Pages - Menu

Pages

5, జూన్ 2022, ఆదివారం

'గాయత్రీ రహస్యోపనిషత్' మా క్రొత్త పుస్తకం విడుదలైంది

పంచవటి పబ్లికేషన్స్ నుండి వెలువడుతున్న 44 వ పుస్తకంగా, 'గాయత్రీ రహస్యోపనిషత్' నేడు విడుదలైంది.

'న గాయత్ర్యా పరో మంత్రః' అనే శ్లోకం ప్రకారం గాయత్రిని మించిన మంత్రం లేదు. వేదములను అనుసరించే భారతీయులమైన మనకు గాయత్రిని మించిన దైవమూ లేదు. సమస్తదేవతలూ గాయత్రిలో ఉన్నారని మన శాస్త్రాలు చెబుతున్నాయి. నిజమునకు గాయత్రి ప్రత్యేకమైన దేవత కాదు. అఖండము, ఏకము అయిన పరబ్రహ్మమునకే గాయత్రి ఒక రూపం. సూర్యభగవానుని వెలుగు రూపంలో భూమిని పోషిస్తున్నది గాయత్రియే. గాయత్రీ ఉపాసన అంటే, సూర్యునిద్వారా, ప్రకృతిద్వారా, పంచభూతముల ద్వారా చేయబడే పరబ్రహ్మోపాసనయే. గాయత్రీతత్త్వమును వివరించే గ్రంధములలో 'గాయత్రీ రహస్యోపనిషత్' ఒకటి.

ప్రతి ఉపనిషత్ తప్పనిసరిగా నాలుగు వేదములలో ఒక వేదమునకు అనుసంధానమై ఉంటుంది. కానీ, ఇది ఏ వేదమునకు చెందినదో స్పష్టంగా తెలియడం లేదు. దీనిలోని సంస్కృతభాషను బట్టి ఇది పురాణ-తంత్ర కాలమునకు చెందినట్లుగా గోచరిస్తున్నది. అయినప్పటికీ, దీనిలో ఇవ్వబడిన మార్మిక సమాచారము యొక్క విలువ  అనల్పమైనది. తంత్రోక్తమైన వివరణకు తోడు, వేదోక్తమైన వివరణను కూడా ఇందులో జతచేయడం జరిగింది.

గాయత్రీ  ఉపాసకులకు ఈ గ్రంధము మరియు దీనికి చేయబడిన నా వ్యాఖ్యానములు మిక్కిలి ప్రయోజనకారులుగా ఉంటాయని మా విశ్వాసం.

ఈ పుస్తకం తయారు కావడానికి ఎంతో శ్రమించి అతితక్కువకాలంలో దీని టైప్ సెట్టింగ్, డీటీపీ వర్క్ చేసిన నా శిష్యురాలు అఖిలకు, పుస్తకప్రచురణలో సూచనలనిచ్చిన శిష్యురాలు శ్రీలలితకు, బెంగుళూరులో వేరేపనిలో ఉన్నప్పటికీ అడిగిన వెంటనే అద్భుతమైన ముఖచిత్రాన్ని చిత్రించి ఇచ్చిన శిష్యుడు ప్రవీణ్ కు,  మొత్తం పనిలో అనుక్షణం తోడునీడగా ఉన్న నా శ్రీమతి సరళాదేవికి కృతజ్ఞతలు. ఆశీస్సులు.

ఆశ్రమం పనులలో ఉండటం వల్ల ప్రస్తుతం పుస్తకాల ప్రింటింగ్ పనిని ఆపాము. ప్రింట్ పుస్తకం వచ్చేలోపు Google Play Books నుండి 'ఈ బుక్' ను ఇక్కడ పొందవచ్చు.