ఈరోజున దీపావళి అమావాస్య సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణం అమెరికాలో లేదుగాని, యూరప్, ఇండియాలలో పూర్తిగా ఉంది. గ్రహణం గురించి, దాని ప్రభావాల గురించి నేనేమీ వ్రాయబోవడం లేదు. ఏమంటే, అదంతా వ్రాసే చిల్లర జ్యోతిష్కులు చాలామంది లోకంలో సందుసందుకీ ఉన్నారు. 'ఈ రాశివారికి బాగాలేదు, ఆ రాశివారికి బాగాలేదు. మా దగ్గర పూజలు చెయ్యండి, డబ్బులు కట్టండి, హోమం చేసి బూడిద పంపిస్తాం, ముఖానికి పూసుకోండి' ఇదే కదా వాళ్ళ గోల. ఇంతకంటే ఇంకేముంది?
సామాన్యంగా అమావాస్య మంచిది కాదంటారు, గ్రహణం మంచిది కాదంటారు. మరైతే, రిషి సునక్ ఇదే రోజున బ్రిటిష్ PM అయ్యాడు. ఇవి రెండూ ఇతనికి ఎంతో మంచిని చేశాయి. దీని గురించి చిల్లర జ్యోతిష్కులు ఏమంటారో చూడాలి.
బ్రిటిష్ సామ్రాజ్యపు కబంధ హస్తాలనుంచి భారతదేశం విముక్తి చెంది 75 సంవత్సరాలైంది. నేడు, ఒక ఇండియన్, బ్రిటిష్ PM అయ్యాడు. ఇదెంతో గర్వకారణం. పైగా నేడు UK చాలా గంగరగోళ పరిస్థితిలో ఉంది. దాని ఆర్ధికవ్యవస్థ కుప్పకూలడానికి సిద్ధంగా ఉంది. లక్షలాది బ్రిటిష్ వాళ్లకు తిండి దొరకని సమస్య, ఎనర్జీ బిల్లులు కట్టలేని సమస్య ఉన్నాయి. వేలాది కంపెనీలు దివాళా తీసే పరిస్థితిలో ఉన్నాయి. ప్రపంచంలోని ప్రతిదేశాన్నీ కొల్లగొట్టి దాచుకున్న దొంగసొమ్మంతా నేడు ఎందుకూ పనికిరాకుండా ఉంది. అలాంటి పరిస్థితిలో ఉన్న UK ని రక్షించడానికి నేడు ఒక ఇండియన్ దిక్కయ్యాడు. 140 మంది MP లు సునక్ కి మద్దతిచ్చారు. ఇది మామూలు విషయం కాదు.
సునక్ బాగా చదువుకున్నవాడు. ఎకనామిక్స్ పట్టభద్రుడు. ఆక్స్ ఫర్డ్, స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలలో స్కాలర్ షిప్ తో చదువుకున్నాడు. ఇది మామూలు విషయం కాదు. అన్నివిధాలుగా ఇతనికంటే ఉత్తమ రాజకీయనాయకుడు ప్రస్తుతం బ్రిటన్ లో లేడు. కాకపోతే ఒక్కటే అడ్డంకి, ఇతను తెల్లవాడు కాదు. పైగా ఇండియన్ సంతతివాడు. అయినా సరే, ఇవి అడ్డు రాలేదు. టాలెంట్ కి అగ్రస్థానం దక్కింది. నేడు బ్రిటిష్ PM అయ్యాడు.
టాలెంట్ ముందు రేసిజం పనిచేయదని రిషి నిరూపించాడు.
బ్రిటిష్ వాళ్ళు 200 ఏళ్లపాటు మనల్ని పాలించారు. విచ్చలవిడిగా దోచుకున్నారు. కానీ కేవలం 75 ఏళ్లలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మనం పరిపాలించే పరిస్థితి వచ్చింది. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలంటే ఇదే మరి !
అయితే, బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి చేసిన మంచి ఎంతో ఉంది. 800 ఏళ్ల నుంచీ మనల్ని ఆక్రమించి, నానారకాల హింసలకు గురిచేస్తూ, రాక్షసపాలన సాగిస్తున్న ఇస్లామిక్ దోపిడీదొంగల పాలన నుండి మనల్ని కాపాడింది బ్రిటిష్ వాళ్లే. వాళ్ళు రాకపోయి ఉంటే, మనంతట మనం ఇస్లామిక్ దురాక్రమణను ఎన్నటికీ తొలగించుకోగలిగేవాళ్ళం కాదు. బ్రిటిష్ వాళ్ళు మనకు చేసిన అతిపెద్ద మేళ్లలో ఇది చాలా ముఖ్యమైనదని నా అభిప్రాయం. అప్పట్లో రాజా రామ్మోహన్ రాయ్ కూడా ఇదే అనేవాడు. అది వేరే సబ్జెక్ట్ గనుక ప్రస్తుతానికి ప్రక్కన ఉంచుదాం.
అయితే, ఈ గ్రహణ సమయంలో అధికారపగ్గాలు చేపడుతున్న సునక్ ముందు చాలా సవాళ్లున్నాయి. అవి మామూలువి కావు. అందులో ముఖ్యమైంది, దారితప్పి, కుప్పకూలే దిశగా దూసుకుపోతున్న ఎకానమీని చక్కదిద్దడం. రెండు, లుకలుకలతో కునారిల్లుతున్న పార్టీని బలోపేతం చెయ్యడం. ఇవి మామూలు విషయాలు కావు. వీటిని ఎలా చేస్తాడో అని లోకం అంతా నేడు సునక్ వైపు చూస్తోంది.
ప్రపంచంలోని మేజర్ సంస్థలు ఇప్పుడు ఇండియన్స్ చేతులలో ఉన్నాయి. మనవాళ్లకు కష్టపడే తత్త్వం ఎక్కువ. బాగా చదువుకుంటారు. కనుక రాణిస్తున్నారు. అయితే, ఇండియాలో ఈ అవకాశాలు లేవు. అందుకే విదేశాలలో రాణిస్తున్నారు. ఇండియాలోని అస్తవ్యస్త రాజకీయ వ్యవస్థ, అసంబద్ధ రాజ్యాంగం, రిజర్వేషన్ వ్యవస్థ, అవినీతి, విలువలు లేని పార్టీలు, కులం, మతం, ప్రాంతీయ అభిమానాలు, జ్ఞానం లేని ఓటర్లు, ఇవన్నీ ఇండియాకు శాపాలు. ఈ శాపాల మధ్యన స్వచ్ఛమైన తెలివి, నిజాయితి, కష్టపడే తత్త్వాలు బ్రతకలేవు. అందుకే ఇవన్నీ ఉన్నవాళ్లు విదేశాలకు వెళ్లిపోతున్నారు. అక్కడ రాణిస్తున్నారు.
నేను 40 ఏళ్లపాటు భారతీయరైల్వేలో రకరకాల స్థాయిలలో పనిచేశాను. ఆ అనుభవంతో చెప్పగలను. ఇండియా ప్రభుత్వంలో అవినీతి లేని ఏరియా అంటూ ఎక్కడా లేదు. ప్రతిచోటా, కులం, మతం, మనవాడు అన్న ఫీలింగ్, అధికార దుర్వినియోగం, దురహంకారం, అసమర్ధతను రిజర్వేషన్ చాటున కప్పిపుచ్చుకోవడం, నాసిరకం డెసిషన్ మేకింగ్, ఒకడు పనిచేస్తుంటే పదిమంది కూచొని సరదాగా కాలక్షేపం చెయ్యడం, లంచాలు, అవినీతిడబ్బు సంపాదించడం - ఇవన్నీ ఉన్నాయి. నేనే ప్రత్యక్షసాక్షిని, బాధితుడిని కూడా. నా సర్వీసు మొత్తం మీద నేను చూచిన, కలసి పనిచేసిన వందలాది అధికారులలో, అవినీతి చేయనివారు ఒకరో, ఇద్దరో ఉన్నారంతే. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పరిస్థితి. ఇక స్టేట్ గవర్నమెంట్ గురించి చెప్పనే అక్కర్లేదు. అవినీతి లేని ఏరియా అంటూ దానిలో ఎక్కడా ఉండదు. అడుగడుగునా లంచాలు, రికమెండేషన్లు, పైరవీలు దాంట్లో రాజ్యాలు ఏలుతూ ఉంటాయి. రాజకీయజోక్యం అడుగడుగునా ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ లో రాజకీయజోక్యం అంతగా ఉండదు. కానీ స్టేట్ లో ప్రతిచోటా ఉంటుంది. 'ఈ ఐదేళ్లలో దోచుకున్నంత దోచుకోవాలి. తరువాత ఈ ఛాన్స్ ఉండదు/ అనేదే వారి పాలసీగా ఉంటుంది. ఈ సంగతి అందరికీ తెలుసు.
ఇటువంటి వ్యవస్థను చక్కదిద్దటమంటే మాటలు కాదు. అదికూడా అస్తవ్యస్త రాజ్యాంగవ్యవస్థలో, విలువలు లేని ప్రజావాతావరణంలో ఈ పనిని చెయ్యడమంటే మాటలు కాదు. ఉన్నంతలో అత్యంత గొప్పగా మోడీగారు పరిపాలిస్తున్నారు. కానీ, నేటి యువతకు, ఇతర దేశాలలో పోలిస్తే, ఇండియాలో ఎదిగే అవకాశాలు లేవు. అందుకే బ్రెయిన్ డ్రెయిన్ అవుతోంది. మన టాలెంట్ విదేశాలకు తరలిపోతోంది. వారికి ఉపయోగపడుతోంది. మనకేమో పిప్పి మిగులుతోంది. ఎక్స్ పోర్ట్ లో అంతేగా, ఫస్ట్ క్వాలిటీ ప్రాడక్ట్ అంతా విదేశాలకు ఎగుమతి అవుతుంది, నాసిరకం సరుకు ఇండియాలో చెలామణీ అవుతుంది. టాలెంట్ లో కూడా అంతే. విదేశాలకు తరలిపోతున్న యువతను తప్పుపట్టలేం. కుళ్ళు వ్యవస్థలో ఎవరు మాత్రం ఎంతకాలం ఉండగలరు? లోకుల కోసం జీవితాలు త్యాగం చేయడానికి యువకులందరూ వివేకానందులు కారు కదా !
కులపైరవీలు చేసుకునేవాడు, తిని తినిపించేవాడు వ్యాపారంలో రాణిస్తున్నాడు. రిజర్వేషన్ ఉన్నవాడు ప్రభుత్వ ఉద్యోగాలలో రాణిస్తున్నాడు. ఇవి రెండూ చెయ్యలేని తెలివున్న నిజాయితీపరుడు దేశాన్ని వదిలిపోతున్నాడు. ఇదీ నేటి ఇండియా పరిస్థితి. ఇది ఎవ్వరూ కాదనలేని సత్యం.
వివేకానందస్వామిని అమెరికా నెత్తిన పెట్టుకున్నాక మాత్రమే, ఇండియాలో ఆయనకు గౌరవం దక్కింది. అంతకుముందు పదేళ్ళపాటు ఒక భిక్షుకునిగా ఇండియా అంతా ఆయన తిరిగినా ఎవడూ పట్టించుకోలేదు. విదేశాలలో రాణిస్తేనే మాతృదేశంలో గౌరవం లభిస్తుందనే సూత్రం ఆయనతోనే మొదలైంది. నేటికీ అదే బాణీ సాగుతోంది. పీవీ నరసింహారావుగారి పుణ్యమా అని నేడు లక్షలాది మంది ఇండియన్స్ అమెరికాలో, యూరప్ లో, ఇతర దేశాలలో నిలబడి, విజయాలను సాధిస్తున్నారు. ఇండియన్ ఎకానమీకి కూడా బాసటగా నిలుస్తున్నారు. దీనిని కూడా ఎవ్వరూ కాదనలేరు.
ఇండియా రాజకీయ రంగం మాత్రం దీనికి విరుద్ధంగా ఘోరంగా ఉంది. కారణాలను గమనిద్దాం.
1. బాగా చదువుకున్న యువకులు రాజకీయాలలోకి రావడం లేదు. అది రొచ్చుగుంట అనే అభిప్రాయం వారిలో బలంగా ఉండటమే దీనికి కారణం.
2. తాతలో, తండ్రులో సపోర్ట్ చేయనిదే రాజకీయాలలో రాణించడం ఇండియాలో సాధ్యం కాదు.
3. నీతిమంతులకు రాజకీయ రంగం అస్సలు పనికి రాదు. అడుగడుగునా అక్కడ అవినీతి తాండవిస్తూ ఉండటమే దీనికి ప్రధాన కారణం.
4. రాజకీయాలకు చదువుతో పనిలేదు. అక్కడ కావలసిన క్వాలిఫికేషన్సల్లా, తిను తినిపించు, కుల రాజకీయాలు, గ్రూపు రాజకీయాలు చెయ్యి. అంతే. దీనికి చదువెందుకు? 'మనం చెప్పినది చెప్పినట్లు చెయ్యడానికి బ్యూరోక్రాట్లున్నారు. వాళ్ళూ చదువుకుని, మనమూ చదువుకుని, ఏంటయ్యా ఇదంతా?, మనకెందుకు చదువు? IAS, IPS చదువుకున్నోళ్ళు మనదగ్గర పనిచేస్తారు అంతే' అనిన రాజకీయనాయకుడొకరు నాకు తెలుసు. వాళ్ళ అవినీతిని అమలు చెయ్యడానికే బ్యూరోక్రాట్లున్నారని చాలామంది రాజకీయనాయకుల ప్రగాఢ విశ్వాసం.
పై కారణాలవల్ల, భారతరాజకీయరంగంలో క్వాలిటీ ఘోరంగా లోపిస్తోంది. ప్రస్తుత రాజ్యాంగ పరిధులలో, వ్యవస్థా పరిధులలో, అదెప్పుడు బాగుపడుతుందో దేవుడికే ఎరుక ! మంచివాళ్ళు, ఆదర్శవంతులు, చదువుకున్నవాళ్ళు, టాలెంట్ ఉన్నవాళ్లు రాజకీయాలలోకి వచ్చినపుడు అది బాగుపడుతుంది. ఇదసలు జరిగే పనేనా ఇండియాలో?
రిషి సునక్ చదువుకున్న స్టాన్ ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ప్రొఫెసరైన జెఫ్రీ ఫిఫర్ ఇలా అంటాడు, 'రాజకీయాలతో దేశానికి మంచి చేయాలంటే, మంచివాళ్ళు రాజకీయాలలోకి రావాలి. మంచివాళ్ళు అధికార సూత్రాలను నేర్చుకోవాలి. బిజినెస్, ఎకనామిక్స్, అధికార నాయకత్వ సూత్రాలను వారు నేర్చుకోవాలి'.
ఆయన మాటలలో చెప్పాలంటే,
As I write in 7 Rules of Power, if power is to be used for good, good people need to master power skills and knowledge.
నిజమే. దానికి వ్యవస్థ సహకరించాలి కదా ! ఆదర్శాలు బాగానే ఉంటాయి. ఆచరణకు, వ్యవస్థే అడ్డుగా ఉంటే, మంచివాళ్ళేం చేయాలి? ఉత్తతెలివి, మంచితనాలు, రాక్షసుల మధ్యన బ్రతికేదేలా? దీనికి సమాధానం లేదు. ఇది మన ఇండియా పరిస్థితి.
ఇటువంటి చెత్త వ్యవస్థలో నుంచి ఎదిగి, బయటపడి, విదేశాలలో విజయాలను సాధిస్తున్న వారికి ఆదర్శం రిషి సునక్. నేడు ఈయన, ఈయన భార్య కలసి, కింగ్ చార్లెస్ కంటే ధనవంతులని అంటున్నారు. కింగ్ చార్లెస్ దంతా దోచుకున్న సొమ్మేకదా ! బ్రిటిష్ రాజకుటుంబం కష్టపడిందేముంది? నీతిగా సంపాదించినదేముంది? రకరకాల దేశాలలో కొల్లగోట్టిన సొమ్మేకదా వాళ్ళది? రిషి సునక్ కుటుంబానికి, వారికి పోలికేముంది అసలు?
ఏదేమైనప్పటికీ, రిషి సునక్ తన ప్రయాణంలో అనేక మైలురాళ్లను అధిగమించాలని, విజయాలను సాధించాలని, భారతీయుల గౌరవాన్ని ఇతర దేశాల దృష్టిలో ఎంతో పెంచాలని, ఇండియా మళ్ళీ వరల్డ్ లీడర్ కావాలని ఆశిస్తూ, అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.