నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

16, ఆగస్టు 2022, మంగళవారం

మూడవ అమెరికా యాత్ర - 7 (స్నానానికి ముందే సంధ్యావందనం)


స్నానానికి ముందే సంధ్యావందనమా? ఇదేంటి? అని మళ్ళీ గుక్క పెట్టకండి. చదవండి.

స్నానం చేసి సంధ్యావందనం చెయ్యాలని, గాయత్రిని జపించాలని చిన్నప్పుడు నేర్చుకున్నా. కానీ ఇప్పుడది పూర్తిగా రివర్స్ అయింది. స్నానంతో పనిలేకుండా గాయత్రి నడుస్తోంది. సంధ్య అనుక్షణం దర్శనమిస్తోంది.

డెట్రాయిట్ కొచ్చాక నాకు బాగా నచ్చిన అనుదినచర్యలలో ఒకటి -- మార్నింగ్ వాక్. ఇక్కడ సూర్యోదయం ఉదయం ఆరున్నరకు అవుతోంది. అస్తమయం రాత్రి తొమ్మిదిన్నరకు అవుతోంది. సూర్యోదయానికంటే రెండుగంటల ముందే నిద్రలేస్తున్నాం గనుక, ధ్యానసాధనలన్నీ సూర్యోదయం  కంటే ముందే అయిపోతాయి. సూర్యుడు ఉదయించే సమయానికి  మార్నింగ్ వాక్ లో ఉంటాను. సూర్యోదయాన్ని ఆస్వాదిస్తాను.

సూర్యోదయం ఇండియాలో కూడా జరుగుతుంది. కానీ అది జనారణ్యం. దుమ్ము, గోల, విశాలమైన పరిసరాలు లేకపోవడం, ట్రాఫిక్ గోల, అరుపులు, డిస్టర్బెన్స్ లు, ఇవన్నీ ఆ ఆస్వాదనకు అడ్డుపడతాయి. ఇక్కడా బాధ లేదు. రోజుమొత్తం మీద ఒక్కొక్కసారి మనుషులే కనిపించరు. విశాలమైన పచ్చిక బయళ్లు, చెట్లు, ప్రకృతి ఇవన్నీ కలసి సృష్టిమధ్యన మనం ఒక్కళ్ళమే ఉన్న ఫీలింగ్ వస్తుంది. అది ధ్యానస్థితిని అప్రయత్నంగా కలిగిస్తుంది.

నిన్న ఉదయం మార్నింగ్ వాక్ చేస్తున్నా. సూర్యుడు ఉదయిస్తున్నాడు. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ లను బట్టి సూర్యకాంతిలో తేడాలుంటాయి. ఇవి ధ్యానులకు స్పష్టంగా తెలుస్తాయి. ఇక్కడి సూర్యుడు బంగారుకాంతిలో ఉదయిస్తాడు. అద్భుతమైన వెలుగు కిరణాలు నలుదెసలా పరుచుకుంటూ గోచరిస్తాయి. అనంతమైన ఆకాశంలో అద్భుతమైన మేఘాలు. ఆ మేఘాలనుండి తూర్పుదిక్కున బంగారుకాంతిలో సూర్యోదయం. ఈ దృశ్యాన్ని నిన్న చూచాను. అప్రతిభుడినై అలాగే నిలబడిపోయాను. వెంటనే ఈ ఋగ్వేదమంత్రం మనసులో అలలలాగా ధ్వనించింది.

|| ఆ సత్యేన రజసా వర్తమానో నివేశయన్నమృతం మర్త్యం చ హిరణ్యయేన సవితా రథేన ఆ దేవో యాతి భువనా విపశ్యన్ ||

'సత్యస్వరూపమైన తన తేజస్సుతో ప్రతిదినమూ మానవులను దేవతలను ఉత్తేజపరుస్తూ తన బంగారురధంలో సమస్తలోకాలనూ వీక్షిస్తూ ఈ దేవదేవుడు ఉదయిస్తున్నాడు. మానవులారా చూడండి !' అంటూ వేదఋషులు పలికిన మంత్రధ్వనులు నా చెవులలో అలలలాగా తేలియాడుతూ  ప్రతిధ్వనించాయి.

ఆలోచనలు ఆగిపోయాయి. అనంతమైన బంగారుకాంతిలో లీనమై స్థాణువులాగా దారిలోనే నిలచిపోయాను. ఎక్కడున్నానో తెలియదు. కాలం ఆగిపోయింది.

సంకల్పానికి సంకల్పానికి మధ్య అగాధమైన శూన్యంలో సంధ్యాదేవి తన దేదీప్యమైన కాంతిలో నిత్యమూ దర్శనమిస్తోంది. ఇక ప్రత్యేకంగా సంధ్యావందనమెందుకు? స్నానం అవసరమేముంది?

సమస్తదేవతలూ సూర్యకాంతిలోనే ఉన్నారు. చూడగలిగే చూపుంటే వారిని దర్శించవచ్చు. ఈ స్థితిలో ఉన్నపుడు ఇక ప్రత్యేకమైన గాయత్రీజపం ఎందుకు? దానిలోనే మనస్సు నిత్యమూ నిలబడిపోతుంటే ఇక దేనిని జపించాలి?

వేదఋషులతో శ్రుతిగలుపుతూ నేనూ ఇదే చెబుతున్నాను.

మానవులారా ! మీ చెత్త జీవితాల ఊబిలోనుంచి బయటపడండి. ఈ స్థితులను అందుకోండి. మీ జీవితాలకు ధన్యత్వాన్ని అద్దుకోండి.

ఉత్తమమైన మానవజన్మ లభించి కూడా, ఈ సత్యాలను ప్రత్యక్షంగా దర్శించలేకపోతే, ఇంద్రియాల ఊబిలోనే ఉంటుంటే, గాసిప్ తో జీవితాన్ని నింపుకుంటుంటే, ఇక మానవజన్మకు అర్ధమూ పరమార్థమూ ఏముంటాయి?