ఇలా అన్నాను
దేవుడు లేడనే వాడితో - 'సృష్టి దానంతట అదే పుట్టిందా?' అన్నాను?
దేవుడున్నాడనే వాడితో - 'ఉంటే కనిపించడెందుకు?' అన్నాను.
దేవుడికి రూపం లేదనేవాడితో - 'రూపం లేనివాడు ఇన్ని రూపాలనెలా చేశాడు?' అన్నాను.
దేవుడికి రూపం ఉంది అనేవాడితో - 'ఇన్నిరూపాలలో ఆయనది ఏ రూపమో?' అన్నాను.
అసలు దేవుడున్నాడా అని అడిగినవాడితో - 'ఉన్నా లేకపోయినా నీకెందుకు?' అన్నాను.
పెద్దగా అరుస్తూ దేవుడిని పిలవాలనేవాడితో - 'ఏం మీ దేవుడికి చెవుడా?' అన్నాను.
మౌనంగా ప్రార్ధించాలి అనేవాడితో - 'మౌనంలో ప్రార్ధన ఎలా కుదురుతుంది?' అన్నాను.
ఓం శాంతి అన్నవాడితో - 'జై మాలిని' అన్నాను.
క్రియా యోగా అన్నవాడితో - 'కర్త, కర్మ ఏమయ్యాయి?' అన్నాను.
హార్ట్ ఫుల్ గా మెడిటేషన్ చెయ్యాలి అన్నవాడితో - హార్ట్ ఫుల్ అయితే, మూడు నిముషాల్లో పోతావ్' అన్నాను.
సుదర్శనం మంచిది అన్నవాడితో - 'పాశుపతం చేసిన పాపమేంటి?' అన్నాను.
ఆన్ లైన్లో క్లాసులు చేస్తున్నా అన్నవాడితో - 'ఆఫ్ లైన్లో గ్లాసులు మోస్తున్నావా' అన్నా.
శ్వాస మీద ధ్యాస అన్నవాడితో - ' శ్వాస ఆగినప్పుడు నీ ధ్యాస ఏమౌతుంది?' అన్నా.
మక్కా కెళ్తా అన్నవాడితో - 'ముందు చొక్కా సరిగ్గా తొడుక్కో' అన్నాను.
నమాజ్ చెయ్యాలి అన్నవాడితో - 'దేవుడికి అరబిక్ తప్ప వేరే భాషలు రావా?' అన్నాను.
గుళ్ళు కూలగొట్టాలి అన్నవాడితో 'ముందు మీ గుడి కూల్చుకో ' అన్నాను.
విగ్రహారాధన పనికిరాదు అనేవాడితో - 'విగ్రహం కానిదాన్ని ఎలా ఆరాధిస్తావు?' అన్నాను.
ఆదివారం ప్రేయర్ కెళ్తాను అన్నవాడితో -'మిగతావారాలు బబ్బుంటావా?' అన్నాను.
ఉపవాస ప్రార్ధన చేస్తాను అన్నవాడితో - 'నీ పొట్ట ప్రార్ధన విను ముందు' అన్నాను.
ఏకాంత కూడికలు అన్నవాడితో - 'ఏం నలుగురిలో లెక్కలు రావా?' అన్నాను.
నేను కమ్యూనిస్టుని అన్నవాడితో - 'ముందు నీ ఇమ్యూనిటీ పెంచుకో' అన్నాను.
ధ్యానమే కరెక్ట్ అనేవాడితో, 'నువ్వు లేచేసరికి వంట ఎవరు చేస్తారు?' అన్నాను.
ఒక్కొక్క రోజున ఒక్కొక్క పూజ చెయ్యాలి అనేవాడితో - 'రోజుకొక్క పెళ్లి కూడా చేసుకో' అన్నాను.
పూజ చేయనిదే మంచినీళ్లు కూడా ముట్టను అన్నవాడితో - 'ఒక నెలరోజులు పూజ చెయ్యకు' అన్నాను.
నైవేద్యం పెట్టనిదే భోజనం చెయ్యను అన్నవాడితో - 'నువ్వు పెట్టలేదని దేవుడు నీరసమొచ్చి పడిపోయాడు' అన్నాను.
మా మతమే కరెక్ట్ అనేవాడితో - 'మీ మతం పుట్టకముందు దేవుడు నిద్రపోతున్నాడా?' అన్నాను.
దేవుడిని శిలువేశారు అనేవాడితో - 'వేసినవాడు ఎంత గొప్ప దేవుడో?' అన్నాను.
సైతానుంది అనేవాడితో - 'సైతాన్ని దేవుడెందుకు చేశాడు? ఎందుకు ఉండనిస్తున్నాడు?' అన్నాను.
మా పుస్తకమే కరెక్ట్ అనేవాడితో - 'మీ పుస్తకం రాకముందు ప్రింటింగ్ ప్రెస్సులు లేవా?' అన్నాను.
మా ప్రవక్త ఇలా చెప్పాడు అనేవాడితో - 'మీ ప్రవక్త రాకముందు వక్తలే లేరా?' అన్నాను.
ఆచారం వద్దనేవాడితో - 'నువ్వు చేసేదే ఆచారం. ఏమీ చెయ్యకుండా ఉండగలవా?' అన్నాను.
మీ ఆచారం కంటే మా ఆచారం గొప్పది అనేవాడితో - 'మా పిల్లి మ్యావ్ అంటుంది, మీ పిల్లి భౌ అంటుందా?' అన్నాను.
మతం మత్తుమందు అనేవాడితో - 'మత్తుమందు కానిదేది?' అన్నాను.
నేను నాస్తికుడిని అనేవాడితో - 'నీకు ఆస్తి ఉందిగా లేదంటావేంటి?' అన్నాను.
మతం మారు అనేవాడితో - 'లింగమార్పిడి ఆపరేషన్ ఫెయిలౌతుంది' అన్నాను
జ్యోతిష్యాన్ని నమ్మను అనేవాడితో - 'రేపటినుంచీ సూర్యుడు ఉదయించడులే' అన్నాను.
అదృష్ట రెమెడీలు చెప్పండి అనేవాడితో - 'నీ అదృష్టం నీ చేతులలోనే ఉంది' అన్నాను.
శివుడికి కార్తీకమాసం ఇష్టం అనేవాడితో - 'మిగతా మాసాలలో ఆయన ఉపవాసమా?' అన్నాను.
ఈ దేవుడిని నమ్మితే మంచి జరుగుతుంది అనేవాడితో - 'నమ్మనివాడికి కూడా జరుగుతోందిగా?' అన్నాను.
ఈ దీక్ష బాగుంటుంది అనేవాడితో 'ఎందుకు నిన్ను నువ్వే శిక్షించుకుంటావ్?' అన్నాను.
ఈ దేవుడు మావాడు అనేవాడితో - ' అసలు నువ్వెవరివాడివి?' అన్నాను.
మూఢనమ్మకాలు మంచివి కావు అనేవాడితో - 'ఆధారం లేకుండా నమ్మకం ఎలా ఉంటుంది?' అన్నాను.
లోకాన్ని ఉద్ధరిస్తా అనేవాడితో - 'లోకం ఇక్కడే ఉంటుంది. పొయ్యేది నువ్వే' అన్నాను.