Pages - Menu

Pages

2, అక్టోబర్ 2022, ఆదివారం

మూడవ అమెరికా యాత్ర - 27 (మా క్రొత్త పుస్తకం 'వేదాంత సారము' విడుదలైంది)

నా కలం నుండి వెలువడుతున్న 52 వ పుస్తకంగా అద్వైతవేదాంతమునకు ఒక టెక్స్ట్ బుక్ లాంటిదైన 'వేదాంతసారము' నేడు వెలువడుతున్నది.

ఇది 15 వ శతాబ్దమునకు చెందిన శృంగేరీ శంకరాచార్యులైన సదానంద యోగేంద్ర సరస్వతీస్వామి వారి సంస్కృతమాతృకకు నా తెలుగువ్యాఖ్యానము. డెట్రాయిట్ (అమెరికా) నుండి ఈ గ్రంధమును విడుదల చేస్తున్నాను.

అమెరికా వెళ్లి ఏం చేస్తున్నారని నా శిష్యులు కొంతమంది అడుగుతున్నారు. ఇదుగో ఇదే చేస్తున్నాను. భోగభూమిలో ఉంటూ వేదాంతం వ్రాస్తున్నాను. అర్హులకు యోగాన్ని నేర్పిస్తున్నాను.

వేదాంతమంటే సాధారణంగా అద్వైతవేదాంతమనే భావన లోకంలో వాడుకలో ఉంది. ద్వైతము, విశిష్టాద్వైతములు కూడా వేదాంతములే. అయినప్పటికీ, 'వేదాంతము' అంటే అద్వైతమనే భావన లోకంలో స్థిరపడి పోయింది. దానికి కారణం అది తాత్విక చింతనలలో అన్నింటిలోకీ అత్యున్నతమైన శిఖరం కావడమే కావచ్చు.

అద్వైతవేదాంతమును వివరిస్తూ వ్రాయబడిన గ్రంధములు ఎన్నో ఉన్నాయి. వాటిలో శ్రీ సదానంద యోగేంద్ర సరస్వతీస్వామి వ్రాసిన 'వేదాంతసారమ'నే ఈ గ్రంధమునకు పండితలోకంలో చాలా విలువ ఉన్నది. అద్వైతవేదాంతమును అధ్యయనం చేయాలనుకునే వారికి ఇదొక టెక్స్ట్ బుక్ వంటిది. అందుకే దీనిని ప్రకరణ గ్రంధాలలో ఒకటిగా భావిస్తారు.

శ్రీసదానంద యోగేంద్ర సరస్వతీస్వామి, శృంగేరీ సాంప్రదాయమునకు చెందిన అద్వైతాచార్యుడు. 15 వ శతాబ్దంలో ఈయన నివసించిట్లు ఆధారాలున్నాయి. ఈయన 'వేదాంత సిద్ధాంత సారసంగ్రహము', 'బ్రహ్మసూత్ర తాత్పర్య ప్రకాశము'లనే ఇతర గ్రంధాలను రచించినట్లుగా తెలుస్తున్నది. భగవద్గీతపైన ఈయన వ్రాసిన వ్యాఖ్యానము 'భావప్రకాశమ'నే పేరుతో ప్రసిద్ధి కెక్కింది. ఈయన తండ్రిగారు అనంతదేవుడని, గురువుగారు అద్వయానంద సరస్వతీస్వామి యని తెలుస్తున్నది.

వీరి రచనలలో ఆదిశంకరుల వారిని, సురేశ్వరాచార్యులవారిని, విద్యారణ్యస్వామివారిని భక్తితో స్మరిస్తూ, వారి గ్రంథముల నుండి శ్లోకములను ఉటంకిస్తూ తమ రచనను సాగించారు. చాలా చిక్కని అద్వైతమును సూటిభాషలో వివరించారు.

ప్రస్తుత గ్రంధములో, అద్వైత వేదాంతాధ్యయనమునకు అధికారి ఎవరు?, అతనికి ఉండవలసిన లక్షణములేమిటి?, ఈ శాస్త్రము యొక్క ప్రయోజనమేమిటి? దీనిచేత పొందబడే సిద్ధి ఎలా ఉంటుంది? అనే విషయములతో మొదలుపెట్టి, వ్యష్టి, సమష్టి, పంచకోశములు, అజ్ఞానము, జ్ఞానము, జీవుడు, మాయ, ఈశ్వరుడు, మహావాక్యముల వివరణ, బ్రహ్మానుభవము, దానికి చేయవలసిన సాధనామార్గము, దానిలోని మెట్లు, జీవన్ముక్తుని స్థితి, అతని జీవనవిధానము, విదేహముక్తి మొదలైన వివరములు చాలా చక్కని  ప్రణాళిక ప్రకారం వరుసగా వివరింపబడినాయి.

ఈ గ్రంధము మధ్యలో మహావాక్యముల వివరణాభాగంలో వివరింపబడిన తర్కభాగం చాలా జటిలమైనది. దానిని అర్ధం చేసుకోవాలంటే అతి తీక్షణమైన బుద్ధికుశలత ఉండాలి. లేదంటే గందరగోళంగా అనిపిస్తుంది. అర్ధం కాదు. ఔత్సాహికులు ప్రయత్నించి చూడండి.

నాకు దాదాపుగా ఇరవై ఏళ్ల వయసులో ఈ గ్రంధమును నేను మొదటిసారిగా చదవడం జరిగింది. అద్వైతవేదాంతము పైన నాకు బాగా నచ్చిన ప్రాచీన గ్రంధములలో ఇది ఒకటి. ఇన్నేళ్లకు ఈ గ్రంధానికి నాదైన వ్యాఖ్యానమును వ్రాయడం సాధ్యపడింది.

ఈ గ్రంధమును వ్రాయడంలో నాకు ఎంతో సహాయపడిన నా శ్రీమతి సరళాదేవి, ప్రూఫ్ రీడింగ్, టైప్ సెట్టింగ్, బుక్ ఫార్మాటింగ్ పనులు చేసిన అఖిల, కవర్ పేజీని డిజైన్ చేసిన ప్రవీణ్, పబ్లిషింగ్ పనులు చూచుకున్న శ్రీనివాస్ చావలిలకు నా ఆశీస్సులు, కృతజ్ఞతలు.

ఈ నా వ్యాఖ్యానము, జిజ్ఞాసువులకు, ముముక్షువులకు నచ్చుతుందని, వారికి ఆనందాన్ని కలిగిస్తుందని, అద్వైతవేదాంతమును అర్ధం చేసుకోవడంలో వారికి ఇతోధికంగా సహాయపడుతుందని నమ్ముతున్నాను.

ఈ గ్రంధం కూడా ప్రస్తుతానికి ఈ బుక్ గా Google Play Books నుండి ఇక్కడ లభిస్తుంది. చదవండి. సాధన చేయలేకపోతే మానె, కనీసం అద్వైతాన్ని అర్ధం చేసుకోండి. భారతీయ తాత్విక చింతనా శిఖరాలు ఎలా ఉంటాయో  కనీసం గ్రహించండి.