శనివారం నాడు ఉపన్యాసాల సందర్భంలో, 'అతిరుద్రం - యోగం' అనే విషయం మీద పీ హెచ్ డీ చేస్తున్న వెంకటసుబ్బయ్య గారిని కూడా మాట్లాడమని కోరాం. వేదం నుంచీ పురుషసూక్తం నుంచీ కోట్ చేస్తూ తన రీసెర్చి విషయాలను కొన్నింటిని ఆయన వివరించాడు.
ఉపన్యాసం తరువాత ఆయనకు ఇలా చెప్పాను.
'మీ ఉపన్యాసం బాగుంది. మీకు పనికొచ్చే కొన్ని రహస్యాలను చెబుతాను వినండి. 'రోదయతీతి రుద్ర:' అన్నట్లు రోదింపజేసేవాడు రుద్రుడు. అంటే ఏడిపించేవాడని అర్ధం. ఏకాదశ రుద్రులంటే ఏకాదశ ఇంద్రియములు. అంటే, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనస్సులు. ప్రతి మనిషీ ఈ పదకొండు ఇంద్రియముల వలలో చిక్కి జీవితమంతా ఏడుస్తూనే ఉంటాడు. చనిపోయేటప్పుడు కూడా ఏడుస్తాడు. అలా ప్రతివారినీ ఏడిపిస్తాయి కాబట్టి, ఇవి 'రుద్రులు' అనబడతాయి.
ఇంద్రియములు ప్రాణసహాయంతో పనిచేస్తాయి. ప్రాణం వాయుతత్త్వ ప్రధానమైనది. కనుక రుద్రునికీ వాయువుకూ సంబంధం ఉన్నది. నిజానికి రెండూ ఒకటే. ఆంజనేయుడు వాయుసుతుడని, రుద్రాంశసంభవుడని చెప్పడంలోని అర్ధం ఇదే.
వాయువునే మరుత్తులంటారు. వాయువనేది వాతావరణంలో ఉంటుంది. అంటే, భూమికి, శూన్యాకాశానికి మధ్యనున్న వాయుసంచారప్రాంతం. దీనిని సైన్స్ Atmosphere అంటుంది. వాయువు ఆకాశంలో సంచరిస్తుంది. అందుకనే, ఆంజనేయస్వామికి కూడా ఆకాశగమన శక్తి ఉండేది.
యోగం ప్రధానంగా ప్రాణం మీద ఆధారపడి ఉంటుంది. ప్రాణాయామమనేది యోగాభ్యాసంలో అతిముఖ్యమైన అంగం. వాయుబంధనంతోనే ప్రాణాయామం జరుగుతుంది. కనుక యోగసాధనకు ఆంజనేయుడు సూచకుడు.
మూలాధారం భూమి అనుకుంటే, సహస్రారం శూన్యాకాశమనుకుంటే, మధ్యలోని సుషుమ్నామార్గం వాయుమండలం అవుతుంది. దానిలో సంచరించే ప్రాణవాయువే ఆంజనేయుడు. ఈ విధంగా, రుద్రతత్వానికీ, వాయువుకూ, యోగానికీ సంబంధం ఉన్నది'.
ఈ రహస్యాన్ని వివరించి చెప్పిన తర్వాత, ఇంకో విషయాన్ని కూడా ఆయనకు చెప్పాను.
శాస్త్రాధ్యయనం, పాండిత్యములు మంచివే. కానీ వాటిలో చిక్కుకుపోకండి. అవి సర్వస్వములు కావు. పాండిత్యంతో విషయం పైపైన అర్ధమౌతుంది. కానీ రహస్యాలు తెలియవు. అనుభవాలు అందవు. అహంకారం మాత్రం మిగులుతుంది.
ఈ శ్లోకం వినండి.
శ్లో || ఆలోక్య సర్వశాస్త్రాణి విచార్యపి పునః పునః
ఇదమేకం సునిష్పన్నం యోగశాస్త్రం పరం మతం ||
అన్ని శాస్త్రాలనూ బాగుగా పరిశీలించి, మళ్ళీ మళ్ళీ ఆలోచించగా ఒక విషయం ఖచ్చితంగా తెలుస్తుంది. అదేమంటే, 'యోగమే సర్వోత్తమమైన శాస్త్రము'. అని.
ఎందుకని? పాండిత్యంతో సిద్ధి రాదు. యోగంతో మాత్రమే వస్తుంది. కాబట్టి యోగమే సర్వోత్తమం.
సాధన లేని పాండిత్యం వృధా అని గ్రహించండి' అంటూ ముగించాను.
నా మాట ఆయనకెంతవరకు నచ్చిందో నాకు తెలియదు. కానీ నేను చెప్పవలసినది, ధర్మసమ్మతమైనది నేను చెప్పాను.
కర్మ కొంతవరకూ తీరనిదే ఎవరూ సాధనామార్గంలో అడుగును పెట్టలేరని నాకు తెలుసు. కానీ విషయాన్నీ స్పష్టంగా అర్ధం చేసుకోవడంలో తప్పు లేదు. అది చాలా ముఖ్యం. ముందుగా దారి తెలియాలి కదా ! ఆ తరువాత, ప్రయాణం చెయ్యాలా లేదా నిర్ణయించుకోవచ్చు. దారి తెలిసిన వెంటనే అందరూ ప్రయాణం మొదలుపెట్టలేరు కూడా ! ప్రయాణం మొదలవ్వాలంటే ఎన్నో కలసి రావాలి. అది, వారివారి కర్మపరిపక్వతను బట్టి ఒక్కొక్కరికి ఒక్కో టైంలో మొదలౌతుంది. ఎందరికో, అసలు ప్రయాణం అంటూ మొదలవ్వకుండానే జీవితం ముగిసిపోతూ ఉంటుంది.
(ఇంకా ఉంది)