Pages - Menu

Pages

15, ఆగస్టు 2022, సోమవారం

మూడవ అమెరికా యాత్ర - 6 (జీసస్ కే దిక్కులేదు నేనెంత?)

నిన్న 'ఆ' ఇంటికి లంచ్ కెళ్ళాము. 'ఆ' పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్ (అమెరికా) కు అద్యక్షుడు. డెట్రాయిట్ లోని ప్రముఖులలో ఒకడు. అమెరికా ప్రెసిడెంట్ తో ఏడాదికి కనీసం రెండుసార్లు డిన్నర్ చేస్తాడు. ఇండియా నుంచి సెంట్రల్ మినిస్టర్స్ గాని, ప్రముఖులు గాని డెట్రాయిట్ కి వస్తే వీళ్ళ అతిధులుగా ఉంటారు. ఆ స్థాయి మనిషి. ఈయన నా శిష్యుడే గాక, నేనంటే ఎంతో ప్రేమా గౌరవమూ ఉన్న వ్యక్తి. ఆయన సతీమణి కూడా అంతే. డెట్రాయిట్ లోని ఒక పోష్ లొకాలిటీలో రెండెకరాల స్థలంలో  వీళ్ళ బంగళా ఉంటుంది. అక్కడకు నిన్న లంచ్ కి వెళ్లడం జరిగింది. మన ఇండియా వంటకాలను ఎంతో శ్రద్ధతో చేసి, ప్రేమతో వడ్డించారు ఆ దంపతులు.

ఎత్తైన పైన్ వృక్షాల మధ్య, బాక్ యార్డ్ డెక్ మీద లంచ్ చేసి తీరికగా కూర్చున్న తర్వాత, 'ఆ' ఇలా అడిగాడు.

'గురూజీ ! మీరు 'ప' ఇంటికి ఎందుకెళ్ళారు? మీకలాంటి అవమానం జరిగితే మేము భరించలేము. మీకోసం రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇవ్వడానికి ఎంతో మందిమి ఇక్కడ సిద్ధంగా ఉన్నాము. మీరు ఒకసారి మా ఇంటికి వస్తే చాలని ఎదురుచూచేవాళ్ళం ఎంతోమందిమి ఉన్నాము. మీరెందుకు వెదుక్కుంటూ అక్కడకు వెళ్లి, ఆ అవమానాన్ని స్వీకరించారు? ఇది మాకెంతో బాధగా ఉంది'

తనతో ఇలా చెప్పాను.

'మీరు 'ప' కోసం వెదుకవద్దని నాతో గతంలో చెప్పారు. కానీ మీ మాటను వినకుండా 'ప' ఇంటికి వెతుక్కుంటూ వెళ్లినందుకు ముందుగా మీకు సారీ చెబుతున్నాను. అక్కడకు వెళ్లకుండా ఉంటే నాకు గిలిగా ఉండేది.  ఒక్క అవకాశం తనకు ఇచ్చి ఉంటే బాగుండేదేమో, తను మళ్ళీ మంచిమార్గంలోకి వచ్చేదేమో? అని ఒక ఆలోచన నాలో మిగిలిపోయి ఉండేది. ఇప్పుడా గిలి లేదు. చివరి అవకాశం నేనిచ్చాను, కానీ తను ఉపయోగించుకోలేకపోయింది. అది తన ఖర్మ. నావైపు నుండి నేను క్లిన్ హార్ట్ తో ఉన్నాను. ఈ కోణంలో చూచినప్పుడు, నేను వెళ్లడం వల్ల మంచే జరిగిందని  అనుకుంటున్నాను'

అర్ధం అయిందన్నట్లు 'ఆ' నవ్వాడు.

నేనింకా ఇలా చెప్పాను.

'చూడండి. Knock and it shall be opened unto you అని జీసస్ బైబిల్లో అంటాడు. I am standing at your door and knocking. Will you open the door?' అన్నట్లు కూడా బైబిల్లో మాటలుంటాయి. నేనూ అదే చేశాను. డోర్ దగ్గర నిలబడి తలుపు కొడుతుంటే జీసస్ కే అక్కడ దిక్కూ మొక్కూ లేదు.  ఇక ఆఫ్టరాల్ నేనెంత చెప్పండి? రెండువేల ఏళ్ళనుంచీ ఇంటింటికీ తిరుగుతూ జీసస్ తలుపులు కొడుతూనే ఉన్నాడు. చాలామంది ఇప్పటికీ తలుపులు తెరవడం లేదు. ఇక నాకెవరు తెరుస్తారు? కనుక ఆ విషయం గురించి మీరు బాధపడకండి.  నేను దానిని అవమానంగా తీసుకోవడం లేదు. గౌరవాన్ని ఆశించి నేనక్కడికి వెళ్ళలేదు. ఒకవేళ నిన్న జరిగినది అవమానమైనప్పటికీ, నేడు మీ ఇంట్లో ఇంతటి గౌరవాన్ని పొందాను. నిన్న జరిగినది అవమానం అనుకుంటే, నేడు ఒక సెలబ్రిటీ ఇంట్లో అద్భుతమైన రెడ్ కార్పెట్ వెల్కమ్ మరియు ఆదరణ, గౌరవాలను పొందాను. మానావమానాలను సమంగా తీసుకునేవాడే నాకిష్టుడని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడన్నాడు. వెలుగూ చీకట్లలాగా, పగలూ రాత్రులలాగా, సుఖదుఃఖాలలాగా అవమానాలు గౌరవాలు కూడా జీవితంలో సహజమే.  నాకేమీ బాధ లేదు. మీరు కూడా వర్రీ అవకండి. నేను చేయవలసింది చేశాను. ఫలితం నాకనవసరం. బాధపడకండి' అని చెప్పాను.

శ్లో || సమః శత్రౌచ మిత్రేచ తథా మానావమానయోః 

శీతోష్ణ సుఖదుఃఖేషు సమః సంగ వివర్జితః ||

శ్లో || తుల్యనిందా స్తుతిర్మౌనీ సంతుష్టో ఏనకేనచిత్

అనికేతః స్థిరమతి: భక్తిమాన్యే ప్రియా నరః || భగవద్గీత 12-- 18, 19 || 

శత్రువులను మిత్రులను సమానంగా చూస్తూ, గౌరవాన్ని అవమానాన్ని సమంగా స్వీకరిస్తూ, చలిని వేడిని, సుఖదుఃఖాలను సమానములుగా చూస్తూ, సంగమును వదలిపెట్టినవాడై, నిందనూ స్తుతినీ సమంగా తీసుకుంటూ, ఏది లభించినా దానితోనే సంతోషపడుతూ, ఒక ఆధారమంటూ లేనివాడై, స్థిరమైన మనస్సుతో, భక్తిపరుడై ఉన్నవాడే నాకు ప్రీతిపాత్రుడు.

అని సాక్షాత్తు భగవంతుడే చెప్పలేదా మరి?


డెక్ మీద


బ్యాక్ యార్డ్ లోని బుద్ధా పాండ్ దగ్గర ధ్యానస్థితిలో


'ఆ' ఇంటి పరిసరాలు