నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

12, అక్టోబర్ 2022, బుధవారం

మూడవ అమెరికా యాత్ర - 36 (మదర్స్ ట్రస్ట్ సందర్శన)


మదర్స్ ట్రస్ట్ ఆలయంలో



బాబాతో మాట్లాడుతూ



అయిదేళ్లక్రితం ఉపన్యాసం ఇచ్చిన హాల్లో


విండో టేబుల్ దగ్గర కాసేపు


గుడ్ బై మదర్స్ ట్రస్ట్

మర్నాడు యోగాభ్యాసం చేసి, బ్రేక్ ఫాస్ట్ కోసం మెయిన్ బిల్డింగ్ లోని కిచెన్ దగ్గరకు వచ్చాం. అక్కడ టిఫిన్ తయారు చేసుకుని తిని, మదర్స్ ట్రస్ట్ కు వెళ్లి బాబాను పలకరిద్దామని బయలుదేరాము. స్వామి ఆత్మలోకానంద గారిని ఇక్కడందరూ బాబా అని పిలుస్తారు.

మేమున్న కాటేజీల నుంచి మదర్స్ ట్రస్ట్ కు నడిచి వెళ్ళవచ్చు.  అంత దగ్గర. కానీ, బాగా చలిగా ఉండడంతో అందరం కార్లలోనే వెళ్ళాము. యధావిధిగా అక్కడంతా నిర్మానుష్యంగా ఉంది. లోపలికెళ్ళి ఆలయంలోని శ్రీయంత్రానికి, శ్రీరామకృష్ణులవారికి, శారదామాతకు నమస్కారం చేసుకుని కాసేపు ప్రశాంతంగా కూచున్నాము. వారి పాదాల దగ్గర గౌరీవ్రతమా ఫోటో పెట్టి ఉంది. పోయినసారి 2016, 2017 లలో మేమొచ్చినపుడు, అక్కడే గౌరీవ్రతమా తో మాట్లాడాము. ఇప్పుడామె ఫోటోగా మారిపోయింది. 

బాబాకు ఫోన్ చెయ్యమని ఆనంద్ కు చెప్పాను. బాబా ఫోనెత్తి, వస్తున్నానని అన్నారు.

మేమక్కడ కూచుని మౌనంగా వేచి యుండగా, బాబా వచ్చారు. ఇంతకుముందు గౌరీవ్రతమా ఉన్న  ఇంటివైపునుంచి ఆయనొచ్చారు. ఆమె జూన్ లో చనిపోయింది గనుక, అదే ఇంట్లో ఇప్పుడు ఆయనున్నారని అర్ధమైంది. జీన్స్ ప్యాంట్, షర్ట్ లో ఉన్నప్పటికీ, సన్యాసచిహ్నంగా భుజాలపైన ఒక కాషాయ శాలువా కప్పుకుని ఉన్నాడాయన.

మేము మర్యాదపూర్వకంగా లేచి ఆయనకు నమస్కారం చేశాము.

ఆనంద్ తనను, నన్ను పరిచయం చేసుకున్నారు. కానీ బాబా మమ్మల్ని గుర్తుపట్టలేదు. మర్యాదకోసం మేము గుర్తున్నట్లుగా మాట్లాడారు గాని, ఆయనకు మేము గుర్తులేమని అర్ధమైంది. బహుశా కోవిడ్ వల్ల ఆయనకు జ్ఞాపకశక్తి పోయిందని అనుకున్నాము.

'ఎలా ఉన్నారు?' అని ఆయనను అడిగాము.

'బాగానే ఉన్నాము, గౌరీవ్రతమా జూన్లో చనిపోయింది. ఆమె చివరి దశలో నేనే ఆమెకు సేవలు చేశాను.  నాకు ప్రస్తుతం 71 ఏళ్ళు. అదుగో ఆ ప్రక్కనే ఉన్న ఇంట్లో శక్తిమా ఉంటుంది.  ఆమెకు 70 ఏళ్ళు. ప్రస్తుతం మేమిద్దరమే ఇక్కడున్నాం. మాతాజీ కూతురు చికాగోలో  అటార్నీగా ఉంది. మా తరువాత ఆమె ఈ ట్రస్ట్ ని చూసుకోవాలి. రిట్రీట్ హోమ్ ను అమ్మేశాము. ఇంకో ఇంటిని కూడా అమ్మేశాము. అలా నడుస్తోంది' అన్నాడాయన.

ఫండ్స్ లేవని మాకర్థమైంది. అందుకే ఉన్న ఇళ్లను ఒక్కొక్కటిగా అమ్మేస్తున్నారు. ట్రస్టీలలో ఒకరైన  స్వామి తాపసానంద గారు చనిపోయారు. ఇప్పుడు గౌరీవ్రతమా కూడా పోయారు.  బాబా ఒక్కరున్నారు.

'మైకేల్, జూలియా ఎలా ఉన్నారు?' అడిగాము.

'మైకేల్ బాగున్నాడు. ఆ ప్రక్క ఇంట్లోనే ఉంటాడు. అతని సబ్జెక్ట్ పెర్మాకల్చర్. అతనికిక్కడ నూరెకరాల ఫామ్ ఉంది. అది చూసుకుంటూ ఇక్కడే ఉన్నాడు. జూలియా టెక్సాస్ వెళ్ళిపోయి తన కూతురు దగ్గరుంటోంది. వాళ్లిద్దరూ డైవర్స్ తీసుకోలేదు గాని, దూరంగా ఉంటున్నారు' అన్నాడు బాబా.

అయిదేళ్ల క్రితం ఇక్కడకొచ్చినపుడు మైకేల్, జూలియాలకు నేను దీక్షనిచ్చాను. వాళ్లిద్దరూ నా శిష్యులే. కనుక వాళ్ళ గురించి కనుక్కోవలసిన బాధ్యత నాపైన ఉంది.

'మనం ఉండేది ఈ లోకంలో కొన్నాళ్లే. మన తర్వాత ఇంకెవరో వస్తారు. చూసుకుంటారు. ఈ లోకంలో మనం చెయ్యగలిగింది మనం చేశాము. అంతే. ఉంటా మరి' అంటూ ఆయన నమస్కారం పెట్టి ఇంట్లోకి వెళ్లిపోయారు.

చాలా నిరాశగా, చివరి ప్రయాణానికి సిద్ధమౌతున్నట్లుగా ఆయన కనిపించారు. భారమైన గుండెలతో మేమూ వెనక్కు  బయలుదేరాము.

బయటకొచ్చి చూస్తే, ఆరేళ్లక్రితం 2016 లో మేమొచ్చినపుడు ఉన్న రిట్రీట్ హోమ్ కనిపించింది. ప్రస్తుతం దానిలో ఎవరో ఫేమిలీ ఉంటున్నారు. వాళ్ళ కార్లు, ఒక బోటు అక్కడ కనిపించాయి. దగ్గర్లోనే లేక్ ఉంది కాబట్టి, అందులో బోటింగ్ కి వెళుతూ ఉంటారు ఇక్కడివాళ్ళు. ఎవరి పడవ వారికి ఉంటుంది.

మౌనంగా కార్లెక్కి మా కాటేజీకి బయలుదేరాము.

ఏ సంస్థ అయినా ఇంతే. కలకాలం నడవాలంటే రెండు ఉండాలి. ఒకటి డబ్బు, రెండు, నడిపించే మనుషులు.  లాభాలొచ్చే కంపెనీలైతే అవి రెండూ ఉంటాయి. ఇలాంటి ధార్మికసంస్థలతో ఇదే చిక్కు. ఇవి కొన్నాళ్లు వెలుగుతాయి. తరువాత అక్కడ ఎవరూ ఉండరు. పుట్టపర్తి ఎలా ఉంది ఇప్పుడు? జిల్లెళ్ళమూడి ఎలా ఉంది? అంతే. ఫండ్స్ చూసుకోవాలి, రెండవ తరాన్ని తయారు చెయ్యాలి.  అప్పుడే ఏ ధార్మికసంస్థ అయినా కొన్నాళ్ళు బ్రతుకుతుంది. ఒక్క మనిషిమీద ఆధారపడితే ఆ తరువాత ఆ సంస్థ కుప్పకూలుతుంది.

కార్లో వెనక్కు వస్తుంటే ఆనంద్ ఇలా ప్రశ్నించాడు.

'క్రైస్తవం రెండువేల ఏళ్ల నుంచీ, ఇస్లాం 1300 ఏళ్ల నుంచీ ఎలా కంటిన్యూ అవుతున్నాయి మరి?'

ఇలా చెప్పాను.

'అవి ధార్మికసంస్థలు కావు. మతాలు. క్రైస్తవమేమో మనుషుల మధ్యన విభేదాలు సృష్టించి, కాకమ్మకథలు చెప్పి, లంచాలు ఎరజూపి నెట్టుకొస్తోంది. ఇస్లామేమో మెడమీద కత్తిపెట్టి, దౌర్జన్యంతో, విధ్వంసంతో, భయోత్పాతాన్ని సృష్టిస్తూ పబ్బం గడుపుకుంటోంది. ఆ విధంగా అవి కొనసాగుతున్నాయి. ధర్మంగా బ్రతకాలంటే అది కుదరదు. అసలైన ధర్మం ఎవరికి కావాలి?

మదర్స్ ట్రస్ట్ విషయం వేరు. చికాగో వేదాంతసొసైటీ పైన తిరుగుబాటు చేసి వీళ్ళు బయటకొచ్చారు.  దాని వెనుక వీళ్ళ స్వార్ధప్రయోజనాలు వీళ్లకున్నాయి. అది తప్పు, పైగా, వీళ్ళకొక  యాక్టివ్ అజెండా లేదు, పవర్ ఫుల్ స్పీకర్స్ లేరు. పిచ్చి జనానికి కూడా ఎప్పటికప్పుడు మహిమలు, మాయలతో కూడిన సెన్సేషనల్ క్రొత్తదనం కావాలి. వీళ్ళేమో అలాంటివి చెయ్యరు. పైగా వీళ్ళు రెండవతరాన్ని తయారు చెయ్యలేదు. కనుక వీళ్లకు టేకర్స్ లేరు. ఇంకేమౌతుంది? ఈసారి మనం వచ్చేసరికి ఇదీ ఉండదు. ఎవరో దీనిని కొనేస్తారు. ఒక హోటలో ఇంకేదోనో పెడతారు. అంతే.

ఈ పనిని మనం చెయ్యకూడదు. మొయ్యలేని బరువును మనం నెత్తికెత్తుకోకూడదు. పెద్ద బిల్డింగ్స్ కట్టేసి హడావుడి చెయ్యకూడదు. మన ఆశ్రమానికి ఇవన్నీ గుణపాఠాలు. మనం ప్రాక్టికల్ గా ఉండాలి. సింపుల్ గా ఉండటం, ఎక్కువమంది మనుషులని చేర్చుకోకుండా ఉండటం, మౌలికమైన సాధనాసిద్ధాంతాలకు కట్టుబడి ఉండటం, పూజలకు, గుళ్ళకు, సోషల్ సర్వీస్ కి దూరంగా ఉండటం, మనం చెయ్యాలి. మనది అసలైన ఆధ్యాత్మికమార్గం. కానీ ప్రపంచాన్ని మారుద్దామని మనం ఎప్పుడూ ప్రయత్నించకూడదు. ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదు. అప్పుడు, ఎవరొచ్చినా, ఎవరు రాకపోయినా  ఎవరున్నా, ఎవరు పోయినా మనమేమీ చలించం.

2017 లో రెండవసారి మనం వచ్చినపుడే వీళ్ళ ప్రవర్తనలో తేడా ఉంది. అప్పుడే నేననుకున్నా వీళ్ళు ఎక్కువకాలం నిలబడలేరని. అదే జరుగుతున్నది. మనం బాధపడకూడదు. ఎవరి ఖర్మను బట్టి వారికి జరుగుతుంది. అన్నింటినీ భగవంతుడే చూసుకుంటాడు. Don't worry. They deserve this' అన్నాను.

మౌనంగా తల పంకించాడు ఆనంద్.

మాటల్లోనే మేముండే కాటేజ్ వచ్చేసింది.