Pages - Menu

Pages

22, అక్టోబర్ 2022, శనివారం

మూడవ అమెరికా యాత్ర - 43 (హరిదాసు కధ)

హరిదాసు కధను మధ్యలోనే వదిలేశాను కదా. దానిని పూర్తిగా చెప్పుకోకపోతే గాంజెస్ యాత్రకు సమగ్రత ఉండదు.

హరిదాసు తాతగారు కూడా అందరిలాగే యూరోప్ నుండి ఇక్కడకు వచ్చి సెటిలైనవాడే. మొదటి తరం సెటిలర్స్ చాలా కష్టపడి డబ్బు సంపాదించుకుని, ఇక్కడ స్థిరపడ్డారు. తాతగారికి అంతర్జాతీయ వ్యాపారం ఏదో ఉండేది. బాగా సంపన్నులు. హరిదాసు నాన్న కూడా అదే బిజినెస్ ను కొనసాగించాడు. కానీ, హరిదాసు తీరు వేరు. మొదటినుంచీ బాగా డబ్బులో పెరగడం వల్లనెమో అతనికి ఆ జీవితం అంతగా రుచించేది కాదు. భాష్యానందగారితో పరిచయం కావడం, వివేకానందస్వామి బోధనలు చదవడం జరిగాక, వేదాంతం వైపు ఆకర్షితుడైనాడు. మొదట్లో ఆయన దగ్గరకు వస్తూ పోతూ ఉండేవాడు. కొన్నేళ్ళకు అలా జరిగాక, ఇక్కడే స్థిరపడిపోయాడు. పెళ్లి చేసుకోలేదు. ఒక్కడే ఉంటూ రిట్రీట్ సెంటర్ చూసుకుంటూ ఉంటాడు.

'మీరు సన్యాసం ఎందుకు తీసుకోలేదు?' అనడిగాను.

'నాకెందుకు? సన్యాసం తీసుకుని, కాషాయవస్త్రాలు వేసుకుంటే నా స్వతంత్రం పోతుంది. అప్పుడు నా ఇష్టం వచ్చినట్లు నేనుండలేను. అప్పుడు సంస్థ చెప్పినట్లు చెయ్యాలి. ఉపన్యాసాలివ్వాలి. మతప్రచారం చేయవలసి వస్తుంది. రకరకాల చోట్లకు పోవలసి వస్తుంది. నాకది ఇష్టం లేదు. ఒంటరిగా ఉండటమే నాకిష్టం. సన్యాసం తీసుకోకపోతే ఏమైంది? నేను ప్రస్తుతం అలాగే జీవిస్తున్నాను కదా. డ్రస్సులో ఏముంది?' అన్నాడు హరిదాస్.

ఆ మాటలకు సంతోషం కలిగింది.

'మరి ఈ అడవిలో ఒక్కడివే ఉంటావు కదా? రోజంతా నీకెలా తోస్తుంది?' అడిగాను.

'నేను పెయింటింగ్స్ వేస్తాను. అది నా హాబీ. భారతీయ పురాణాలలో ఎన్నో అద్భుతమైన పాత్రలున్నాయి. ఎన్నో అద్భుతమైన ఘట్టాలున్నాయి. అవన్నీ పెయింటింగ్స్ వేసుకుంటూ ఉంటాను. అదే నా ధ్యానం. ఇదుగో చూడండి. ఇవన్నీ నేను వేసిన పెయింటింగ్ లే' అంటూ కొన్ని చూపించాడతను.

ఆంజనేయస్వామి, వినాయకుడు, అమ్మవారు మొదలైన పెయింటింగులున్నాయి.

'అందరిలోకీ నేను ఆంజనేయస్వామిని, వినాయకుడిని ఇష్టపడతాను. అందుకే వాళ్ళ పెయింటింగ్స్ ఎక్కువగా వేస్తూ ఉంటాను' అన్నాడు ఆ అమెరికన్.

ఇండియాలో,  క్రైస్తవులుగా మారిన హిందువులు, హిందూ దేవతలను ఏ విధంగా హేళనగా మాట్లాడుతుంటారో గుర్తొచ్చింది. తరతరాలుగా క్రైస్తవులైన కుటుంబంలో పుట్టిన ఈ అమెరికన్ ఏమో ఇలా మన దేవతలను ఆరాధిస్తున్నాడు. ఎంత ఆశ్చర్యం?

హరిదాస్ ఇంకా ఇలా అన్నాడు.

'నాకు జనంతో కలవడం అంటే ఇష్టం ఉండదు. నాలోకంలో ఒక్కడినే ఉండటమే నాకిష్టం. నేను చాలా భోగభాగ్యాలతో పెరిగాను. కానీ ఏదో వెలితి ఉండేది. అందుకే ఇంట్లోనుంచి వెళ్ళిపోయి ఒక్కడినే కొన్నినెలల పాటు అడవులలో ఉంటూ ఉండేవాడిని. అలాంటి జీవితమే నాకు నచ్చుతుంది. ఇక్కడ రిట్రీట్స్ ఉన్నపుడు జనం చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినా నేను ఎవరితోనూ కలవను. నేనున్నట్లు కూడా ఎవరికీ తెలియకుండా  ఉంటాను. నన్నెవరైనా డిస్టర్బ్ చేయడం కూడా నాకిష్టం ఉండదు. కానీ మీ గ్రూపు చాలా విభిన్నంగా ఉంది. మీకేం కావలసి వచ్చినా నాకు ఫోన్ చెయ్యండి. ఈ అడవిలో నేనెక్కడున్నా వచ్చి మీకు కావలసినవి చేస్తాను'

నేనతనితో ఇలా అన్నాను.

'మేము కూడా మినిమమ్ సౌకర్యాలతో ఉండటానికే ఇష్టపడతాము. మాకేమీ పెద్ద అవసరాలు లేవు.  మేము నిన్ను డిస్టర్బ్ చెయ్యము. ఇక్కడంతా బాగానే ఉంది. మూడు రోజులు ఇక్కడుంటాము. తర్వాత డెట్రాయిట్ కు వెళ్ళిపోతాము. కాకపోతే ఒకటి. ఈ మూడు రోజులూ మాతోబాటు భోజనం చెయ్యండి.  ఎలాగు మా కందరికీ వంట చేసుకుంటున్నాం. మీరు కూడా మాతోబాటు తినండి.'

హరిదాసు ఇలా అన్నాడు.

'సారీ. నేనా పని చెయ్యలేను. ఏమంటే, నేను రోజుకొక్కసారి, అదికూడా రాత్రిపూట మాత్రమే భోజనం చేస్తాను.  ఉదయం ఒక కాఫీ తాగుతాను. మళ్ళీ రాత్రికే భోజనం. అదికూడా కొద్దిగా తింటాను. ఇంతే నా ఆహారం. పైగా, నాకు ఏ తిండి పడితే ఆ తిండి సహించదు. అందుకని నా వంట నేనే చేసుకుంటాను.  అందుకని మీ మాటను మన్నించలేను. ఏమీ అనుకోకండి' అన్నాడు. 

ఆశ్చర్యం వేసింది. ఒక అమెరికన్ అయ్యుండి, అందులోనూ బాగా సంపన్న కుటుంబంలో పుట్టి, దేనికీ లోటు లేని జీవితం గడుపుతూ కూడా, విలాసజీవితం అంటే విముఖతతో, అలాంటి అడవిలో ఉంటూ, ఒక్కపూట తింటూ, ధ్యానం చేసుకుంటూ, ఒక సన్యాసిలాగా జీవితం గడుపుతున్న హరిదాసు అంటే చాలా గౌరవం కలిగింది. అమెరికా అంటే సినిమాలలో చూసే అమెరికా కాదు. ఇలాంటి అమెరికన్స్ కూడా ఇక్కడున్నారు. మన హిమాలయాలలో ఉన్న యోగులకూ వీళ్లకూ ఏమీ భేదం లేదు. వాళ్ళు ఇండియాలో ఉన్నారు. వీళ్ళు ఇక్కడున్నారు. అంతే. కానీ, జీవనవిధానంలో ఇద్దరూ ఒక్కలాగే ఉన్నారు.

ఈ విషయం చెప్పడానికే ఈ పోస్ట్ వ్రాస్తున్నాను.

హిందూమతంలో పుట్టి, డబ్బుకు ఆశపడి,  మతప్రచారాలకు రెచ్చగొట్టబడి, క్రైస్తవంలోకి మారుతున్న హిందూ సోదరుల దురవస్థకు చాలా జాలి కలిగింది. ఎంతటి ప్రాచీన సంపదను వాళ్ళు కోల్పోతున్నారా  అని బాధ కలిగింది. అదే సమయంలో, కొంతమంది విదేశీయలు దానిని ఎలా అందుకుంటున్నారో చూచి ఆశ్చర్యమూ కలిగింది.

జగన్మాత లీల అద్భుతం కదూ ! ఎవరికేది అందాలో వారికది అందుతుంది. ఎవరి అర్హతను బట్టి వారికి జరుగుతుంది, వారు భూగోళంలో ఎక్కడున్నా, ఏ మూలనున్నా సరే !