జూలై 9
తేదీల ప్రకారం UG గారి పుట్టినరోజు.
ఈరోజున వెంకట్ అనే ఒకతను మా ఇంటికొచ్చాడు. ఉదయం పదికి మొదలైన మా సంభాషణ మూడు గంటలపాటు సాగింది.
అసలిదంతా రెండురోజులక్రితం మొదలైంది. ఈ మధ్యనే నా బ్లాగ్ చదివాడట. 'మీరు వ్రాసిన జిల్లెళ్ళమూడి స్మృతులు చదివాను. చాలా బాగున్నాయి. నాకు శ్రీవిద్య నేర్చుకోవాలని ఉంది, మీలాగా multi faceted wisdom తో జీవించాలని ఉంది. నాకు శ్రీవిద్యాసాధన ఎక్కడ మొదలుపెట్టాలో తెలియడం లేదు. కెన్ యు గైడ్ మి?' అంటూ మెయిలిచ్చాడు.
'తప్పకుండా. మీరు శ్రీవిద్యను ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారో నాలుగు కారణాలు చెప్పండి?' అడిగాను.
అతనిలా చెప్పాడు, '
1. అమ్మవారితో మా ఫెమిలీ మెంబర్ తో మాట్లాడినట్లు మాట్లాడాలని ఉంది
2. ప్రకృతి, బయటకు చూపించడం కంటే దాచిపెట్టేది ఎక్కువగా ఉంది. నాకు తీక్షణమైన బుద్ధికుశలత, జ్ఞానమూ లేకపోతే, ప్రకృతియొక్క అద్భుతమైన ఆశ్చర్యకరమైన గారడీని నా నిత్యజీవితంలో నేను ఎల్లప్పటికీ మిస్సవుతూనే ఉంటాను. ప్రతిదానిలోనూ స్పందిస్తున్న ఆ దివ్యత్వాన్ని చూచే కళ్ళు నాక్కావాలి
3. నాకు పాములన్నా, దయ్యాలన్నా చాలా భయం. ఏదోవిధంగా భయమనేది చావుతో ముడిపడి ఉంటుంది. నా భయాలన్నింటినీ అంతం చేసి భయం లేనివాడిగా నేను మారాలి. స్మశానంలో రాత్రిపూట పడుకోవాలని, పాములను చేతులతో పట్టుకోవాలని నా తీరని కల. నిర్భయునిగా ఒక డేర్ డెవిల్ గా మారడానికి శ్రీవిద్య నాకు కావాలి'
4. అందరిలాగా డబ్బు సంపాదిస్తూ, తింటూ చావడం నాకిష్టం లేదు. భౌతికమైన ప్రపంచంలో బ్రతుకుతూనే, మన శాస్త్రాలలో చెప్పబడినవి సత్యాలేనని, అవి ఎవరివో ఊహలు కావని నేను అనుభవంలో తెలుసుకోవాలి. ఈ నాలుగు కారణాలవల్ల నేను శ్రీవిద్యను నేర్చుకోవాలనుకుంటున్నాను'. అన్నాడు
అందరిలాగా, సమస్యలు, జాతకాలు, డబ్బు తేరగా వచ్చిపడే మార్గాలు, రోగాలు, రొష్టులు లాంటి చెత్తను ఇతను అడగకపోవడం నాకు నచ్చింది.
'రమణమహర్షి గారిదగ్గర నాకు చాలా శాంతి దొరికింది. ఈ ప్రపంచం ఒక కలలాంటిదని, సత్యం కాదని నేనాయన దగ్గర గ్రహించాను. Inception అనే సినిమాలో చూపించినట్లు, కలలో కలలో కలగంటున్న అనుభవం నాకు కలిగింది. అప్పటినుంచీ ఈ ప్రపంచపు సత్యత్వాన్ని ప్రశ్నించడం అలవాటు చేసుకున్నాను. అంతా ముందే నిర్ణయింపబడి ఉన్నదని ప్రస్తుతం నేను నమ్ముతున్నాను. ఈ అనుభవాలన్నీ బహుశా నాకు సరియైన అవగాహన లేకపోవడం వల్ల కలుగుతూ ఉండవచ్చు. జీవితమంటే ఒక ఉదాసీనభావం నాకు వీటివల్ల కలిగింది. జీవితాన్ని ఒక చిన్నపిల్లవాడిలా ఉత్సాహంతో శక్తితో గడపలేకపోతున్నాను. ఇది నా అవగాహనాలోపమో, అజ్ఞానమో కావచ్చు. ఇప్పుడు నేను, దీనికి పూర్తి వ్యతిరేకస్థితి అయిన శ్రీవిద్యను కోరుకుంటున్నాను. శ్రీవిద్యలో ఎంతో శక్తి, కోరికా ఉంటాయి. ఉదాసీనతా ఉత్సాహాలలో ఒకటే కాకుండా అదీ ఇదీ రెండూ కావాలని కోరుకుంటున్నాను.