నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

28, జూన్ 2022, మంగళవారం

మా ఆశ్రమం మొదలైంది - 5 (జారుడు మెట్లు)

ఆదివారం నాడు జిల్లెళ్ళమూడి వెళ్ళినపుడు, అందరం హైమాలయంలో దణ్ణం పెట్టుకునే సమయంలో ఒకామె వచ్చి 'నాపేరు ఫలానా. అక్కయ్య చెప్పింది మీరొస్తున్నారని' అంటూ పరిచయం చేసుకుంది.  ఆమెకు ఏభై పైనే ఉండవచ్చు. చూడగానే మంచి అభిప్రాయం కలిగించే సంస్కారవంతమైన 'ఆరా' ఆమెలో ఉంది.

'అలాగా' అన్నాను. తర్వాత తెలిసినదేమంటే, ఆమె చిన్నపిల్లగా ఉన్నపుడు అమ్మగారికి చాలా ఏళ్ళు సేవ చేసిందని. 'పుణ్యాత్మురాలు' అనుకున్నా.

'ర' మాకు తెలుసు' అందామె.

'ఎవరామె?' అన్నాను, 

'గతంలో మీ దగ్గరకు వచ్చింది. మీరు తన గురించి వ్రాశారు కూడా. ఆమె మా బంధువే' అన్నది.

మళ్ళీ 'అలాగా' అన్నాను నిరాసక్తంగా.

మాట్లాడుకుంటూ అక్కయ్య గదికి బయల్దేరాం. అక్కడ మళ్ళీ ఇదే టాపిక్ మొదలైంది.

'తను చాలామంది గురువుల దగ్గరకు తిరిగింది' అందామె.

'ఆ మధ్య మాట్లాడినప్పుడు, తనకు జ్ఞానం లభించిందని, ఇక తెలుసుకోవలసింది చెయ్యవలసింది ఏమీ లేదన్నట్లుగా మాట్లాడింది. మీరంతా తప్పుదారిలో ఉన్నారంది. ఆ తరువాత ఏమైందో నాకు తెలీదు' అన్నాను.

'జ్ఞాని ఎప్పుడూ 'నేను జ్ఞానిని' అని చెప్పుకోడు కదా?' అన్నదామె

'అవును. ఇతరులను విమర్శించడు కూడా. అయితే, నేటి జ్ఞానులకు పుస్తకజ్ఞానమూ, యూ ట్యూబు జ్ఞానమూ తప్ప, అనుభవజ్ఞానం సున్నా కదా. అందుకే అలా ఉంటారు' అన్నాను నేను నవ్వుతూ.

'మా గురువుగారు 'విసా' గారి దగ్గర కూడా కొన్నాళ్ళు ఉంది. ఆయన చికాగో వెళ్ళినపుడు బ్రహ్మరధం పట్టింది. ఆ తర్వాత కొంతకాలానికి 'మీదంతా తప్పు' అంటూ ఇంకొకరి దగ్గరకు వెళ్ళింది. అక్కడా ఇలాగే చేసి ఇంకొక గురువు దగ్గరకు వెళ్ళింది' అందామె.

'జిల్లెళ్ళమూడిలో కూడా ఒక ఇల్లు తీసుకుంటానని మొదట్లో అనేది. అందులో తనుంటానంది. తరువాత నన్నుండమంది. చివరకి ఇల్లు తీసుకోలేదు' అంది అక్కయ్య.

'ఆ తర్వాత ఇప్పుడెవరో న్యూయార్క్ లో ఉండే ఒకామె ఫిలాసఫీ బాగా నచ్చింది తనకు. ప్రస్తుతం అందులోనే ఉన్నట్టుంది'  అందామె.

'ఆ అమ్మాయికి పిచ్చెక్కడానికి సిద్ధంగా ఉంది. వదిలెయ్యండి' అన్నాను.

'ఎందుకలా తయారౌతారు. అహమే కదా కారణం?' అడిగింది వర్ధని గారు.

'అవును. సైకలాజికల్ ఇస్యూస్ ఉంటాయి. చైల్డ్ హుడ్ ట్రామా ఉంటుంది. ఇంఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. అహం ఉంటుంది. ఇవన్నీ కలసి ఇలా తయారౌతారు. తనేకాదు. నేటి సోకాల్డ్ ఆధ్యాత్మికలోకంలో లక్షలాదిమంది అలా అయిపోతున్నారు. అదంతే. దయచేసి ఆ అమ్మాయి టాపిక్ ఇక వదిలెయ్యండి' అన్నా నేను.

ఆధ్యాత్మికమార్గమంతా ఎన్నో జారుడు మెట్లతో నిండి ఉంటుంది.

'తెలుసు' అనుకునే ప్రతివాడికే ఇక్కడేమీ తెలీదు. 'తెలీదు' అనుకునే ప్రతివాడికీ ఎంతోకొంత తెలీకుండానూ పోదు. తెలిసీ తెలీకుండా ఉండటం తప్ప చాలామందికి ఇక్కడ చేసేది కూడా లేదు. అయితే,ఈ ముగ్గురికీ ఎవడి 'అహం' వాడికి ఉంటుంది. అదే వారికి అడ్డుపడుతుంది. అగచాట్ల పాలు చేస్తుంది.

నేటి సోకాల్డ్ ఆధ్యాత్మికలోకంలో పుస్తకపరిజ్ఞానం చాలా ఎక్కువగానూ, సాధనాజ్ఞానం చాలా తక్కువగానూ ఉన్నాయి. అనుభవజ్ఞానమైతే దాదాపుగా శూన్యం. అందరి పరిస్థితీ ఇంతే.

అంతా తెలుసనీ, నేర్పిస్తామనీ అనుకునేవారికి నిజానికి ఏమీ తెలీదు. అంతా వ్యాపారమే. అంతా డబ్బుమయమే. అంతా అహం ఆడించే నాటకమే.

ఈ కలియుగంలో ప్రతివాడూ గురువే. ప్రతివాడూ సాధకుడే. ప్రతివాడూ జ్ఞానే. అదే నేటి ఆధ్యాత్మికలోకపు మాయ ! ఈ మాయలో 'ర' లాంటివాళ్లు అమాయకపావులు. కానీ వాళ్ళా సంగతిని ఒప్పుకోలేరు. అలా ఒప్పుకోడానికి వాళ్ళ అహం అడ్డొస్తుంది. ఆ మాయలోనే వాళ్ళ జీవితం గడుస్తుంది. ఇలాంటివాళ్ళని చూచి జాలిపడటం తప్ప మనమేమీ చెయ్యలేం.

చాలా జీవితాలంతే ! జారుడు మెట్లమీద జారుతూ, 'మేము జారడం లేదు' అనుకోవడమూ, ఎదుటివాళ్ళని 'మీరు జారిపోతున్నారు' అనడమే ఆధ్యాత్మిక లోకంలో రివాజు. దానికి కారణం రెండుప్రక్కలా ఉంటుంది. గురువులూ అలాగే ఉన్నారు. శిష్యులూ అలాగే ఉన్నారు. గురువులేమో శిష్యులను పిచ్చోళ్ళని చేస్తున్నారు. శిష్యులేమో తాము గురువులమెప్పుడౌతాము? ఇంకొంతమందిని ఎలా పిచ్చోళ్ళని చేద్దాము? అని వేచి చూస్తూ అసహనంగా ఉన్నారు.

తనే రైటని, ఎదుటివాళ్ళు రాంగని లోకంలో అందరూ అనుకుంటున్నారు. ఆధ్యాత్మికంలో కూడా దీనికి మినహాయింపు లేదు. ఇక్కడకూడా ప్రతివాడూ 'నా పద్ధతే కరెక్ట్. నేనే రైట్' అంటాడు. ఇంతకీ ఎవరు రైటు? ఎంతవరకు రైటు? ఎవరు రాంగు? ఎంతవరకు రాంగు" రైటుకీ రాంగుకీ నిర్వచనాలేంటసలు?

 ఏంటీ గోలంతా??? 

(ఇంకా ఉంది)