“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

10, సెప్టెంబర్ 2022, శనివారం

మూడవ అమెరికా యాత్ర - 16 ( ఎంకి పెళ్లి - సుబ్బి చావు)

'ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది' అనేది సామెత. ఏం ఎంకి పెళ్లిచేసుకోకపోతే సుబ్బి చావదా? ఇక్కడే శిలాశాసనంగా ఉండిపోతుందా? అని వితండవాదం చేస్తే ఎవరూ ఏమీ చెప్పలేరు గాని, రెండు సంఘటనలు ఒకదానివెంట మరొకటి జరిగితే ఈ విధంగా అంటారు మరి.

ఇంగ్లీషువాళ్ళు మన సామెతలను నమ్ముతారో లేదో నాకు తెలీదు. మనం నమ్మకపోతే సూర్యుడు ఉదయించకుండా ఉంటాడా? ఉండడు కదా? ఇదీ అంతే.

లీజ్ ట్రాష్ బ్రిటిష్ ప్రధానమంత్రి అయింది. ఆమెకు అధికారపత్రాన్ని చేతికి ఇచ్చిన రెండో రోజే రెండో ఎలిజబెత్ రాణి హరీమంది. ఇది చూస్తే నాకు పై సామెత గుర్తొచ్చింది.

రెండో ఎలిజబెత్ రాణి 21  ఏప్రియల్ 1926 న లండన్లో పుట్టింది. సూర్యుడు ఉచ్ఛస్థితి. రాహుకేతువులు ఉచ్ఛస్థితిలో ఉన్నారు, శని ఉచ్ఛస్థితిలోకి వస్తాడు. కుజుడు ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. గురుబుధులు నీచస్థితిలో ఉన్నప్పటికీ నీచభంగ రాజయోగం పట్టింది. ఆశ్లేషా నక్షత్రం 4 పాదం, కర్కాటక రాశి అయింది. మహారాజయోగాలు ఎలా ఉంటాయో ఈ జాతకాన్ని చూస్తే అర్ధమౌతుంది. అందుకే ప్రపంచంలో అనేక దేశాలకు మహారాణిగా 70 ఏళ్లపాటు ఒక వెలుగు వెలిగింది.  

గోచార గ్రహాల స్థితి

గురువు నవమం నుంచి అష్టమంలోకి వస్తున్నాడు. ప్రాణగండం. శని సప్తమం నుంచి షష్ఠంలోకి వస్తున్నాడు. ఇదీ మంచి సూచన కాదు. రాహుకేతువులతో అర్గళం పట్టింది. ఆయుష్షు అయిపోయింది. అయితేనేం పూర్ణాయుష్కురాలై 96 ఏళ్ళు బ్రతికింది. కానీ చివరకు తెలుగు సామెతను నిజం చేస్తూ వెళ్ళిపోయింది. పోతూ పోతూ కనీసం మన కోహినూర్ వజ్రాన్నైనా మనకివ్వకుండా వెళ్ళిపోయింది.

సర్లే ఏం చెయ్యగలం ఎవరి ఖర్మ వారిది. చావులో రాజనీ పేదనీ తేడా ఏముంటుంది? ఈ జన్మలో రాజు మరుజన్మలో బంటు, ఈ జన్మలో బంటు మరుజన్మలో రాజు. సృష్టి ఎంత విచిత్రమైనదో?

రామాయణకాలంలో సీతాదేవికి సేవ చేసిన రాక్షసవనిత త్రిజట, ఆ పుణ్యబలం చేత, ఈ జన్మలో విక్టోరియా మహారాణిగా పుట్టిందని  ఇండియాకు రాణి అయిందని ఉపాసని మహరాజ్ అనేవారు. మెహర్ బాబా కూడా అదేమాటను అన్నారు.

ముందటి జన్మలలో లెక్కలేనన్ని మంచిపనులు చేసినవాళ్లకు మరుసటి జన్మలో ఇలాంటి మహరాజయోగాలు కలుగుతాయి. కానీ ఆ పుణ్యబలం ఖర్చైపోయాక మళ్లీ మామూలు జన్మలే వస్తాయి.

ఎలిజబెత్ రాణి మరుజన్మలో ఎక్కడ పుట్టబోతోందో తెలుసుకోవాలని ఉందా? కుదరదు గాక కుదరదు.

కొన్ని అలా లాకర్లలో ఉండిపోవలసిందే, కోహినూర్ వజ్రం లాగా.