నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

14, ఆగస్టు 2022, ఆదివారం

మూడవ అమెరికా యాత్ర - 4 (జీవిత రహస్యాలు - భవిష్యజ్ఞానం)

నేను సర్వీస్ లో ఉండగా నాకు చాలా పరిమితులుండేవి. బాధ్యతలు కలిగిన ఒక ఉన్నతాధికారిగా వాటి పరిధిలోనే నేను సోషల్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం నాకుండేది. కానీ నేనిప్పుడు ఫ్రీబర్ద్ ని. ఆఫ్ కోర్స్, ఇప్పుడు కూడా సోషల్ మీడియా పరిమితులున్నాయి. కానీ అవి అఫీషియల్ పరిమితులకంటే కొంచం విశాలమైనవి. కనుక, ఫ్రీగా అన్ని విషయాలను నా అభిమానులతో శిష్యులతో పంచుకునే అవకాశం నాకు ఇప్పుడొచ్చింది. అందుకే, మునుపటికంటే లోతైన విషయాలను మీతో చెబుతున్నాను.

ఇప్పటిదాకా అయితే, ఇలాంటి విషయాలను నా గ్రూప్ లో మాత్రమే, నా శిష్యులతో మాత్రమే  మాట్లాడేవాడిని. కానీ అమెరికా సీరీస్ వ్రాస్తున్నందువలన ఇలాంటి లోతైన విషయాలను కూడా బ్లాగులో వ్రాస్తున్నాను. అది చదువరుల అదృష్టం. ఇది నామాట కాదు, నా బ్లాగు చదివి ఎన్నో క్రొత్త విషయాలను గ్రహిస్తున్నామని, జీవితాలకు జీవితాలే మంచిదారిలో పడుతున్నాయని నాకు వచ్చే ఎన్నో మెయిల్సే ఈ మాటలు అంటున్నాయి.

భవిష్యత్తును తెలుసుకోవడం అనేది మనిషికి అనాదినుంచీ ఉన్న ఒక ఉత్సుకత. అది సాధ్యమేనని నేనూ అంటాను. అదేమీ గొప్ప విషయం కాదని కూడా నేనంటాను. భవిష్యత్తును ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. దానిని మార్చవచ్చు కూడా. ఇది తన విషయంలోనూ, ఇతరుల విషయంలోనూ కూడా చెయ్యవచ్చు. దీనికి రెండు మార్గాలున్నాయి. ఒకటి, యోగదృష్టి, సాధనాబలం. రెండు, జ్యోతిష్యజ్ఞానం. మొదటిది ఉన్నవారికి రెండవది అవసరం లేకపోయినప్పటికీ, ధ్యానశక్తి ఉన్న యోగులు కూడా డబల్ చెక్ కింద జ్యోతిష్యజ్ఞానాన్ని వాడుకోవచ్చు. సాంప్రదాయ యోగులు ఇలా చేస్తూ ఉంటారు. 

ఇదంతా పుస్తకాలనుంచి కాదుగాని, నా అనుభవం నుంచి చెబుతున్నానని గ్రహించండి.

నా బ్లాగులో నా పర్సనల్ విషయాలను కూడా అతి సాధారణంగా వ్రాస్తూ ఉంటానని మీకు తెలుసు.  దానిక్కారణం నా జీవితం ఒక ఓపెన్ బుక్ కావడమే. ఇదే విధంగా నాతో సంబంధం ఉన్న ఇతరుల గురించి కూడా వ్రాస్తూ ఉంటాను. దానికి వాళ్ళు అఫెండ్ అవుతూ ఉంటారు.  అది వాళ్ళ ఖర్మ. కొంతైనా విశాలదృక్పధం లేనిదే నాతో ఎవరూ కలసి నడవలేరు. అది అసంభవం. ప్రతిదాన్నీ అంత  దాచిపెట్టుకుని దొంగలలాగా బ్రతకవలసిన ఖర్మ ఎందుకు మీకు? అని నేనడుగుతూ ఉంటాను.

ప్రస్తుతం విషయంలోకొస్తాను.

ఏడాదిలో సీజన్స్ ఉన్నట్లుగా, మన జీవితాలలో కూడా కొన్ని పాటర్న్స్ ఉంటాయి. లోతుగా పరిశీలించే శక్తి ఉంటే అవి అర్ధమౌతాయి.  యోగదృష్టి ఉన్నపుడు వాటి మూలాలు తెలుస్తాయి. ఆ మూలాలు గతజన్మలలోకి కూడా మనల్ని తీసుకెళతాయి. డబల్ చెక్ గా జ్యోతిష్యజ్ఞానాన్ని ఉపయోగించి నిర్ధారణగా వాటిని గ్రహించవచ్చు. ఇది నా సాధనామార్గంలో నడిచే నా శిష్యులకు నేను నేర్పించే ఒక సాధన. దీనివల్ల మీ జీవితపు లోతుపాతులు, జరుగుతున్న సంఘటనల మూలాలు, వాటి కారణాలు, అన్నీ మీకర్ధమౌతాయి.

2016 లో నేను మొదటిసారి అమెరికా వచ్చాను. అప్పుడు మా సతీమణి పెదనాన్న ఇండియాలో చనిపోయాడు.  అంటే నాకు మామయ్య వరస అవుతాడు. 2017 లో మళ్ళీ అమెరికా వచ్చాను. అప్పుడు మా మేనమామ ఇండియాలో చనిపోయాడు. ఇప్పుడు అయిదేళ్ల తర్వాత మళ్ళీ అమెరికా వచ్చాము. రాబోయే ముందు మా సతీమణితో ఇలా అన్నాను.

'మనం అమెరికాలో అడుగు పెట్టగానే మా మేనమామ భార్య చనిపోతుంది. ఈ వార్తను మనం అమెరికా గడ్డమీద వింటాము. కానీ ఆమెను చూడటానికి మనం పోలేము'.

గతంలో నేను చెప్పిన ఎన్నో సంఘటనలు జరగడం ప్రత్యక్షంగా చూచిన ఆమె మౌనంగా విని ఊరుకుంది. 

సాయంత్రం 5 గంటలకు మేము డెట్రాయిట్ లో అడుగుపెట్టాము. 6 గంటలకు మెసేజి వచ్చింది. ఆమె చనిపోయిందని. నేనేమీ ఆశ్చర్యపోలేదు. సతీమణి కూడా ఆశ్చర్యపోలేదు. 'ఈ విధంగా అమెరికా వచ్చాము, కార్యక్రమానికి రాలేమ'ని వారికి మెసేజి పెట్టాము. భవిష్యత్ జ్ఞానం వల్ల ఇలాంటి బేలెన్స్ వస్తుంది.

ఇదెలా సాధ్యమౌతుంది.?

అమెరికాలో అడుగుపెడుతున్నపుడే నాకు తెలిసిపోయింది. ఇండియాలో ఆమె మరణవేదన పడుతున్నదని. ఎలా తెలుస్తుంది? అని అడగకండి. అది నేను వివరించినా మీకర్ధం కాదు. ఎక్కడో ఇండియాలో ఉన్న వాళ్ళు వాట్సాప్ మెసేజి ఇస్తే అమెరికాలో ఎలా తెలుస్తున్నది? ఇదీ అంతే. దానికి చాలా రహస్యాలుంటాయి. వాటిని ఇంతవరకే చెప్పగలను గాని ఇంతకు మించి చెప్పలేను. నాకు యోగదృష్టితో తెలిసినది నిజమే అని నిర్ధారిస్తూ, కొద్దిసేపటిలోనే మెసేజి వచ్చింది ఆమె పోయిందని.

ఎవరి జాతకంలో అయితే, నవమభావానికి అష్టమభావానికి షష్ఠభావానికి సంబంధాలుంటాయో, వారు దూరదేశాలకు వెళితే, వారి మేనమామ గాని, మేనమామ సంబంధిత బంధువులు గాని  చనిపోతారు. ఇది ఒక జ్యోతిష్యసూత్రం. ఈ యోగం నా జాతకంలో స్పష్టంగా ఉంది. ఈ విషయం నాకు తెలుసు గనుక యోగదృష్టి ద్వారా నాకు తెలిసిన విషయాలను జ్యోతిష్యజ్ఞానంతో డబల్ చెకప్ చేసుకుని నిర్ధారణ చేసుకున్నాను. ఈ జ్ఞానంతోనే మా సతీమణికి  మూడునెలల ముందు చెప్పాను,'మా అత్తయ్యకు రోజులు దగ్గర పడుతున్నాయి.  మనం అమెరికాలో అడుగుపెట్టిన వెంటనే ఆమె చనిపోతుంది' అని. ఖచ్చితంగా అదే ఇప్పుడు జరిగింది. 

 ఇలాంటి యోగదృష్టి ఎలా వస్తుంది? అని మీకు సందేహం రావచ్చు.

ఎన్నో ఏండ్ల సాధనతో ఇది వస్తుంది. యోగసూత్రాలలోని 'సిద్ధిపాదం' అనే అధ్యాయంలో పతంజలిమహర్షి ఇటువంటి సిద్ధులను ఉదాహరించారు. ఈ సిద్ధిని ఆయన 'కాలగతి జ్ఞానం' అన్నారు. ఇది నిజమే అని నా జీవితంలో ఎన్నో అనుభవాలద్వారా నేను స్పష్టంగా గ్రహించాను.

'అయితే, భవిష్యత్తును తెలుసుకుని ఏం చెయ్యాలి, మార్చలేము కదా?' అని మీకు సందేహం రావచ్చు.  అది కరెక్ట్ కాదు. భవిష్యత్తును మార్చడం కూడా సాధ్యమే. అయితే, అది అందరూ చేసుకోలేరు.  అంతటి అర్హతలు అందరికీ ఉండవు. మేము కూడా అందరికీ దీనిని చెయ్యము. అతి కొద్దిమందికి మాత్రమే ఇటువంటి సహాయాన్ని చేస్తాము. అలా సహాయాన్ని పొందటానికి వారికి ఎన్నో ఉత్తమ అర్హతలుండాలి.  అటువంటి మనుషులకే ఆ సహాయం చేస్తాము గాని ఊరకే పరిచయం ఉన్న అందరికీ చెయ్యము.

నా వ్రాతలలో స్పష్టమైన తేడాను గమనించారా? ఇన్నాళ్లు ఇన్ డైరెక్ట్ గా వ్రాసేవాడిని, ఇప్పుడు బయటపడి, డైరెక్ట్ గా నేనేంటో చెబుతున్నాను.

ఇదే  మరి 'న్యూ లైఫ్' ప్రభావమంటే! మీ అదృష్టం వల్లే మీరు నా వ్రాతలను చదువగలుగుతున్నారు. ఇంత అధికారికంగా ప్రాక్టికల్ గా విషయాలను నిరూపిస్తూ చెప్పేవారు మీకెక్కడ దొరుకుతారు?

ఇది మీ అదృష్టమా కాదా మరి?