Pages - Menu

Pages

13, సెప్టెంబర్ 2022, మంగళవారం

మూడవ అమెరికా యాత్ర - 18 (అమెరికాలో అత్యంత ఖరీదైన వస్తువు)

సుందరి ఈరోజు కూడా ఇండియానుంచి ఫోన్ చేసింది.

ఆ సమయంలో కిటికీలోంచి బయటకు చూస్తూ, ఆకాశంతో మేఘాలతో మాట్లాడుతున్నా.

విసుగ్గా ఫోనెత్తి, 'ఏంటి ముఖ్యమైన పనిలో ఉంటే డిస్టర్బ్ చేస్తున్నావ్? మరొక సందేహమా? త్వరగా చెప్పు. అవతల చాలా పనుంది' అన్నా దాదాపు అరుస్తున్నట్టు.

ఆమె భయపడిపోయి, 'సారీ డిస్టర్బ్ చేసినట్టున్నాను. పోనీలే మళ్ళీ చేస్తాలే' అంది అపాలజెటిగ్గా.

'అదే మండేది, పోస్ట్ ఫోన్ మెంట్ అంటే నాకు నచ్చదని తెలుసుగా? షూటిట్' అన్నా ఉరుముతూ.

ఆ అమ్మాయి బిక్కచచ్చిపోయి, నసుగుతూ, 'ఏం లేదు. చిన్నదే. ఎక్కువ టైం తీసుకోను. అమెరికాలో అతి ఖరీదైన వస్తువేంటి?' అడిగింది.

నాకు నవ్వుతో కొరపోయింది.

తమాయించుకుని, 'వెరీ గుడ్ మంచి సందేహం అడిగావ్. ఐ లైక్ ఇట్. చెబుతా విను. కల్మషం లేని నవ్వు.' అన్నా

తనకర్ధమైంది నేను సీరియస్ గా లేకపోయినా ఉన్నట్టు నటిస్తున్నానని.

'నేనడిగింది వస్తువుల గురించి' అంది కోపంగా.

'నే చెబుతున్నది వాస్తవాల గురించి' అన్నా నవ్వుతూ.

'అదేంటి అంత అమెరికాలో మీకెక్కడా స్వచ్ఛమైన నవ్వు కనపడలేదా?' అంది.

'అమెరికాలోనే కాదు, ఇండియాలో కూడా కనపడలేదు ఎక్కడో తప్ప' అన్నా.

'ఎందుకలా?' అడిగింది.

'చెబితే శానా ఉంది. ఇంటే ఎంతో ఉంది. ఇనే ఓపిక నీకుందా?' అడిగా.

'ఉంది కాబట్టేగా మీకు ఫోన్ చేసింది' అంది తగ్గకుండా.

'సరే విను' అంటూ నోటికొచ్చిన ఈ కవిత వినిపించా.


కొన్ని ప్లాస్టిక్ నవ్వులు

కొన్ని గ్యాస్ట్రిక్ నవ్వులు

(గ్యాస్ట్రిక్ అంటే తిన్నదరక్క నవ్వే నవ్వులన్నమాట)


కొన్ని అబద్దపు నవ్వులు

కొన్ని అసహ్యపు నవ్వులు


కొన్ని అనుమానపు నవ్వులు

కొన్ని అహంకారపు నవ్వులు


కొన్ని తప్పదన్నట్టు నవ్వులు

కొన్ని ఒప్పుకోలేని నవ్వులు


కొన్ని అవసరార్ధపు నవ్వులు

కొన్ని జడపదార్ధపు నవ్వులు


కల్మషం లేని నవ్వు

ఈ లోకంలో ఎంతో అరుదు

అలా నవ్వగలిగే వారికి

నేనిస్తా చక్కటి బిరుదు


పసిపాప ముఖంలో కూడా

కల్మషం కస్సుమంటోంది

ప్రతివారి జీవితాలలో

చిరాకు బుస్సుమంటోంది


కల్మషం లేని మనసును

కావలించుకోవాలనుంది 

కడుపారా నవ్వే మనిషిని

కాళ్లకు మొక్కాలనుంది


అన్నా.


అట్నుంచి నిశ్శబ్దం.


విషయం తనకర్థమైందని నాకర్ధమైంది.

ఫోన్ పెట్టేసి మేఘాల వైపు దృష్టి సారించా.