“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

12, జులై 2022, మంగళవారం

UG గారి పుట్టినరోజు - ఆధ్యాత్మిక సంభాషణ - 4

'ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడుగు' అన్నాను.

'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' పెట్టాలని మీకెందుకనిపించింది?' అడిగాడు.

'నా చిన్నప్పటినుంచీ నేను సాధనామార్గంలో నడిచాను. అనేక మార్గాల సాధనలు, ఉపాసనలు నేను చేశాను. ఒక ఉదాహరణ విను. నాకు పన్నెండేళ్ల వయసులో 'కాలభైరవ సాధన' చేశాను. ఈ ఒక్క ఉదాహరణ చాలనుకుంటాను ఆతర్వాత ఏమేం చేశానో అర్ధం చేసుకోడానికి. తరువాత నలభైఎనిమిదేళ్లలో వందలాది ప్రాచీనగ్రంధాలను అధ్యయనం చేశాను. నా జీవితంలో మొదటినుంచీ ఇప్పటివరకూ నన్ను వదలకుండా ఉన్నది అధ్యయనం, సాధనలు మాత్రమే. మధ్యలో ఎన్నో విద్యలు నా దగ్గరకు వచ్చాయి. అవన్నీ ఒక ప్రక్కన ఉంటాయి. అంతే. ముఖ్యమైనది సాధన ఒక్కటే.

ఈ సుదీర్ఘప్రయాణంలో, సాధనామార్గమంటే ఏమిటో, రకరకాల మతాలు, ఆయా సాధనావిధానాలు ఏమి చెబుతున్నాయో, భగవంతునివైపు మనిషి చేసే ప్రస్థానంలో వాటి స్థానాలు ఏమిటో, వాటి విలువలు ఏమిటో, ఏది ఎంతవరకు పనికొస్తుందో, ఏవి అసలో, ఏవి నకిలీలో, ప్రపంచం ఎటు పోతున్నది, ప్రజలు ఎటు పోతున్నారు, గురువులెలా ఉన్నారు, వారి అనుభవాలేమిటి? వారి స్థాయీభేదాలేమిటి? విశ్వమనే ఈ ప్రణాళికలో దేనిస్థానం ఏమిటి? -  ఈ మొత్తం విషయమంతా నాకర్ధమైంది.

ఆ అవగాహనను పునాదిగా చేసుకుని, నా జీవనగమనంలో చుట్టూ చూస్తుంటే, అందరూ తప్పు తప్పు దారులలో నడుస్తున్నారని కూడా నాకర్ధమైంది. మతాల డొల్ల ఆచరణలలో ఉన్న ఎక్కువమంది అసలు దారిలోనే లేరు. ఉన్నకొంతమంది కూడా తప్పుదారులలో ఉన్నారు. వారిలో దురహంకారులకు మనం చెప్పినా ప్రయోజనం లేదు. వినరు. తలబొప్పికట్టి, గుంటలో పడితేనే వాళ్లకు అర్ధమౌతుంది. అంతకు ముందు, ఎవరు చెప్పినా వారు వినరు. బహుశా అప్పుడుకూడా వారికి అర్ధం కాకపోవచ్చు. ఇక మిగిలిన కొద్దిమంది మంచివాళ్ళు. నిజాయితీపరులు. నిస్వార్ధపరులు. కనీసం వారికైనా, వారి వెదుకులాటను తగ్గిద్దామని, అసలైన దారిని వారికి చూపుదామని అనుకున్నాను.

నా చిన్నప్పటినుంచీ నేనెంతో వెదికాను. లోపలా బయటా ఎంతో సంఘర్షణకు గురయ్యాను. వెదుకగా వెదుకగా చివరకు విషయమంతా నాకర్ధమైంది. నాలాగా వెదుకుతున్న వారికి, అయోమయంలో ఉన్నవారికి, దొంగగురువుల చేతులలో మోసపోతున్న మంచివారికి,  సాయం చేద్దామని అనుకున్నాను. అందుకే 'పంచవటి' మొదలుపెట్టాను.

అయితే, ఏనాడూ నేను బయటపడి 'నేనింత చేశాను, నాకింత తెలుసు' అని చెప్పుకోలేదు. లో ప్రొఫైల్లోనే ఉన్నాను. కనీసం నా స్నేహితులకు, మా బంధువులకు కూడా నేనేంటో తెలియదు. ముప్పై ఎనిమిదేళ్లపాటు ఈ విధంగా నిశ్శబ్దంగా ఉన్న నేను, గత పదేళ్లనుంచీ మాత్రమే  బయటపడుతూ, నా సర్కిల్ లోకి వచ్చిన వారికి సరియైన దారిని చూపిస్తూ, వారిని చక్కదిద్దుతూ, వారికి బోథిస్తూ వచ్చాను. వినేవారు  విన్నారు. విననివారు వినలేదు. కొందరు నాతో మమేకమైపోయారు, కొందరు కొన్నాళ్ళు  ఉండి వెళ్లిపోయారు.

చాలామంది నన్నుచూసి అసూయపడ్డారు, కొంతమంది భయపడ్డారు. మరికొంతమంది ఎగతాళి చేశారు. ఇంకొంతమంది వారివారి స్వార్ధాలకోసం నన్ను వాడుకోవాలని చూశారు. మరికొంత మంది నా దగ్గరున్న సమాచారాన్ని, విద్యలను ఆశించారు. అన్నీ నాకు తెలుసు. కానీ ఎవరినీ నేను లెక్కచేయలేదు. ఎవరినీ కాదనలేదు. నాతో నడుస్తామంటే సరేనన్నాను. విడిపోతామంటే సరేనన్నాను. 'నువ్వే మా ప్రాణం' అంటే సరేనన్నాను. 'నువ్వు మాకు నచ్చలేదు' అంటే సరేనన్నాను. 'నువ్వు మోసగాడివి' అంటే సరేనన్నాను. 'మేము చూసినవారందరిలోకీ నువ్వు ఉత్తముడివి' అంటే సరేనన్నాను. అవన్నీ వారివారి అవగాహనలు. వారికి అర్ధమైనట్లు వారు అర్ధం చేసుకున్నారు. నేనెందుకు కాదనాలి? 

నాదారిలో నేను నడుస్తున్నాను. నాతో నడిచేవారిని నడిపిస్తున్నాను. మిగిలినవారిని పట్టించుకోను. ముందుముందు కూడా ఇదే చేస్తాను.

లోకాన్ని ఉద్దరించాలని నాకేమీ పెద్దపెద్ద ఆశయాలు లేవు. లోకం కుక్కతోక అని నాకు బాగా తెలుసు. ఇదెప్పటికీ సూటిగా, వంకర  లేకుండా, పరిపూర్ణంగా మారదు. అలా మారితే అది లోకమే అవదు. మనుషులందరినీ ఏకమొత్తంగా భగవంతుని సన్నిధికి నడిపించడం ఎవరికీ సాధ్యం కాలేదు. కాదు కూడా ! చెప్పాను కదా  ! నాతో నడిచేవారిని మాత్రమే నేను నడిపిస్తాను. నా పరిధిలో నా భావాలను ప్రచారం చేస్తాను. అంతకంటే ఎక్కువ ప్రయత్నం చెయ్యను.

అయితే, ఇప్పుడు మన పరిధి చాలా విస్తృతమై పోయింది. ఇంట్లో కూచుని భూగోళం అవతల ఉన్నవారిని మనం ప్రభావితం చెయ్యవచ్చు. నా భావజాలం నచ్చితే దూరంతో పనిలేకుండా నన్ను అనుసరించేవారు వేలల్లో ఉన్నారు. నేను నడిచిన మార్గంలో వాళ్ళను కూడా నడిపిస్తాను. పరిపూర్ణతకు వారిని చేరుస్తాను, ఇందుకే 'పంచవటి' మొదలుపెట్టాను' అన్నాను.

ఇంకో ప్రశ్న.

'శ్రీ రామకృష్ణులు ఒక కధ చెప్పారు కదా ! ఒక చెరువు దగ్గర ప్రజలందరూ బహిర్భూమిగా వాడుతుంటే, ఎంతమంది చెప్పినా వినకపోతుంటే, చివరకు రాజుగారు అక్కడ బోర్డు పెట్టించారని, అప్పుడు మాత్రమే ప్రజలు విన్నారని. 'భగవంతుని ఆజ్ఞ లేనిదే లోకానికి బోధించలేరు'. అని ఆయన అన్నారు. అలా బోధించడానికి మీకు కూడా భగవంతుడి ఆజ్ఞ వచ్చిందా? ఆ ఆజ్ఞానుసారం పంచవటి పెట్టారా? అనేది నా సందేహం' అడిగాడు వెంకట్.

నవ్వాను.

'అదేమీ లేదు. నువ్వనుకుంటున్న రీతిలో సినిమాల్లోలాగా నాకే దేవుడూ ఒక రూపంలో కనిపించి చెప్పలేదు. భగవదాజ్ఞ అనేక రూపాలలో రావచ్చు. శుద్ధమైన మనస్సులో ఉదయించే నిస్వార్ధ సంకల్పం కూడా భగవదాజ్ఞయే. అది కూడా తప్పకుండా ఫలిస్తుంది. ఆ విధంగా నాకనిపించి నేను పంచవటిని మొదలుపెట్టాను గాని, నాకేమీ దేవుడు ప్రత్యక్షమై 'నువ్వు లోకానికి బోధించు' అని చెప్పలేదు. కాలక్రమేణా నా సంకల్పం సత్యమైనదే అని రుజువైంది కదా. ఈనాడు ఎంతోమందిని అసలైన సాధనామార్గంలో భగవంతుని వైపుగా నడిపించగలుగుతున్నాను. నాకు భగవత్శక్తి తోడుగా ఉందనడానికి ఇంకేం కావాలి ఋజువు?' అన్నాను.

(ఇంకా ఉంది)