ఈలోపల భోజన సమయమైంది గనుక తనను కూడా భోజనానికి ఆహ్వానించాము. భోజనం అయిన తర్వాత కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా,
'ఇంకొక్క డౌటు' అన్నాడు వెంకట్
'నీదే ఆలస్యం' అన్నాను.
'శ్రీవిద్యోపాసనలో బాల, లలిత, త్రిపుర, బగళ మొదలైన అంతమంది అమ్మవార్లెందుకు? శ్రీవిద్యలో ఒకదాని తర్వాత మరొక ఉపదేశం అంటూ మంత్రోపదేశాలు ఉంటాయి కదా? ఇన్ని ఉపదేశాలెందుకు? సిద్ధిని ఒక్క అమ్మవారు ఇవ్వలేదా?' అడిగాడు.
'ఈ సందేహం నీకెందుకొచ్చింది?' అడిగాను.
'నాకొక ఫ్రెండున్నాడు. అతను డాన్సర్. అతను శ్రీవిద్యోపాసకుడు. ఒకసారి బాల, ఒకసారి లలిత ఇలా ఉపాసన చేస్తున్నానంటాడు. ఎందుకలా?' అన్నాడు.
'అతన్నే అడక్కపోయావా ఎందుకిలా చేస్తున్నావని?' అన్నాను.
'అడిగాను. ఒక్కొక్క అమ్మవారి రూపం ఒక్కొక్క రసాన్ని వ్యక్తీకరిస్తుంది. శాంతరసం, రౌద్రరసం ఇలా డాన్స్ లో ఉంటాయి కదా ! ఆయా రసాలను సిద్ధింపజేసుకోవడం కోసం ఆయా దేవతల ఉపాసనలను చేస్తున్నానని అతను చెప్పాడు, ఇంకా, అమ్మవారు తనతో మాట్లాడుతుందని కూడా చెబుతాడు' అన్నాడు వెంకట్.
'ఎలా మాట్లాడుతుంది? కనిపించి మాట్లాడుతుందా?' అడిగాను.
'లేదు. ఎప్పుడైనా ఒక్కోసారి, 'ఇది చెయ్యి ఇది చెయ్యకు' అన్నట్లుగా చెబుతుందిట' అన్నాడు.
నవ్వాను.
'అది అతని భ్రమ. అతని మనసే అలా చెబుతుంది. నిజంగా అమ్మవారు ఆ విధంగా మాట్లాడాలంటే అతని మనస్సు ఎంతో శుద్ధత్వాన్ని సంతరించుకుని ఉండాలి. అంతటి శుద్ధత్వం అతనికి కలిగితే, డాన్స్ జోలికి పోడు. డాన్స్ కోసం ఉపాసన చెయ్యడు. నూటికి తొంభై తొమ్మిది మంది ఇలాంటి భ్రమలలోనే ఉంటారు. అవి నిజాలు కావు' అన్నాను.
ఇంకా కొనసాగిస్తూ, 'విను. అసలైన శ్రీవిద్య అది కాదు. సాధకులతో గాని, గురువులతో గాని వచ్చిన చిక్కే ఇది. అసలు ఉపాసనను ఎవరైనా ఎందుకు చేస్తారు? ఏదో లౌకిక ప్రయోజనం కావచ్చు, లేదా ఆధ్యాత్మిక ప్రయోజనమైన మోక్షం కావచ్చు. అంతేకదా ! లౌకిక ప్రయోజనాలకోసం దేవతా ఉపాసనను చేయడం క్షుద్రం. శ్రీ రామకృష్ణులు చెప్పినట్లు, చక్రవర్తి దర్బారుకు పోయి, కేజీ వంకాయలు కావాలని కోరుకున్నట్లుగా ఇది ఉంటుంది. మోక్షం కోసం ఉపాసనను చేయడం ఉత్తమం. కానీ లోకంలో ఉత్తములెందరున్నారు. లేరు. అందరూ క్షుద్రులే. అంటే, ఏవో వరాలను ఆశించి దైవాన్ని ప్రార్ధించేవారే. క్షుద్రపూజ అంటే చేతబడి కాదు. ఒక లౌకిక ప్రయోజనాన్ని ఆశించి నువ్వు పూజించావంటే అది క్షుద్రపూజే. ఒక్క మోక్షాన్ని మాత్రమే నువ్వు కోరుకుంటే అది శుద్ధమైన పూజ. సరే, అది వారి ఖర్మ. ఆ సంగతలా ఉంచు.
శ్రీవిద్యలో కూడా, ప్రయోజనాలను ఆశించి రకరకాల అమ్మవార్ల ఉపాసనలు చేసేవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. అలాంటివాళ్ళు నువ్వు చెప్పిన విధంగా భ్రమపడుతూ ఉంటారు. ఏ అమ్మవారైనా లౌకికమూ, మోక్షమూ రెండూ ఇవ్వగలదు. ఉదాహరణకు, బాల అనే అమ్మవారు ఉపాసనలో ప్రాధమికదేవత అని కొంతమంది భావిస్తారు. అది చిన్నపిల్ల వంటి స్థితి అని అంటారు. కానీ బాలా ఉపాసనతో ముక్తిని పొందినవారు ఎందరో ఉన్నారు. బాలా ఉపాసనయే అత్యుత్తమమైనదని, అది అన్నింటినీ ఇవ్వగలదని భావించేవారు కూడా ఎందరో ఉన్నారు. ఇది సత్యం కూడా. నువ్వు పట్టుకోగలిగితే ఒక్క అమ్మవారు చాలు. అన్నీ సిద్ధిస్తాయి.
అసలు, 'ఇవ్వడం' 'తీసుకోవడం' అంటూ నువ్వు ఆలోచిస్తూ. లాభనష్టాలను బేరీజు వేసుకుంటూ ఉన్నంతవరకూ, నీ సాధన పూర్తిగా నిమ్నస్థాయిలోనూ, తప్పుదారిలోనూ ఉన్నట్లు లెక్క. కావలసింది ఆ అమ్మవార్లేదో ఇవ్వడమూ నువ్వు తీసుకోవడమూ కాదు. నువ్వు అయిపోవాలి. 'నువ్వే అది' అని అనుభవంలో నువ్వు గ్రహించాలి. నిజానికి ఈ రూపాలన్నీ వేర్వేరు కావు. ఒకే శక్తికి ఇవన్నీ వివిధ రూపాలు. ఆ శక్తివి నువ్వే. అంతే. అయితే ఊరకే మాటలు చెబితే సరిపోదు. ఆ అనుభవం నీకు కలగాలి.
బాలలో రౌద్రం కూడా ఉంది. కాళిలో శాంతమూ ఉంది. నువ్వు చూచే రీతిని బట్టి నీకు కనిపిస్తుంది. బాలే కాళిగా మారుతుంది. ఆమె ఏ రూపాన్నైనా ధరించగలదు. సృష్టి స్థితి సంహారములు చేసే శక్తికి సాధ్యం కానిదేమున్నది?
ఉదాహరణకు, ఈ చిన్న కిటికీ లోనుంచి మన ఇంట్లోకి వెలుతురు వస్తున్నది. ఆ వెలుగును బాల అనుకో. ఆ పెద్ద తలుపులోనుంచి కూడా వెలుగు వస్తున్నది. అది లలిత అనుకో. ఈ వెనుక ఉన్న నల్లని అద్దంలో నుండి కూడా వెలుగు పడుతున్నది. అది కాళి అనుకో. ఏదైనా ఒకే వెలుగు. ఆ వెలుగు అనేకరూపాలలో అనేక కాంతులలో నీదాకా వస్తున్నది. కానీ దానిని నీవు చూచే తీరు వేరుగా ఉంటుంది. దానిని నీవు వాడుకోవడమా, లేక, దానిననుసరించి కిటికీలోనుంచి గాని, తలుపులోనుంచి గాని, మొత్తం మీద నీవు బయటకు పోయి, బయటనున్న ఆ అనంతమైన వెలుగులో నీవు లీనం కావడమా అనేదానిని బట్టి అంతా ఉంటుంది. ఆ వెలుగునే బ్రహ్మమని, శివుడని, నారాయణుడని రకరకాల పేర్లతో పిలుస్తారు. నువ్వు చెయ్యవలసింది ఆ వెలుగులోకి వెళ్లడం, అంతేగాని ఆ వెలుగును వాడుకుని ఇదే ఇంట్లో కూచుని ఏవేవో పనులు చేసుకుందామని నువ్వు అనుకుంటే అది నీ అల్పత్వం మాత్రమే. నువ్వు ఈ ఇంటిని వదలి బైటకు అడుగుపెట్టాలి. ఆ వెలుగులో నువ్వు కరగిపోవాలి. దానికి దారిని చిన్న కిటికీ అయినా,పెద్ద కిటికీ అయినా, చిన్న సందైనా, లేక తలుపైనా, తలుపుసందైనా, ఏదైనా చూపగలదు. దానిని ఆసరాగా తీసుకుని నువ్వు బయటకు వెలుగులోకి పోవాలి. ఏ దేవతతో మొదలుపెట్టినా, దాని ఆసరాతో అనంతమైన బ్రహ్మంలోకి నీవు అడుగుపెట్టాలి. ఈ విధంగా చూస్తే ఏ దేవతైనా ఒకటే. దేవతలలో చిన్నా పెద్దా ఏమీ లేవు.
అందుకనే, 'మంత్రమంటే ఏమిటో తెలిస్తే అన్ని మంత్రాలూ ఒకటేనని తెలుస్తుంది' అని జిల్లెళ్ళమూడి అమ్మగారు అనేవారు. 'అన్ని మంత్రాలూ ఒకటే ఎలా అవుతాయి?' అంటూ ఆమెను విమర్శించినవాళ్ళు ఆ రోజులలో చాలామంది ఉన్నారు.
చిల్లర ప్రయోజనాలను ఆశించేవారు మాత్రమే దేవతలలో, మంత్రాలలో భేదాలను చూస్తారు. ఈ దేవత ఎక్కువ, ఈ దేవత తక్కువ, మా దేవుడు ఎక్కువ, మీ దేవుడు తక్కువ అంటూ గొడవపడేది ఇలాంటి చిల్లరమనుషులే. వీళ్లంతా అసలు విషయం తెలియని అజ్ఞానులు.
శ్రీవిద్యలో మెట్లున్నాయి. రకరకాల మంత్రాలున్నాయి. నిజమే. అయితే ఆ మెట్లను దాటడమంటే ఏమిటి? ఆ మంత్రాలను ఉపాసించడమంటే ఏమిటి? ఆయా శక్తులను నీలో ఆవిష్కరింపజేసుకోవడమే. నాకు తెలిసిన కొందరు శ్రీవిద్యోపాసకులున్నారు. గురువులున్నారు. వాళ్ళేం చేస్తున్నారు? కరోనా టైంలో స్కూల్లో పరీక్షలు పెట్టకుండానే పాస్ చేసినట్లు, మూడునెలలకొక మంత్రం ఇచ్చేసి జపించమంటున్నారు. దానికొక ఫీజు. ఆ యంత్రాలు అమ్ముకోవడం. ఆరు నెలల తర్వాత ఇంకో మంత్రం. మళ్ళీ డబ్బులు. ఏడాది తర్వాత ఇంకో మంత్రం. మళ్ళీ డబ్బులు. ఇదొక బిజినెస్ అయిపోయింది. ఎంత తప్పో చూడు ! డబ్బుకోసం ఇంత నీచత్వానికి పాల్పడాలా !
ఆ శిష్యులు కూడా ఎలా ఉన్నారు? 'త్వరత్వరగా ఈ గురువు దగ్గరున్నదంతా పీల్చేసి మనం ఇంకో షాపు పెట్టుకుందాం. మనమూ మంత్రాలను అమ్ముకుంటూ సంపాదిద్దాం. గురువులుగా పాదపూజలు చేయించుకుందాం. జనాల్ని బకరాలను చేద్దాం' అని వాళ్ళనుకుంటున్నారు.
ఇదా శ్రీవిద్యంటే?
శ్రీవిద్యలోని మంత్రాలు సిద్ధించాలంటే ఎంతోకాలం పాటు వాటిని ఉపాసించాలి. అంతేకాదు. అవి సిద్ధించినదానికి రుజువులుగా నీకు కొన్ని నిదర్శనాలు కనిపిస్తాయి. నీ లోపలే మార్పులొస్తాయి. నీ వ్యక్తిత్వమే మారిపోతుంది. నువ్వే మారిపోతావు. అది జరగాలి. అది జరగకుండా, 'నేను ఆర్నెల్లు బాలామంత్రం జపించాను. నాకు సిద్ధించింది. ఇక షాపు తెరిచి దానిని అమ్ముకుంటాను' అని నువ్వనుకుంటే నీకంటే దరిద్రుడు ఇంకెవడూ ఉండడు.
నా చిన్నప్పుడు ఇదే డౌటు నాకొచ్చింది, 'శ్రీవిద్యోపాసనలో ఇంతమంది అమ్మవార్లెందుకు? ఒక అమ్మ చాలు కదా?' అని. కొంతమంది గురువులను అడిగాను. కొందరేమో, 'నువ్వు చిన్నపిల్లవాడివి నీ వయసుకి నీకు చెప్పినా అర్ధం కాదు' అన్నారు. మరికొందరు ఇంకేదో చెప్పారు. అసలు విషయమేమంటే వాళ్ళకెవరికీ సమాధానం తెలియదు. కాలక్రమంలో నా సాధనే నాకు సమాధానాలిచ్చింది. అమ్మవారే దారి చూపించింది. బోధించింది. అన్నీ అర్ధమయ్యేలా చేసింది.
ఈ శక్తులన్నీ నీలోని భాగాలే. నీలోని భాగాలను నీవు ఆవిష్కరించుకుంటూ, ఒక్కొక్కదానినీ తెలుసుకుంటూ, దాటుతూ, చివరకు నిన్ను నీవు తెలుసుకోవడమే అసలైన శ్రీవిద్య. కానీ ఈ శుద్ధమైన శ్రీవిద్యను చెప్పేవారు నాకు తెలిసి ప్రస్తుతం ఎవరూ లేరు. అందరూ చిల్లరకొట్లు పెట్టుకున్న చిట్టెమ్మలే' అన్నాను.
'అవును. కావ్యకంఠ గణపతిమునిగారు కూడా బాల, లలిత, త్రిపుర, మొదలైన దేవతలందరినీ మనలోని వివిధశక్తులనే చెప్పారు. నేనాయన సంస్కృతాన్ని బాగా అర్ధం చేసుకోలేకపోయాను. కానీ నాకర్ధమైనంతలో విషయం ఇదే ననిపించింది' అన్నాడు వెంకట్.
'అవును. 'ఉమాసహస్రం' చదువు అందులో ఆయన ఇదే చెప్పారు. ఆయనది శుద్ధోపాసన. అందులో వేదమూ, తంత్రమూ సమన్వయములౌతాయి. ఇప్పుడు నేను చెబుతున్నది కూడా అదే. ఈ మార్గంలో, బాహ్యోపాసన అంతరికోపాసనగా మారుతుంది. అంటే, నీ బయటా నీ లోపలా సమన్వయపరచబడుతుంది. బాహ్యంగా నువ్వు ఉపాసిస్తున్న అమ్మవార్లందరూ నీలోని శక్తులేనని అంతిమంగా నీకు అనుభవపూర్వకంగా అర్ధమౌతుంది. అందుకే 'శ్రీవిద్యారహస్యం' పుస్తకానికి 'శుద్ధోపాసనా వివరము' అని సబ్ టైటిల్ పెట్టాను. అర్థమైందా?' అడిగాను.
'అర్ధమైంది' అన్నాడు.
(ఇంకా ఉంది)