Pages - Menu

Pages

9, జులై 2022, శనివారం

మా క్రొత్త పుస్తకం 'ఆత్మోపనిషత్' విడుదలైంది

నేడు మా క్రొత్త పుస్తకం 'ఆత్మోపనిషత్' విడుదలైంది. ఇది అధర్వణవేదం లోనిది. ఇది నా కలం నుండి వెలువడుతున్న 48 వ పుస్తకం.

అంగీరసఋషి యొక్క బోధగా ఈ గ్రంధం దర్శనమిస్తుంది. ఈయన ఋగ్వేదకాలపు ఋషులలో ఒకరు. సప్తఋషులలో కూడా ఒకరిగా ఈయనను లెక్కిస్తారు. దేహాత్మ, అంతరాత్మ, పరమాత్మ అనే మూడు సులభమైన భావనలతో సృష్టిని, మానవజీవితాన్ని, సాధనాక్రమాన్ని అంతటినీ కేవలం 32 శ్లోకములలో వివరించడం ఈ గ్రంధపు ప్రత్యేకత.

ఇది సామాన్యోపనిషత్తుల కోవకు చెందినది. ఇవి చిన్నచిన్న ఉపనిషత్తులే అయినప్పటికీ, వీటిలో చెప్పబడిన తత్త్వం మాత్రం అగాధమైనదిగా ఉంటుంది. వీటిని సరిగ్గా అర్ధం చేసుకుంటే, వేదాంతతత్త్వమంతా సులభంగా అర్ధమౌతుంది.

మరొక్కమాట ! ఇవి పైపైన చదివి పడేసే కధల పుస్తకాలు కావు. ఇవి కనీసం పదివేల సంవత్సరాల నాటి విజ్ఞానపు నిధులు. ఈ నాటికీ హిందూమతాన్ని సజీవంగా ఉంచుతున్న అతీతజ్ఞానపు పునాదులు ఇవే.

దీనిలోని ఒక్కొక్క శ్లోకాన్నీ ధ్యానించి ఆయా లోతుపాతులను అర్ధం చేసుకోవలసి ఉంటుంది.  ఉపనిషత్తులను చదువలసిన విధానం అదే. ఈ కోణం లో చూచినప్పుడు, చిన్నదైన ఈ పుస్తకం ఒక జన్మకు సరిపోయే గైడ్ బుక్ అవుతుంది. యధావిధిగా, ఈ ఒక్క పుస్తకాన్ని దిక్సూచిగా పెట్టుకుంటే చాలు, మనిషి జీవితం ధన్యమౌతుంది. ఈ మాట, నేను వ్రాస్తున్న అన్ని పుస్తకాలకూ వర్తిస్తుంది. అందుకే, నేను వ్రాస్తున్న ప్రతి పుస్తకావిష్కరణలోనూ ఇదేమాటను చెబుతూ ఉంటాను. ఇంకా  చెప్పాలంటే, మొత్తం పుస్తకం కూడా అక్కర్లేదు.  పుస్తకంలోని ఒక్క శ్లోకం చాలు, మనిషి జీవితాన్ని పునాదిగా ఉంటూ ఒక సౌధాన్ని దానిపైన నిర్మించడానికి. అయితే, దానిని అర్ధం చేసుకోవాలి, ధ్యానించాలి, జీవితంలోకి దానిని అనువదించుకోవాలి. అప్పుడే నేను చెబుతున్న ఈ అద్భుతం సాధ్యమౌతుంది.

సాధన చెయ్యలేకపోతే పోయారు ! కనీసం వీటిని చదవండి. మన హిందూమతపు ప్రాచీనవిజ్ఞానం ఎంత అద్భుతమైనదో తెలుసుకోండి. కొంతమేరకైనా ధన్యత్వాన్ని అందుకోండి.

ఈ పుస్తకం వ్రాయడంలో నా సహచరులు సరళాదేవి, అఖిల, ప్రవీణ్,  చావలి శ్రీనివాస్ ల పాత్ర ఎంతో ఉంది. వీరి సహాయం లేకుంటే  ఈ పుస్తకం వెలుగును చూచేది కాదు. వీరికి నా  ధన్యవాదములు, ఆశీస్సులు. 

యధావిధిగా, ఇది కూడా Google Books నుండి ఇక్కడ లభిస్తుంది.