Pages - Menu

Pages

29, ఆగస్టు 2022, సోమవారం

మూడవ అమెరికా యాత్ర - 12 (అమెరికన్ తాంత్రికుడు - అసలైన భక్తి)

పరాశక్తి ఆలయంలో ఒక విచిత్రమైన మనిషి కనిపించాడు. అతనొక అమెరికన్ యువకుడు. కానీ అర్ధనారీశ్వర వేషంలో ఉన్నాడు. పైన ఒక వలలాంటి జాకెట్టు వేసుకున్నాడు. క్రిందేమో ఒక కాలికి ప్యాంటు, ఒక కాలికి చీర ఉన్న డ్రస్సు వేసుకున్నాడు. దానిపైన ఒక లంగా లాంటిది కట్టుకున్నాడు. తలకొక బ్యాండ్. దానిలో నెమలి ఈకలు, కోడి ఈకలు, ఇంకా ఏవేవో పిట్టల ఈకలు పెట్టుకున్నాడు. చేతికి జోలెసంచి. మొలకు ఏవో చిన్నచిన్న సంచులు వేలాడుతున్నాయి. కళ్ళజోడు పెట్టుకుని, రెండు జుట్టుపీచులు కళ్ళమీదుగా వేలాడేసుకున్నాడు.  అథ్లెటిక్ బాడీతో మంచి ఫిట్  గా  ఉన్నాడు.

హఠాత్తుగా చూసి అతనొక అమ్మాయేమో అనుకున్నాను. కానీ కాదు అబ్బాయే. అలాంటి విచిత్రవేషంలో ఉన్నాడు. అక్కడకు దగ్గరలోనే ఉంటాడు లాగా ఉంది,  కార్యక్రమం అయిపోయాక రోడ్డుపక్కనే నడుచుకుంటూ తన ఇంటికి పోతూ కనిపించాడు.

అందరూ అతన్ని విచిత్రంగా చూస్తున్నారు. కానీ అతనేమీ పట్టించుకోవడం లేదు. ఎవరితోనూ మాట్లాడటం లేదు. అమ్మవారంటే చాలా భక్తి ఉంది. చేతులు జోడించి ధ్యానంలో ఉంటాడు. అప్పుడప్పుడూ భుజానికున్న సంచిలో ఏదో ఇంగ్లిష్ పుస్తకం ఉంది. దానిని చదువుకుంటూ, పెన్నుతో అందులో ఏదో వ్రాసుకుంటూ ఉంటాడు. లేదా, ఒకచోట కూర్చుని, తన మొలకు వేలాడుతున్న చిన్న సంచిలోనుంచి ఏవో గోళీలు, క్రిస్టల్స్ లాంటివి తీసి చేతులో పెట్టుకుని వాటిని చూస్తూ ఉంటాడు. లేదా వాటితో ఆడుతూ, కళ్ళుమూసుకుని ఏవేవో చదువుతూ ఊగిపోతూ ఉంటాడు. ఎవరి జోలికి రాడు.

పంచెలు కట్టుకున్న సాంప్రదాయ ఇండియన్స్, పట్టుచీరలు కట్టుకున్న ఆడాళ్ళు, గోల చేస్తున్న పిల్లలు అతడినొక పిచ్చివాడిలాగా చూస్తున్నారు. ఇదంతా శనివారం నాడు జరిగింది.

ఆదివారం నాడు, మేము వెళ్లేసరికి ఒక దృశ్యం కనిపించింది. ఈ అమెరికన్ అర్ధ నారీశ్వరుడు అప్పటికే అక్కడ ఉన్నాడు.  అదే వేషంలో ఉన్నాడు. కానీ ఏం చేస్తున్నాడో తెలుసా?

మన సోకాల్డ్ సాంప్రదాయ  ఇండియన్స్ విచక్షణ లేకుండా పారేస్తున్న ప్లాస్టిక్ పేపర్లు, చెత్త కాగితాలు, టిఫిన్ బాక్సుల మూతలు, టీ గ్లాసులు ఇవన్నీ ఏరుకుంటూ తిరుగుతున్నాడు. చివరకు  అవన్నీ తెచ్చి ఒక డస్ట్ బిన్ లో పడేసి, మళ్ళీ తన దారిన తను గుడిలో ఒకచోట కూర్చుని తనలోకంలో తనున్నాడు. 'బయట మనిషిని చూచి మోసపోకు' అనే సామెత నాకు గుర్తొచ్చింది.

యాగశాలలోకొస్తాడు. భక్తిగా దణ్ణం పెట్టుకుంటాడు. ఆలయంలోకి వెళతాడు. అమ్మవారి విగ్రహానికి  సాష్టాంగ ప్రణామం చేస్తాడు. కూర్చుని ఏదేదో జపం చేసుకుంటాడు. ఈ విధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకూ తిరుగుతూనే ఉన్నాడు. ఎవరితోనూ మాట్లాడడు.

సాయంత్రం ఆలయం నుండి తిరిగి వచ్చేటప్పుడు, 'కెన్ ఐ హావ్ ఏ ఫోటో విత్ యు?' అనడిగాను.

'ఓ యా' అన్నాడు.

అతనితో కలసి ఒక ఫోటో దిగాను. అక్కడికొచ్చిన  అందరిలోకీ, పిచ్చోడిలాగా వేషం వేసుకున్న అతనే నార్మల్ మనిషిలాగా నాకు కనిపించాడు.

అక్కడున్న మహాభక్తులలో ఎవరికీ కూడా, పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్న స్పృహ లేదు. ఒక రూములో చెప్పుల కోసం ర్యాక్స్ ఉంచారు దేవాలయ కమిటీవారు. అందరూ ఆ రూము బయటే చెల్లా చెదురుగా చెప్పులు వదిలేశారు గాని, అతి కొద్దిమంది మాత్రం లోపల ర్యాక్స్ లో వదిలారు. మేము లోపలే వదిలాము కాబట్టి మాకీ విషయం తెలిసింది. అదే విధంగా, దేవాలయంలో మౌనంగా ఉండాలన్న స్పృహ ఎవరికీ లేదు. అక్కడే అరుపులు, గోల, పిల్లల ఆటలు, పెద్దల ముచ్చట్లతో ఇండియాలో గుడి వాతావరణాన్ని ఇక్కడ కూడా సృష్టించారు.

'అంతా మన ఇండియాలో లాగే ఉంది కదూ?' అని ఎవరో నాతో అన్నారు.

'అవును. అంతా అదే. ఏమీ తేడా లేదు' అన్నాను విరక్తిగా నవ్వుతూ.

వీళ్ళందరూ బయటకు పంచెలు, చీరలు, వేషాలు. పోజులు. ఈ అమెరికన్ ఏమో విచిత్రమైన వేషంలో ఉన్నాడు.  కానీ అందరూ పారేసిన చెత్తను ఎత్తేస్తున్నాడు. నాకైతే అతనికి దణ్ణం పెట్టాలని అనిపించింది. మనవాళ్ళు అసలైన ఆధ్యాత్మికతను ఎన్ని జన్మల తర్వాత నేర్చుకుంటారో మరి?

మనవాళ్ళు చెడ్డవాళ్ళని నేననడం లేదు. వారిలో కూడా ఇతర కోణాలలో చాలా మంచితనం ఉంది. కానీ పరిసరాల పట్ల, పక్కవాడిపట్ల, పర్యావరణం పట్ల  బాధ్యత మాత్రం లేదు. పరిసరాల పట్ల బాధ్యత లేని వ్యక్తులకు దైవంపట్ల భక్తి ఎలా వస్తుంది?

సాటిమనిషిని మనిషిగా చూడలేనివారికి దైవమంటే అవగాహన ఎలా వస్తుంది? ఏంటీ పిచ్చి జనం? పిచ్చి లోకం? ప్రకృతిలో దైవాన్ని చూడలేనివాడు ఇంకెక్కడ చూస్తాడు?

దేవుడా కనీసం నువ్వైనా ఈ గొర్రెలను బాగుచేయగలవా?