Pages - Menu

Pages

9, జులై 2022, శనివారం

UG గారి పుట్టినరోజు - ఆధ్యాత్మిక సంభాషణ - 1

జూలై 9

తేదీల ప్రకారం UG గారి పుట్టినరోజు.

ఈరోజున వెంకట్ అనే ఒకతను మా ఇంటికొచ్చాడు. ఉదయం పదికి మొదలైన మా సంభాషణ మూడు గంటలపాటు సాగింది.

అసలిదంతా రెండురోజులక్రితం మొదలైంది. ఈ మధ్యనే నా బ్లాగ్ చదివాడట. 'మీరు వ్రాసిన జిల్లెళ్ళమూడి స్మృతులు చదివాను. చాలా బాగున్నాయి. నాకు శ్రీవిద్య నేర్చుకోవాలని ఉంది, మీలాగా multi faceted wisdom తో జీవించాలని ఉంది. నాకు శ్రీవిద్యాసాధన ఎక్కడ మొదలుపెట్టాలో తెలియడం లేదు. కెన్ యు గైడ్ మి?' అంటూ మెయిలిచ్చాడు.

'తప్పకుండా. మీరు శ్రీవిద్యను ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారో నాలుగు కారణాలు చెప్పండి?'  అడిగాను.

అతనిలా చెప్పాడు, ' 

1.  అమ్మవారితో మా ఫెమిలీ మెంబర్ తో మాట్లాడినట్లు మాట్లాడాలని ఉంది 

2. ప్రకృతి, బయటకు చూపించడం కంటే దాచిపెట్టేది ఎక్కువగా ఉంది. నాకు తీక్షణమైన బుద్ధికుశలత, జ్ఞానమూ లేకపోతే, ప్రకృతియొక్క అద్భుతమైన ఆశ్చర్యకరమైన గారడీని నా నిత్యజీవితంలో నేను ఎల్లప్పటికీ మిస్సవుతూనే ఉంటాను. ప్రతిదానిలోనూ స్పందిస్తున్న ఆ  దివ్యత్వాన్ని చూచే కళ్ళు నాక్కావాలి 

3. నాకు పాములన్నా, దయ్యాలన్నా చాలా భయం. ఏదోవిధంగా భయమనేది చావుతో ముడిపడి ఉంటుంది. నా భయాలన్నింటినీ అంతం చేసి భయం లేనివాడిగా నేను మారాలి. స్మశానంలో  రాత్రిపూట పడుకోవాలని, పాములను చేతులతో పట్టుకోవాలని నా తీరని కల. నిర్భయునిగా ఒక డేర్ డెవిల్ గా మారడానికి శ్రీవిద్య నాకు కావాలి' 

4. అందరిలాగా డబ్బు సంపాదిస్తూ, తింటూ చావడం నాకిష్టం లేదు. భౌతికమైన ప్రపంచంలో బ్రతుకుతూనే, మన శాస్త్రాలలో చెప్పబడినవి సత్యాలేనని, అవి ఎవరివో ఊహలు కావని నేను అనుభవంలో తెలుసుకోవాలి. ఈ నాలుగు కారణాలవల్ల నేను శ్రీవిద్యను నేర్చుకోవాలనుకుంటున్నాను'. అన్నాడు

అందరిలాగా, సమస్యలు, జాతకాలు, డబ్బు తేరగా వచ్చిపడే మార్గాలు, రోగాలు, రొష్టులు లాంటి చెత్తను ఇతను అడగకపోవడం నాకు నచ్చింది.

'మీ జవాబులు నాకు నచ్చాయి. మీ ID లో రమణమహర్షి ఫోటో ఉంది. మీకు  కావలసింది ఆయనదగ్గర దొరకలేదా?' అన్నాను.

'రమణమహర్షి గారిదగ్గర నాకు చాలా శాంతి  దొరికింది.  ఈ ప్రపంచం ఒక కలలాంటిదని, సత్యం  కాదని నేనాయన దగ్గర గ్రహించాను. Inception అనే సినిమాలో చూపించినట్లు, కలలో కలలో కలగంటున్న అనుభవం నాకు కలిగింది. అప్పటినుంచీ ఈ ప్రపంచపు సత్యత్వాన్ని ప్రశ్నించడం అలవాటు చేసుకున్నాను. అంతా ముందే నిర్ణయింపబడి ఉన్నదని ప్రస్తుతం నేను నమ్ముతున్నాను.  ఈ అనుభవాలన్నీ బహుశా నాకు సరియైన అవగాహన లేకపోవడం వల్ల కలుగుతూ ఉండవచ్చు. జీవితమంటే ఒక ఉదాసీనభావం నాకు వీటివల్ల కలిగింది. జీవితాన్ని ఒక చిన్నపిల్లవాడిలా ఉత్సాహంతో శక్తితో గడపలేకపోతున్నాను. ఇది నా అవగాహనాలోపమో, అజ్ఞానమో కావచ్చు. ఇప్పుడు నేను, దీనికి పూర్తి వ్యతిరేకస్థితి అయిన శ్రీవిద్యను కోరుకుంటున్నాను. శ్రీవిద్యలో ఎంతో శక్తి, కోరికా ఉంటాయి. ఉదాసీనతా ఉత్సాహాలలో ఒకటే కాకుండా అదీ ఇదీ రెండూ కావాలని కోరుకుంటున్నాను.

కావ్యకంఠ గణపతిమునిగారిని చదివాను. ఆయన ఆత్మలో రమణమహర్షి ఉన్నారు. అదే సమయంలో ఆయన శ్రీవిద్యాసాధన కూడా చేశారు. గణపతిముని గారిని చదివాక, అదే నా మార్గమని అనిపించింది. జ్ణానం ఆత్మగా, శ్రీవిద్య దానిపైన కప్పిన రంగురంగుల వస్త్రంగా అనుకున్నాను. రమణమహర్షి ఒక తెల్లని బట్టలాంటివారు. దానిపైన అనేక రంగులను  శ్రీవిద్యతో అద్దాలనుకుంటున్నాను. నాకు రమణమహర్షియే కావాలి. కానీ కావ్యకంఠులు చేసిన శుద్ధమైన ఉపాసనద్వారా కావాలి. నేను కోరుకుంటున్న శ్రీవిద్య, జిల్లెళ్ళమూడి అమ్మగారిలాగా నాకు తోస్తున్నది. మొదట్లో రమణమహర్షి గారిని గురించి చదివినప్పుడు, నేను త్వరగా జ్ఞానాన్ని పొంది నా జన్మపరంపరలను అంతం చేసుకోవాలని అనుకున్నాను. కానీ, ప్రస్తుతం, మానవజీవితం చాలా సుందరమైనదని భావిస్తున్నాను. ఎన్నోసార్లు ఇలాగే జన్మలెత్తుతూ ఉండాలని ఇప్పుడు ఆశిస్తున్నాను. ఈ ఆలోచన కూడా నాకు బాగా నచ్చింది. నా సొంత  మోక్షం కంటే, భగవంతుని దివ్యత్వాన్ని, ఆయన లీలను చూస్తూ ఆనందించాలని ప్రస్తుతం అనుకుంటున్నాను. ప్రస్తుతం నా ఆలోచనాధోరణి ఇలా మారుతున్నది' అంటూ సుదీర్ఘమైన జవాబునిచ్చాడు.

'నా పుస్తకాలు చదివారా/' అడిగాను. 

'లేదు. నిన్న రాత్రి మాత్రమే మీ బ్లాగు చూచాను. కానీ మీ పుస్తకాల శాంపిల్స్ నెట్లో చదివాను. మీది సయింటిఫిక్ ఆధ్యాత్మికత అనీ, చాదస్తపు ఆచారాలు, తంతులు మొదలైన అనవసరమైన చెత్త లేకుండా మీ మార్గం సూటిగా ఉంటుందనీ నాకర్ధమైంది' అన్నాడు.

'సరే, ఇంకొక్క మూడు వారాలలో నేను హైదరాబాదును వదిలేస్తున్నాను. మళ్ళీ ఎప్పుడొస్తానో చెప్పలేను, మీరు కలవాలంటే ఈ లోపల వచ్చి కలవండి' అన్నాను.

'సరేనండి, అడ్రస్ చెప్పండి, ఎన్నింటికి రమ్మంటారు?' అడిగాడు.

అడ్రస్ చెప్పి, 'రేపు ఉదయం సరిగ్గా పదింటికి రండి. సమయపాలనను నేనిష్టపడతాను' అని చెప్పాను.

'సరే' అన్నాడతను.

(ఇంకా ఉంది)