Pages - Menu

Pages

25, అక్టోబర్ 2022, మంగళవారం

మూడవ అమెరికా యాత్ర - 45 ( కొంచెం ఎదగండిరా బాబు )

నిన్న రాత్రి ఇక్కడ దీపావళి. పండగ కదా అని, మావాడు ఉంటున్న అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ కు వెళ్ళాను. చీకటిపడే వరకూ కూర్చుని మాట్లాడిన తర్వాత, కాసేపు బయట తిరిగి చూద్దామని, కాలనీలో కాసేపు వాకింగ్ చేశాను.

ఆ అపార్ట్ మెంట్ కాలనీలో ఎక్కువశాతం మన ఇండియన్సే ఉంటారు. తెలుగువాళ్లే కాకుండా, ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన ఇండియన్స్ కూడా చాలామంది ఉంటారు. నిదానంగా మెయిన్ రోడ్డు వరకూ నడుస్తూ అంతా గమనించాను. ప్రతిచోటా, మనవాళ్ళు కుటుంబాలతో సహా చేరి ఆరుబయట లాన్స్ లో టపాకాయలు కాలుస్తూ కనిపించారు. ఒకచోటయితే, పొగ చాలా ఎక్కువగా వస్తూ, దూరానికి ఏదో తగలబడుతోందా అన్నంతగా ఉంది. అలా కాలుస్తున్న ఇండియన్స్ లో మిగతా రాష్ట్రాలవాళ్ళ కంటే, తెలుగువాళ్లే ఎక్కువగా ఉన్నారు. వాళ్ళమీద చాలా జాలేసింది.

ఎంత అమెరికా వచ్చినా, నాలుగు డబ్బులు సంపాదించినా, అజ్ఞానం ఎలా పోతుంది? నేలబారు చవకమనస్తత్వాలు ఎలా పోతాయి? పోవు. అందుకే అమెరికాలో కూడా టపాకాయలు కాలుస్తూ గోల చేస్తున్నారు. అదేమంటే 'ఇండియన్ కల్చర్' అంటారు.

గతంలో ఇదేవిధంగా ఇండియన్ కల్చర్ గురించి ఒకబ్బాయి చాలాసేపు నాతో మాట్లాడాడు.  అతని దృష్టిలో ఇండియన్ కల్చర్ అంటే, పాపులర్ పండగలు చేసుకోవడం, వాటిల్లో కొత్త డ్రస్సులు వేసుకుని, రకరకాల తిండ్లు వండుకొనో, బయటనించి ఆర్డర్ చేసుకోనో తిని, సినిమాలు చూసి, గోల చెయ్యడం అంతే. అతని దృష్టిలో అదే ఇండియన్ కల్చర్.

వినీ వినీ, అతన్ని ఇలా అడిగాను.

'చూడమ్మా. ఇదే పనులు ప్రపంచంలో అన్ని దేశాల ప్రజలూ చేస్తారు. వాళ్ళకీ పండగలుంటాయి.  ఆ పండుగలలో వాళ్ళు కూడా ఇవే పనులు చేస్తారు. తిండి, గోల, ఎగురుడు, పోసుకోలు మాటలు, ఒకళ్ళ ఇంటికి మరొకళ్ళు రాకపోకలు. సరదాలు. అని దేశాలలో, అన్ని జాతుల్లో కొద్దో గొప్పో  తేడాలతో ఇవే పనులు జరుగుతాయి. మరి అందరి కల్చరూ ఒకటేగా అప్పుడు? 'తినుము, త్రాగుము, సుఖించుము' - ఇది బైబిల్ సూక్తి. మరి అందరూ బైబిల్ ని పాటిస్తున్నట్లా?'

అప్పటి దాకా అతను మాట్లాడినదంతా గాలికెగిరి పోయింది.

'అదేంటండి? మన పూజలు మనకుంటాయి కదా? అన్నీ ఒకటే ఎలా అవుతాయి?' అన్నాడు.

'పూజలు మనకే కాదు నాయనా అందరికీ ఉంటాయి. ఎవరి పూజలు వాళ్ళకుంటాయి. అడివి మనుషులలో కూడా వాళ్ళ పూజలు వాళ్ళకుంటాయి? ఏంటి మీ గొప్ప? తేడా ఏముంది? అందరూ కామన్ గా చేసేది తినడం, గోలచెయ్యడం ఇంతే కదా?' అన్నాను.

సమాధానం లేదు.

దీపావళిని జరుపుకోవడం తప్పని నేననడం లేదు. కానీ ఎలా జరుపుకోవాలో మనవాళ్లకు తెలియడం లేదు.  సెన్స్ లేకుండా  రాత్రి పదిగంటలు దాటాక కూడా టపాకాయలు కాల్చి గోలచెయ్యడం మాత్రమే భారతీయ సంస్కృతి కాదు.  అసలు చెప్పాలంటే, ఇదికాదు భారతీయ సంస్కృతి. దీపావళి వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్ధాలు అందరూ మర్చిపోయారు.  పైపైన కాకిగోల మాత్రం మిగిలింది. దానినే 'ఇండియన్ కల్చర్' అనుకుంటున్నారు. అమెరికా వచ్చిన ఇండియన్స్ కూడా ఇదే భ్రమలలో ఉన్నారు. పైగా అదేదో గొప్పగా, అమెరికన్లకు తెలియనిది తామేదో నేర్పిస్తున్నట్లు  గర్వంగా ఫీలౌతున్నారు. వాళ్ళేమో 'లేకి వెధవలు' అని తిట్టుకుంటున్నారు ఎంత ఖర్మో?  

ఇండియన్ కల్చర్ అంటే, పంచెలు చీరలు, పరికిణీలు కట్టుకుని అందరూ ఒకచోట చేరి, బాలీవుడ్ సినిమా పాటలకు డాన్సులు చేసి, తిని, త్రాగి గోలచెయ్యడం కాదురా బాబూ ! ఎలా చెబితే మీకర్థమౌతుంది? మన ప్రతి పండుగ వెనుకా ఒక ఆధ్యాత్మిక అర్ధం ఉంది. ఒక సాధనావిధానం ఉంది. మన మతం ఒక జీవన విధానం. దానిని మర్చిపోయి, ఎంతసేపూ వండుకొని, నైవేద్యాల పేరుతో మీరు మెక్కి, మీరు చేసే గోలతో ప్రకృతిని పాడుచెయ్యడం కాదు ఇండియన్ కల్చరంటే.

మనవాళ్లతో పోలిస్తే, ఇక్కడి అమెరికన్స్ చాలా నయం. వాళ్ళు కూడా, జూలై నాలుగున టపాకాయలు కాలుస్తారు. అయితే, మనవాళ్ల లాగా ఎవరి ఇళ్ళదగ్గర వాళ్ళు చెత్త చెయ్యరు.  అందరూ ఒక గ్రౌండ్ కు చేరుకుంటారు. చక్కగా కూర్చుంటారు. టపాకాయలు కాల్చే బ్యాచ్ ఒకటుంటుంది.  వాళ్ళు కాలుస్తారు. మిగతావాళ్ళు దానిని చూస్తూ ఎంజాయ్ చేస్తారు. ఆ టపాకాయలు కూడా, ఎక్కువగా, ఒక మితం లేకుండా కాల్చరు. గాలిమొత్తం పొగతో నిండిపోయి అందరికీ దగ్గులు, ఆస్మాలు వచ్చేటంతగా కాల్చరు. వాళ్ళ సెలబ్రేషన్ లో ఒక డీసెన్సీ, ఒక డిగ్నిటీ ఉంటాయి. మనవాళ్లకు ఆ రెండే ఉండవు. మనవాళ్ల సెలబ్రేషన్ వెకిలిగా, చాలా చీప్ గా ఉంటుంది.

అమెరికన్స్ కూడా 'ఫెస్టివల్ ఆఫ్ లైట్స్' పండుగను చేసుకుంటారు. ఇళ్లలో దీపాలను పెడతారు. అంతే. డీసెంట్ గా ఉంటుంది. అయితే వాళ్ళ గోలలు వాళ్ళకీ ఉన్నాయి. హాలోవీన్ అనే దరిద్రం వాళ్ళకీ ఉంది. దయ్యాల్లాగా భూతాల్లాగా వేషాలు వేసుకుని రోడ్లమీద తిరుగుతారు. ఆఫీసులకు కూడా వెళతారు. అందులో బెస్ట్ వేషానికి ప్రయిజు కూడా ఉంటుంది ఆఫీసులో. ఇళ్లల్లో ఎముకలు, పుర్రెలు, మొదలైన చెత్తతో అలంకరిస్తారు. ఇదే విధంగా ప్రతి మతానికీ సోకాల్డ్ కల్చర్లు ఉన్నాయి.  బక్రీద్ అంటూ, లక్షలాది మేకలను, గొర్రెలను చంపి తింటారు ముస్లిమ్స్. అది కూడా మానవుడి చీప్ ప్రవర్తనకు ఒక రుజువే. అదసలు అవసరమా? ఆకారమే లేని అల్లాకి మేకల బలులెందుకు? ఆకారం లేనివాడు, ఎలా తింటాడు? తినేది మీరేగాని అల్లా కాదుగా?  ఈ విధంగా ప్రతి జాతిలోనూ లేకి పండుగలున్నాయి. దురదృష్టవశాత్తూ వాటికి 'కల్చర్' అని పేరు పెట్టి కొనసాగించుకుంటున్నారు. అదేంటంటే, ,'వాళ్ళు చేస్తున్నారుగా, మేం చేస్తే తప్పేంటి?' అంటారు. ఇదొక లాజిక్కా అసలు? వాడు చేస్తున్నాడని వీడు, వీడు చేస్తున్నాడని వాడు, అందరూ కలసి ప్రకృతిని పాడు చేస్తున్నారు. అకాల వర్షాలు, వానలు, వరదలు, కోవిడ్లు వచ్చి చస్తున్నారు. కానీ బుద్ధులు మారడం లేదు. 'మేం చేసేదానివల్ల కాదులే' అని ప్రతివాడూ అనుకుంటాడు. కానీ దానిపాత్ర కూడా ఉందని, ఇలా అందరి పాత్రలతోనే, మన యాత్ర సమాప్తం అవుతున్నదన్న స్పృహ మాత్రం ఎవరిలోనూ లేదు. 

అలాంటి వాటిల్లో ఒకటి, మనవాళ్ళు అమెరికాకు వచ్చికూడా దీపావళి పేరుతో టపాకాయలు కాల్చి, వాతావరణ కాలుష్యం చెయ్యడం. అదికూడా రాత్రి పది తర్వాత.

సగటు మానవుడి మనస్తత్వం ఎప్పటికీ ఇలాగే నేలబారుగా, చౌకబారుగా ఉంటుందేమో? క్లాస్ గా,  డీసెంట్ గా, పక్కవాడికి, ప్రకృతికి హానిచేయ్యకుండా బ్రతకడం మనిషికి చేతకాదేమో?

మన పండుగలు ఇలా చౌకబారువి కాదురా బాబు. అర్ధం చేసుకోండి. వీటిని జరుపుకునే విధానం ఇది కాదు.

ఇప్పటికే, ఇండియన్స్ అంటే ఇండీసెంట్ ఫెలోస్ అని చాలామంది అమెరికన్లు అనుకుంటారు. ఆ ఇమేజిని మీ ప్రవర్తనతో మార్చండి. కనీసం మన దేశగౌరవాన్ని పెంచేలా ప్రవర్తించండిరా.

కొంచెమైనా ఎదగండిరా బాబు !