్టితో జననకాలచంద్రుని చూస్తున్నాడు. కనుక ఇది సహజమరణం కాదు. కానీ దోషులెవరో తేలలేదు. కేసు నీరుగారిపోయింది.

ఆధారాలు లేవని చెప్పి, డిసెంబర్ 2015 లో పోలీసులు ఈ కేసును డ్రాప్ చేశారు.  ఆ సమయంలో, శని వృశ్చికంలో జననకాలచంద్రునిపైన ఉంటే, గురువు దశమంలో ఉంటూ రక్షిస్తున్నాడు. కనుక కేసు డ్రాపైంది.  

12 ఫిబ్రవరి 2019 న ఈయన తల్లి విశాఖపట్నం ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయింది. ఆ సమయంలో, గోచారగురువు మళ్ళీ నీచచంద్రునిమీద ఉన్నాడు. శనీశ్వరుడు కుటుంబస్థానంలో ఉంటూ చతుర్ధాన్ని చూస్తూ తల్లికి మరణాన్ని సూచిస్తున్నాడు. 

2019 లో ఏప్రియల్ మే నెలలలో జరిగిన లోక్ సభ ఎన్నికలలో పాల్గొని డిపాజిట్ కూడా రానంత ఘోరపరాజయాన్ని పొందాడు. ఆ సమయంలో, శనిగురుకేతువులు ధనుస్సులో ద్వితీయంలో ఉన్నారు.  వీరిలో గురువు వక్రించి మళ్ళీ జననకాల చంద్రునిపైన సంచరించాడు.

ఇప్పుడు, 2022 ఏప్రియల్ లో మళ్ళీ ఇండియాకు వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ, తెలంగాణాలో ప్రచారార్థం తిరుగుతున్నాడు. ఈ క్రమంలో సిరిసిల్లలో దాడికి గురై, ఒక వ్యక్తి చేతిలో చెంపదెబ్బ తిన్నాడు. ఈయన మీటింగులకు పర్మిషన్ దొరకడం లేదు. ప్రస్తుతం ఈయనకు అర్ధాష్టమశని జరుగుతున్నది. కనుక ఈ అవమానాలు పరాభవాలు మొదలయ్యాయి. అయినా సరే, పంచమంలో ఉన్న గురువు వల్ల బెదరకుండా తెలంగాణాలో తిరుగుతూ ప్రచారం చేసుకుంటున్నాడు.

---------------------------------------------------

గోచారాన్ని బట్టి సరిగ్గా సరిపోతున్న గత సంఘటనల దృష్ట్యా, ఈయన జాతకచక్రాన్ని పరిశీలిస్తే, భవిష్యత్తు ఇలా ఉండవచ్చుననిపిస్తుంది.

  • ప్రస్తుతం జరుగుతున్న అర్ధాష్టమశని 2025 దాకా ఉంటుంది గనుక, అప్పటిదాకా ఈయనకు ఏమీ ఆశాజనకంగా లేదు. కనుక, ఈయన చెబుతున్నట్లుగా ఎలక్షన్లలో గెలిచి ఆంధ్రాలోగాని, తెలంగాణాలో గాని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగేపని కాదు.
  • అధికారం పొందాలంటే జాతకంలో రవిబలం ఉండాలి. ఈ జాతకంలో రవి, నీచశుక్రునితో కలసి ఉన్నాడు. కనుక ఈయనకు రవిబలం లేదు. కనుక అధికారం అసాధ్యం. 
  • ఈయన చెబుతున్న దానిలో స్టాటిస్టికల్ వాస్తవాలున్నప్పటికీ, వాటివల్ల ఓట్లు పడవు. నేటి ప్రజలకు వాస్తవాలు అక్కర్లేదు. డబ్బులు కావాలి. సుఖాలు కావాలి.
  • ఫారిన్ ఫండ్స్ రాకుండా ప్రభుత్వం ఆపినందువల్ల ఈయన ప్రస్తుతం ఇబ్బందిపడుతున్నాడు. ఈయనే కాదు పాస్టర్లందరూ మోడీగారిని తిడుతున్నది ఇందుకే. ఈ సమస్యను దాటాలంటే రాజ్యాధికారమొక్కటే మార్గం. అందుకే ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపట్టాడు.
  • కులం, డబ్బు ఈ రెండే నేటి ఓట్లను సమీకరించే సాధనాలు. అవి రెండూ ఈయనకు పనిచేయవు.
  • మొదటిది - ఎన్నికలలో పంచడానికి ఈయన దగ్గర డబ్బులు లేవు.
  • ఇకపోతే, ఈయన కులస్తులైన కాపులు, ఇప్పటికే పవన్ కళ్యాణ్ వైపున్నారు. కనుక కాపుల ఓట్లు ఈయనకు పెద్దగా పడవు.
  • కాపులలో హిందువులు ఈయనకు ఓటెయ్యరు. ఎందుకంటే ఈయన క్రైస్తవ మత మార్పిడులు చేశాడు, అంతిమంగా ఈయననొక క్రైస్తవ ప్రచారకుడిగానే ప్రజలు చూస్తారు. ఆ ఇమేజి ఈయనకు అడ్డు అవుతుంది. హిందూకాపులు వేస్తె గీస్తే పవన్ కళ్యాణ్ కు వేస్తారుగాని, ఈయనకు ఓటెయ్యరు. 
  • రెండవది, క్రైస్తవుల ఓట్లన్నీ జగన్ వైపున్నాయి. కనుక ఆ వర్గం కూడా పెద్దగా ఈయనకు ఓట్లు వెయ్యరు.
  • ఓటింగ్ దగ్గరకు వచ్చేసరికి  కులమతాల కంటే డబ్బే ఎక్కువగా పనిచేస్తుందన్నది చేదువాస్తవం. మరి అధికారపార్టీలను మించి డబ్బులు పంచాలంటే, ఈయన దగ్గర వందలాది కోట్లుండాలి. లేదా అభ్యర్థులు డబ్బులు ఎదురుపెట్టి పార్టీ టికెట్ కొనుక్కోవాలంటే, తిరుగులేని ప్రజాదరణ ఉండాలి. ఈ రెండూ ఈయనకు లేవు. 
  • అన్నింటినీ మించి, ఈయనకు గ్రాస్ రూట్స్ లో గట్టి కేడర్ లేదు. ధనబలం లేదు. సిద్ధాంతపు పునాదులు లేవు. కనుక, ఎన్ని ఉపన్యాసాలిచ్చినప్పటికీ, ఎంతమందిని విమర్శించినప్పటికీ, ఎన్ని వీడియోలు చేసినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులలో ఈయనకు ఓట్లు పడటం కష్టం.
ప్రజలలో ఎక్కువమంది ఈయన ఉపన్యాసాలను, వీడియోలను నవ్వుకోడానికి, హాస్యపు కామెంట్లు పెట్టడానికి వాడుకుంటున్నారు. చాలామంది ఈయనను ఒక కామెడీగా తీసుకుంటున్నారు. ఎలక్షన్ల ముందొచ్చి గోలచేస్తాడు. తరువాత మాయమౌతాడు అనే టాక్ జనంలో ఉంది. అందుకే, ఈయన మాటల్ని ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదన్నది వాస్తవం. ఈయనకు సైకలాజికల్ ఇష్యూలు ఉన్నాయని చాలామంది నమ్ముతున్నారు.

ఈ పరిస్థితిలో, ఈయన పడుతున్న ప్రయాస చివరకు సత్ఫలితాన్నిస్తుందా? అంటే పెద్ద ప్రశ్నార్ధకమే. కొన్ని సీట్లు గెలవొచ్చేమోగాని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో ఉండదనేది జోస్యం.