నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

14, జులై 2022, గురువారం

విధ్వంసయోగం - మనోనాశయోగం

ఈ మధ్యకాలంలో  జ్ఞానమార్గంలో నడచిన కొందరి జాతకాలను పరిశీలించి వీరిలో కామన్ గా ఉన్న ఒక యోగాన్ని చదువరులకు పరిచయం చేయబోతున్నాను. ఈ యోగం పేరు విధ్వంసయోగం. దీనికీ పేరును నేనే పెట్టాను. ఈ విషయాన్ని 'మెడికల్ అస్ట్రాలజీ' పుస్తకంలో వ్రాశాను.

శనికుజుల కలయికతో ఏర్పడే ఈ యోగం కృత్రిమపు బ్రతుకులు బ్రతికేవారి జీవితాలలో యాక్సిడెంట్లను ఇస్తుంది. ఆధ్యాత్మికమార్గంలో నడిచేవారి జీవితాలలో అయితే 'కెలామిటీ' అనబడే విధ్వంసాన్ని సృష్టిస్తుంది.  దీనినే 'మనోనాశం' అంటారు. ఈ కెలామిటీ అనే దశ వారికి వచ్చినపుడు వారి మానసికదృక్పథం మొత్తం రివర్స్ అవుతుంది. అప్పటిదాకా ప్రపంచాన్ని వారు చూస్తున్న తీరు మొత్తం కుప్పకూలిపోతుంది. వారి మనస్సు మొత్తం కూలిపోయి నూతనంగా తయారౌతుంది. ఈ ప్రక్రియ జరగడానికి కొన్ని నెలలనుంచి కొన్ని ఏళ్ళు పట్టవచ్చు. ఆ సమయంలో వారు నరకాన్ని అనుభవిస్తారు. ఆ తరువాత మాత్రం నిత్యస్వర్గంలోకి అడుగుపెడతారు. అయితే ఆ స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనక ఉండరు. అసలెవరూ ఉండరు. అడుగుపెట్టిన వాళ్ళు కూడా అక్కడ ఉండరు. కనుకనే అది స్వర్గం అవుతుంది.

రమణమహర్షి (30-12-1879)

  • శని, కుజగురులచేత అర్గలబందీ అయ్యాడు. ఇదొకరకమైన విధ్వంసయోగం. 
  • శని ముందుకు పోకుండా కుజుడు ఆపుతున్నాడు. 
  • ఇది లగ్నాత్ సప్తమంలో జరిగింది. సప్తమం లగ్నానికి ప్రతిరూపం. 
  • శనిదృష్టి చంద్రునినుండి చతుర్దంపైన ఉంది. ఇది మనోనాశయోగాన్ని సృష్టిస్తున్నది. 
  • స్వయానా చంద్రుడు కేతుగ్రస్తుడైనాడు

మెహెర్ బాబా (25-2-1894)

  • చంద్రునితో కలసి ఉన్న శనిదృష్టి కుజునిపైన ఉంటూ విధ్వంసయోగాన్ని, మనోనాశయోగంగా మారుస్తున్నది.
  • యురేనస్, శనిచంద్రులతోనే కలసి ఉన్నాడు.
  • మత్తుకు కారకుడైన నెప్ట్యూన్, మరణకారకుడైన ప్లుటోలు వృషభంలో ఒకే డిగ్రీపైన ఉంటూ, కుజశనుల మధ్యరాశిని చూస్తున్నాడు.

UG (9-7-1918)

  • లగ్నాత్ చతుర్దంలో ఉన్న కుజుడిని శని వీక్షిస్తున్నాడు.
  • స్వయానా మనస్సు, బుద్ధులకు కారకులైన చంద్ర, బుధులు శని (యముని) చేతిలో చిక్కి ఉన్నారు. 
  • వీరి వెనుకగా మిధునంలో నాశనానికి కారకుడైన ప్లూటో ఉన్నాడు. 
  • వీరితో కలసి కర్కాటకంలో మత్తుకు కారకుడైన నెప్ట్యూన్ ఉన్నాడు. 
  • కుంభంలో ఉన్న యురేనస్, చంద్రబుధుల మధ్యబిందువును విధ్వంసక దృష్టితో చూస్తున్నాడు. వీటిఫలితంగా మనోనాశయోగం ఏర్పడింది.
కార్ల్ రెంజ్ (12-12-1953)

  • తులాలగ్నంలో పుట్టిన ఈయన లగ్నంలోనే శనికుజులు కలసి ఉన్నారు.  
  • మత్తుకు కారకుడైన నెప్ట్యూన్ కుజునికి ఒక డిగ్రీ దూరంలో తులలోనే ఉన్నాడు. 
  • మరణకారకుడైన ప్లూటో సింహం ఒకటో డిగ్రీలో ఉంటూ లగ్నకుజుడిని ఖచ్చితమైన దృష్టితో చూస్తున్నాడు. 
  • శని ముందుకు పోకుండా కుజుడు అడ్డుపడుతున్నాడు.
  • ఆత్మ(మనో)నాశకయోగం ఏర్పడింది.
మూజీ (29-1-1954)

  • నీచచంద్ర, ఉచ్చశనుల మధ్యన కుజుడుంటూ విధ్వంసయోగాన్ని, మనోనాశయోగంగా మారుస్తున్నాడు. 
  • ఇక్కడకూడా శని ముందుకు పోకుండా కుజుడు అడ్డుపడుతున్నాడు. 
  • మత్తును కారకుడైన నెప్ట్యూన్ శనితో కలసి తులలోనే ఉన్నాడు.
  • మనోనాశయోగం ఏర్పడింది
ఈ జాతకాలలోని గ్రహయోగాల బలాబలాలను బట్టి వీరి ఆధ్యాత్మికస్థాయిలలో తేడాలున్నప్పటికీ, కెలామిటీ అనబడే మనోనాశాన్ని వీరు పొందినట్లుగా పై జాతకాలనుంచి కనిపిస్తున్నది. అవన్నీ వ్రాస్తే, వీరి అనుచరుల మధ్యలో అనవసరమైన వివాదాలు లేస్తాయి గనుక, ఆయా స్థాయీభేదాలను వివరించడం లేదు.