Pages - Menu

Pages

5, అక్టోబర్ 2022, బుధవారం

మూడవ అమెరికా యాత్ర - 30 (అసలైన క్రియాయోగం)

'మీకు క్రియాయోగం తెలుసా?' అని ఇండియాలో ఉండగా ఒక జిజ్ఞాసువు నన్నడిగారు.

'తెలీదు' అని చెప్పాను. 

'మరి తెలిసినట్టు రాస్తుంటారు కదా?' అన్నారు.

'అంటే, దాన్ని మించినది తెలుసు' అన్నాను.

'అదేంటి?'అడిగాడాయన.

'దాన్ని నిష్క్రియాయోగం అంటారు' చెప్పాను.

'అదెక్కడుంది?' అనుమానమొచ్చింది అడిగినాయనకు.

'మీకు తెలీనంత మాత్రాన లేదని అనుకోకండి' అన్నాను.

'దాని మూలపురుషుడెవరు?' అడిగాడు విక్రమార్కుడు.

'ప్రస్తుతానికి నేనే' అన్నాను తాపీగా.

ఎగాదిగా చూసి మాయమైన విక్రమార్కుడు మళ్ళీ కనిపించలేదు.

నవ్వుకున్నాను.

నవ్వెందుకంటే, క్రియాయోగం పేరుమీద గ్లోబల్ గా జరుగున్న వ్యాపారాన్ని చూచి.

ఎప్పుడో నూరేళ్లక్రితం లాహిరీ మహాశయులు హిమాలయాల్లో బాబాజీ దగ్గర కొన్ని యోగక్రియలు నేర్చుకున్నాడు. దానిని కొంతమందికి నేర్పించాడు. అదే ఆయన చేసిన తప్పు. 

ఇక క్రియాయోగం బిజినెస్ మొదలైంది. ఆ బిజినెస్ ని గ్లోబల్ బిజినెస్ గా మార్చింది యోగానందగారి పుస్తకం.

కరార్ ఆశ్రమం పెట్టిన యుక్తేశ్వర్ గారు- అసలైన క్రియ మాదేనంటారు.

ఆయన మాట వినకుండా అమెరికా వెళ్లి అక్కడ క్రియాయోగాన్ని తెల్లవాళ్ళకు నేర్పిన యోగానంద, 'నాదే అసలైన క్రియ' అంటాడు.

అసలైన క్రియాయోగాన్ని ఆయన చాలా మార్చిపారేశాడని, అమెరికా శిష్యులకోసం దాని రూపురేఖలే మార్చేశాడని లాహిరీగారి శిష్యులంటారు.

యోగానంద గారి శిష్యులలో కూడా చీలికలొచ్చాయి.

స్వామి క్రియానంద అనే అమెరికన్ SRF నుండి విడిపోయి, ఒక వేరు కుంపటి పెట్టి 'నాదే అసలైన క్రియ' అన్నాడు. ఇంకా చాలామంది అన్నారు.

ఇక లాహిరీ గారి శిష్యుల్లో నూరు కుంపట్లున్నాయి.

ఆయన సంతానమైన తింకోరీ, దుకోరీలు, మనవళ్లు మాదే అసలైన క్రియాయోగమంటారు.

పంచానన్ భట్టాచార్య 'నాదే అసలైన క్రియ' అంటాడు.

అశోక్ కుమార్ భట్టాచార్య, 'అసలైన క్రియ నాదగ్గరుంది' అంటాడు.

వీళ్ళందరూ తప్పని, అసలైన క్రియాయోగం నాదగ్గరుందని హరిహరానంద గిరి గారంటారు.

ఈ గోలంతా చూసి విసిగిపోయిన 'ఎన్నియో నిమిస్' అనే యూరోపియన్ వనిత క్రియాయోగ టెక్నీక్స్ అన్నీ ఒక పుస్తకంలో రాసేసి ఫ్రీ బుక్ గా నెట్లో పెట్టేసింది.

శ్రీ M గారు 'నాదే అసలైన క్రియ' అంటారు.

ఈ మధ్యన జగ్గీ కూడా క్రియాయోగా పాట పాడుతున్నాడు. అది లాభసాటిగా ఉన్నట్లుంది. అవున్లే SSY ఎంతసేపని నేర్పిస్తాడు పాపం !

బెంగుళూరు, హైద్రాబాద్ లలో అయితే, ప్రతి ఇంట్లోనూ క్రియాయోగా గురువులున్నారు. వీళ్లంతా ఆన్లైన్ క్లాసులు పెట్టి, నెట్లోనే క్రియాయోగ దీక్షలిచ్చేస్తున్నారు. సంసారాలు చేస్తూ పిల్లాపాపలున్న ఆడాళ్ళు కూడా ఆత్మానంద, బ్రహ్మానంద మొదలైన పేర్లు పెట్టేసుకుని క్రియాయోగ గురువులౌతున్నారు. మొగుళ్ళు ఆఫీసుకెళ్లి వచ్చేలోపు ఒక సైడు బిజినెస్ గా బాగుంటుంది కదా ! ఆన్లైన్ బకరాలకు క్రియాయోగా అంటూ నాలుగు మాయమాటలు చెబితే సరిపోతుంది. డబ్బులు బాగానే వస్తాయి. పేరుకు పేరూ వస్తుంది. బాబాజీని అడ్డుపెట్టుకుని బాగా డబ్బులు దండుకోవచ్చు. ఎలా ఉంది ఐడియా?

ఎంత కామెడీనో?

వీళ్ళందరూ బాబాజీని చూశామంటారు. ఆయనే మాకు ఇలా చెయ్యమని చెప్పాడంటారు. కాపీ రైట్ లేకపోతే చాలు, ఎలా వాడేస్తారో జనం !!

ఇక అమెరికాలో, ముఖ్యంగా కాలిఫోర్నియా వైపు అయితే, ఎన్నున్నాయో క్రియాయోగా సెంటర్లు, స్కూళ్ళు లెక్కే లేదు. ప్రతివాడూ 'నాదే అసలైన క్రియాయోగం' అంటాడు. టెన్ మినిట్స్ క్రితమే బాబాజీ మా ఇంటికొచ్చి వెళ్ళాడంటాడు.

వెరసి కోట్లాది డాలర్ల వ్యాపారం క్రియాయోగా మీద జరుగుతోంది. వీళ్ళలో ఎవరికీ అసలైన క్రియాయోగా తెలీదు.

ఈ గ్లోబల్ ఫ్రాడ్ లో వెర్రివెంగళప్ప అయింది పాపం - బాబాజీనే.

వీళ్ళందర్నీ చూసి, బాబాజీకే పిచ్చెక్కి, హిమాలయాలలో తన గుహని వదిలేసి, ఇంకా లోలోపలి ప్రాంతాలకు పారిపోయాడని నేనంటాను. ఎందుకంటే, తీర్ధయాత్రలకెళ్లినట్టు ఆయన గుహకు కూడా వెళ్లి జనాలు అక్కడంతా పాడుచేస్తున్నారట ఈ మధ్య.

'నీకెలా తెలుసు?' అంటారా?

నాకూ బాబాజీనే చెప్పాడు.

'పొరపాటున లాహిరీకి నేర్పించాను. ఇంతగా భ్రష్టు పట్టిస్తారని నేనూహించలేదు. తప్పుచేశాను. అందరూ నా గుహకు వచ్చేస్తున్నారు. అక్కడ ప్రశాంతత ఎప్పుడో పోయింది. అందుకే హిమాలయాలలో ఇంకా లోపలి ప్రాంతాలకు పారిపోయి దాక్కుంటున్నాను' అని నాతో అన్నాడు.

ఏం? ఇంతమందికి కనిపించినాయన నాకు కనిపించకూడదా? తన బాధను నాతో చెప్పుకోకూడదా? ఉన్న నిజాన్ని చెబితే తప్పేంటి?

'నువ్వు అమెరికాలో ఉన్నావు బాబాజీ హిమాలయాలలో ఉంటాడు. మరి నీకెలా కనిపించాడు?' అనే చచ్చు సందేహం మీకు రాకూడదు.

యోగా ట్రెడిషన్ తో అస్సలంటూ సంబంధమే లేని జీసస్ కే బాబాజీ క్రియాయోగ దీక్షనిచ్చాడని యోగానంద వ్రాస్తే మీరు నమ్మేశారు. నేను నిజాలు చెబుతుంటే మాత్రం నమ్మరు ! భలే ! అలాంటి బాబాజీ అమెరికాకు రాలేడా నాకు కనిపించలేడా? నమ్మలేరా? 

అవున్లే ! అబద్దాలు రుచించినట్లుగా నిజాలు రుచించవు. అంతే కదూ?

'అయితే ఇప్పుడేంటి? అసలైన క్రియాయోగా నా దగ్గరుంది' అంటావు నువ్వు, అంతేకదా?' అంటారు మీరు.

'చ చ నేనలా ఎందుకంటాను? నాకు క్రియాయోగా ఏమీ తెలీదు. నిష్క్రియా యోగా మాత్రమే తెలుసు' అంటాను.

'ఏంటీ దాన్ని నేర్పాలా? ఓరి పిచ్చోళ్లారా ! సరిగ్గా చదవండి. దానిపేరే నిష్క్రియ. దానినెలా నేర్పిస్తారు? అస్సలు కుదరదు, దానితో బిజినెస్ అస్సలు కుదరదు' అనికూడా అంటాను.

అలాంటి కొత్త బిజినెస్ ఛాన్స్ లోకానికి ఎవరైనా ఎందుకిస్తారు? అందుకే బాబాజీ కూడా నిష్క్రియా యోగా ను ఎవరికీ నేర్పలేదు. పైపైన రెండు మూడు టెక్నీక్స్ లాహిరీకి చెప్పి "ఇదే క్రియాయోగా పో" అన్నాడు. దానిని MNC గురువులు వాడుకుంటూ, వాళ్ళ తెలివితేటలతో దానికి అవీఇవీ కలిపి పెంచి పారేశారు. బ్రహ్మాండంగా బిజినెస్ చేసుకుంటున్నారు. అంతే.

కాబట్టి, 'అసలైన క్రియాయోగా ఇదే' అని ఎవరైనా చెబితే నమ్మకండి. అదెవరికీ తెలీదు. కారణమేంటో చెప్పనా?

'అసలైన క్రియాయోగా' అనేది అసలు లేనేలేదు. ఆ మాటొక పెద్ద బూటకం.

ఇది పచ్చినిజం, నమ్మితే మీ అదృష్టం. నమ్మకపోతే మీ ఖర్మ !