రెండవరోజున సాయంత్రం పూట అందరం ధ్యానంలో ఉండగా మిగేల్ అనే ఒకబ్బాయి వచ్చి మమ్మల్ని కలిశాడు.
అతనికి 21 ఏళ్ళు, కాథలిక్ క్రిస్టియన్ కుటుంబం నుండి వచ్చాడు. పేరెంట్స్ మెక్సికో నుండి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఇక్కడే గాంజెస్ లో ఉంటాడు. గ్రాండ్ రాపిడ్స్ కు రోజూ వెళ్లి చదువుకుంటూ ఉంటాడు. జీసస్ అన్నా మేరీ అన్నా భక్తి ఉంది. కానీ కృష్ణుడంటే చాలా భక్తి.
ఇతని తమ్ముడు ముందుగా కృష్ణభక్తుడయ్యాడు. ఇప్పుడితను. అప్పుడప్పుడూ ఇక్కడకు వస్తూ ఉంటానని, ఈరోజు ఎందుకో ఇక్కడకు రావాలని బలంగా అనిపించిందని, వచ్చి చూస్తే మేమందరం ధ్యానంలో ఉండటం చూసి, ఇండియన్స్ అని అర్ధమై, మేము లేచాక మాట్లాడదామని వెయిట్ చేస్తున్నానని అన్నాడు.
ఇస్కాన్ వారి పాంప్లెట్ ఒకటి నాకివ్వబోయాడు.
నవ్వొచ్చింది.
'కృష్ణుడి గురించి నీకేం తెలుసుకోవాలని ఉందో చెప్పు' అన్నాను పాంప్లెట్ తీసుకోకుండా.
అతను ఆశ్చర్యంగా చూశాడు.
'మేమూ కృష్ణభక్తులమే. చిన్నప్పటినుంచీ ఆయన జీవితాన్ని చదువుతూ పెరిగాం.' అన్నాను అతని సందేహాన్ని గమనించి.
'కృష్ణుడిపైన మీ అభిప్రాయం ఏంటి? నాకు ఆయన జీవితం చాలా అద్భుతంగా అనిపించింది. ఎంతో సంభ్రమానికి గురయ్యాను ఆయన గురించి తెలుసుకుని' అన్నాడు.
'కృష్ణుడు సాక్షాత్తు భగవంతుడే. సృష్టి స్థితి లయకారకుడైన భగవంతుడే తన పూర్తి శక్తితో కృష్ణుడుగా భూమికి దిగి వచ్చాడు. హిందూమతంలో 'అవతారం' అనే భావన ఉంది. దేవుడు అవతారం దాల్చి భూమికి వస్తాడని మేం నమ్ముతాం. ఈ భావన మీ మతాలకు తెలియదు. అటువంటి అవతారాలలో కృష్ణావతారం అత్యుత్తమమైనది, పరిపూర్ణమైనది. అటువంటి శక్తి ఇతర ఏ అవతారంలోనూ లేదు. మానవుడు ఊహించగలిగిన అత్యున్నతమైన దైవస్వరూపం కృష్ణుడే' అన్నాను.
అతను బిత్తరపోయాడు.
'ఇందాక నేను వచ్చినపుడు మీరేం చేస్తున్నారు? అడిగాడు.
'మేము ధ్యానంలో ఉన్నాము. ఇది యోగసాధనలో ఒక భాగం' అని చెప్పాను.
'నేను కొంత చదివాను. దీపక్ చోప్రా, ఓషో, జిడ్డు కృష్ణమూర్తి, వీళ్ళ పుస్తకాలు కొన్ని చదివాను. అవి మంచివేనా?' అడిగాడు.
'పరవాలేదు. కానీ అసలైన హిందూమతం వారిలో లేదు. హిందూమతాన్ని గురించి, దాని తత్వశాస్త్రపు లోతుపాతులను గురించి తెలుసుకోవడానికి అవి కొంత ఉపయోగిస్తాయి. కానీ ఆ తరువాత, శ్రీ రామకృష్ణులను, వివేకానందులను, రమణమహర్షిని చదువు. అవి నీకు సరియైన అవగాహనను కలిగిస్తాయి' అన్నాను.
'వైల్డ్ వైల్డ్ కంట్రీ' చూశావా? అడిగాను.
'చూశాను. కానీ ఓషోను వాళ్ళు చాలా చెడుగా చూపించారు. అతనలాంటి వాడు కాదు. అతను చాలా మంచి విషయాలు చెప్పాడు. మంచివాడని నా ఉద్దేశ్యం' అన్నాడు.
'అవును. ఓషో పూర్తిగా చెడ్డవాడు కాదు. అతని చుట్టూ చేరిన తెల్లవాళ్ళవల్ల అతను భ్రష్టు పట్టాడు. చివరకు తనూ మునిగాడు, Krishna the man and his philosophy అని ఓషోది ఒక మంచి పుస్తకం ఉంది చదువు' అన్నాను.
'అందరూ మంచివాళ్ళే అని నా ఉద్దేశం' అన్నాడు మిగేల్
'అవును, అంతిమవిచారణలో చూస్తే, ముంచేవాడూ, మునిగేవాడూ, ఒడ్డునుంచి చూసేవాళ్ళూ, అందరూ మంచివాళ్ళే' అన్నాను నవ్వుతూ.
అప్పుడప్పుడూ తను ఆకాశంలోకి చూస్తూ కూచుంటానని, అప్పుడు ఒక పోర్టల్ లాగా ఆకాశం తెరుచుకుని, జీసస్, మేరీ, ఇంకా ఎవరెవరో మహనీయుల రూపాలు వెలుగులో కనిపిస్తూ ఉంటాయని అతనన్నాడు.
నేను నవ్వి ఊరుకున్నాను.
'ఇండియాలో ఎందరో సెయింట్స్ పుట్టారని వారు కూడా జీసస్ లాంటివారే అని, జీసస్ చేసిన మహిమలలాగే వాళ్ళూ చేశారని విన్నాను, నిజమేనా?' అడిగాడు.
'జీసస్ లాంటి వాళ్ళు, ఆయనను మించిన వాళ్ళు ప్రతితరంలోనూ ఇండియాలో ఉన్నారు. వారు చేసిన మహిమలలో జీసస్ కనీసం ఒక వంతుకూడా చేయలేడు. జీసస్ నేర్చుకున్నదంతా ఇండియాలోనే నేర్చుకున్నాడు. పన్నెండేళ్ల నుంచీ ముప్పై ఏళ్ల వరకూ పద్దెనిమిదేళ్లపాటు ఆయనెక్కడున్నాడో ఎవరికీ తెలీదు. వాటిని మిస్సింగ్ ఇయర్స్ అంటారు. ఆ సమయంలో ఆయన ఇండియాలో, టిబెట్ లో ఉన్నాడు. యోగశాస్త్రం, బౌద్ధం నేర్చుకున్నాడు' అన్నాను నవ్వుతూ.
అతను మళ్ళీ నోరెళ్లబెట్టాడు. 'ఈ సంగతి నాకు తెలీదు' అన్నాడు.
'ఎలా తెలుస్తుంది? మీ పాస్టర్లు ఈ విషయాలు చెప్పరు. ఏదేదో చెత్తను మీకు నూరిపోస్తూ ఉంటారు. రీసెర్చి చెయ్యి. తెలుస్తుంది' అన్నాను.
'భవిష్యత్తులో ఒకసారైనా ఇండియా రావాలనుకుంటున్నాను' అన్నాడు చాలా సీరియస్ గా.
'వెల్కం. వచ్చినపుడు మా ఆశ్రమంలో మా అతిధిగా ఉండు' అని, అతని ఫోన్ నంబర్ తీసుకోమని పంచవటి USA కమిటీ వారికి చెప్పాను.
'మన పుస్తకాలు కొన్ని ఇతనికి ఇద్దామా?' అని మావాళ్లడిగారు.
'వద్దు. మరీ మీద పడిపోయినట్లుగా ఉంటుంది. అతనికి అర్హతుంటే అతనే మన మార్గంలోకి వస్తాడు. వదిలెయ్యండి. మనం ఎవరినీ ఫోర్స్ చెయ్యకూడదు. ఊరకే మన టేస్ట్ చూపించాలి. వాళ్ళ అదృష్టం ఉంటే మన దారిలోకి వస్తారు. లేకపోతే రాలేరు' అని చెప్పాను.
డిన్నర్ టైం అవడంతో మాతోబాటు డిన్నర్ చెయ్యమని అతన్ని ఆహ్వానించాము. డిన్నర్ అయిపోయాక, కొంచం సేపు అవీ ఇవీ మాట్లాడాడు.
'ఇండియన్ కల్చర్ కూ, సౌత్ అమెరికన్ కల్చర్ కూ, చాలా పోలికలున్నాయి. సౌత్ అమెరికా లాటిన్ అమెరికాగా మారక ముందు, హిందూ సంస్కృతి అక్కడ ఉండేది. మీ మయుడు మా పురాణాలలో ఉన్నాడు. మాయన్ కల్చర్, అజ్టెక్ కల్చర్ ఇవన్నీ మా సంస్కృతికి దగ్గరగా ఉంటాయి. ఎందుకంటే, అతి ప్రాచీనకాలంలో సౌత్ అమెరికా, సౌత్ ఆఫ్రికా, శ్రీలంకలు కలిసే ఉండేవి. ఇండియానుండి ఇక్కడకు రాకపోకలుండేవి. మహాభారతంలో అనేక రాజభవనాలకు ప్లాన్ ఇచ్చింది, దగ్గరుండి కట్టించిందీ మీ మయుడే' అని చెప్పాను.
అతను మళ్ళీ నోరెళ్లబెట్టాడు.
'మెడిటేషన్ గురించి మా ఇండియన్ ఫ్రెండ్ ఒకడిని అడిగితే, అదంతా బుల్ షిట్ అని చెప్పాడు. వాడికేమీ తెలియదు. నాకెంతో ఆశ్చర్యమేసింది. ఇండియన్ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకు ఏమీ నేర్పడం లేదని అర్ధమైంది' అన్నాడు.
'యూ ఆర్ రైట్, ముందు వాళ్లకు తెలిస్తే కదా పిల్లలకు నేర్పేది? ప్రస్తుతపు ఇండియన్ పేరెంట్స్ కి తెలిసింది డబ్బు డబ్బు అని కలవరించడం ఒక్కటే. అదే వాళ్ళ పిల్లలకు నూరిపోస్తున్నారు. ఇండియా యొక్క అసలైన సంపద ఏమిటో చాలామంది ఇండియన్స్ కే తెలీదు' అని చెప్పాను.
అతను వెళ్ళిపోయాక, ఆనంద్ ఇలా అన్నాడు, 'గురూజీ, నాకెప్పుడూ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మీ చుట్టుపక్కల ఉండేవాళ్లకు మీగురించి పెద్దగా తెలీదు. కానీ, దూరంగా ఎక్కడో ఉన్నవాళ్లు ఇలా హఠాత్తుగా వచ్చి మిమ్మల్ని కలుస్తూ ఉంటారు. మీతో కనెక్ట్ అయి చాలా క్లోజ్ అవుతూ ఉంటారు. మీరు అమెరికాలో ఉంటున్నా, అమెరికాలో ఉన్న మనవాళ్ళు మిమ్మల్ని కలవలేకపోతున్నారు, ఎవరో క్రొత్తవాళ్ళు మాత్రం వచ్చి కలుస్తున్నారు. ఇది చాలా వింతగా అనిపిస్తుంది' అన్నాడు.
నవ్వాను.
'నిజమే. ఆధ్యాత్మిక లోకపు రహస్యనియమాలు ఇలాగే ఉంటాయి. నిజమైన ఆకలి ఉన్నవాడికి భోజనం దొరుకుతుంది. వాళ్ళైనా వెదుక్కుంటూ వస్తారు. అదైనా వారి దగ్గరకు వెళుతుంది. అదంతే. అంతా ఆకలిని బట్టి ఉంటుంది' అన్నాను.