“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

2, అక్టోబర్ 2022, ఆదివారం

మూడవ అమెరికా యాత్ర - 28 (బాధ్యతలు - ఆశలు)

బాధ్యతగా ఫీలయ్యేవాడు

బాధలతో పోతాడు

అనుభవాలు కోరేవాడు

ఆశలతో పోతాడు


బాధ్యతలు ఎన్నటికీ తీరవు

ఆశలు ఎన్నటికీ ఆరవు

మనిషి ప్రయాణం ఆగదు 

అతని జీవనశైలి మారదు


మారాలని కోరుకుంటూ

మారలేకపోవడం

అలా ఉండాలనుకుంటూ

ఉండలేకపోవడం

ఇదేగా జీవితం !


అంతులేని ఈ చిక్కుముడికి

పరిష్కారమేంటని

ఎవరో నన్నడిగారు

వారితో ఇలా అన్నాను


చేతనైతే నడువు, లేదంటే కూచో

ఎలాగైనా గమ్యం చేరతావు 

కొంచెం ముందూ, కొంచెం వెనుకా

అంతే తేడా !


ఈ ప్రయాణం విచిత్రమైనది

సరిగా కూచోవడం చేతనైతే

నడిచేవాడికంటే, పరిగెత్తేవాడికంటే

నువ్వే ముందు చేరుకుంటావు


ముందు నడిస్తే వెనక్కొచ్చి

నడక నేర్పిస్తావు

వెనుక నడుస్తూ ఉంటే

నడుస్తూ ఉంటావు


నడవడమూ కష్టమే

కూచోవడమూ కష్టమే

మాట్లాడటమూ కష్టమే

మౌనంగా ఉండటమూ కష్టమే


బరువును మోస్తూనే

బరువనుకోకుండా ఉండాలి

ప్రయత్నాలు చేస్తూనే

ఫలితాల ఆశ లేకుండా ఉండాలి


బాధ్యతల బరువులను

దించుకున్నవాడెవడు?

ఆశల అగ్నులను

ఆర్పుకున్నవాడెవడు?


సత్యం ఇలా అంటున్నాడు


మాటలలోనే జీవితం ఆవిరైపోతుంది

ఆటలలోనే అవకాశం చేజారిపోతుంది

ఒడ్డెక్కినవాడెవడో చెప్పనా నేస్తం?

బాధ్యతలు, ఆశలు రెండూ లేనివాడే !