గుజరాత్ లోని మోర్బి టౌన్ లో వ్రేలాడే బ్రిడ్జి కూలిపోయింది. దానిమీదున్న 400 మందీ క్రిందనున్న నదిలో పడిపోయారు అందులో 140 మంది మోక్షాన్ని పొందారు. కారణమేమంటే, ఒక ఇరవై మంది కుర్రకారు, ఆ బ్రిడ్జిని ఉయ్యాలలాగా ఊపారు. దాని కేబుల్స్ తెగిపోయాయి. అందరూ 30 అడుగుల క్రిందనున్న నీళ్లలో పడిపోయారు. ఈ సంఘటన సెప్టెంబర్ 30 న సాయంత్రం 6.40 కి జరిగింది.
గుజరాత్ లో నా స్నేహితుడొకడున్నాడు. వాడిపేరు భరత్ పరేఖ్. నేనూ వాడూ ఒకేసారి రైల్వేలో సెలక్ట్ అయ్యి, సర్వీసు వెలగబెట్టి, ముందు నేను రిటైరయ్యాను, పోయిన్నెలలో వాడు రిటైరయ్యాడు. వాడి ఊరు మోర్బి దగ్గరలోనే ఉంటుంది. సైట్ సీయింగ్ కని వెళ్లి పొరపాటున ఆ బ్రిడ్జి ఎక్కాడేమోనని వాడికి ఫోన్ చేశాను.
'ఏరా? ఆ బ్రిడ్జిమీద నువ్వు లేవు కదా?' అన్నాను.
30 ఏళ్ళు ఆంధ్రాలో ఉండటంతో వాడు తెలుగు బాగానే మాట్లాడతాడు.
'లేను. ఉంటే నీతో ఎలా మాట్లాడతానిప్పుడు?' అని జోకేశాడు.
'సర్లే. ఏం జరిగిందసలు?' అన్నా.
'ఏముంది? పండగ సెలవలు. ఎక్కడ చూసినా జనసముద్రం. హోటళ్లు, మాల్స్, సినిమా హాల్స్, బజార్లు ఎక్కడ చూసినా విపరీతమైన జనం. అందరూ రోడ్లమీదే ఉన్నారు. చాలా చిరాకుగా ఉంది. అదే విధంగా ఆ బ్రిడ్జిమీద కూడా ఎక్కారు. దానిమీద 20 మందిని కంటే ఎక్కించకూడదు. అది ఎప్పుడో బ్రిటిష్ వాడు కట్టిన బ్రిడ్జి. దానిమీద 400 మంది ఎక్కారు. పైగా ఉయ్యాల ఊగుతున్నారు. కేబుల్స్ ఎలా తట్టుకుంటాయి? తెగింది. పడ్డారు. పోయారు' అన్నాడు.
'మెయింటెనెన్స్ ఏజన్సీ మాతో చెప్పకుండా, మా పర్మిషన్ తీసుకోకుండా, బ్రిడ్జిని రీ ఓపెన్ చేసింది. 20 మందికి ఇవ్వాల్సినచోట 400 మందికి టిక్కెట్లిచ్చి ఎక్కించింది. ఇదే ప్రమాదానికి కారణం' అని గుజరాత్ ప్రభుత్వం అంటోంది.
నిజమే కావచ్చు.
కానీ అసలు విషయం అది కాదు. ఇండియాకి పట్టిన అసలైన దరిద్రం - అతి జనాభా. దానికి తోడు 'లా' ని ఎవడూ పాటించకపోవడం. ఈ విషయాన్ని గతంలో వందలాది సార్లు వ్రాశాను. మళ్ళీ ఇప్పుడు రుజువైంది. ముందుముందు కూడా రుజువౌతూనే ఉంటుంది. జనాభా తగ్గుతూనే ఉంటుంది. పెరుగుట విరుగుట కొరకే అన్నది ప్రకృతి సూత్రం ! పిచ్చిగా పెరిగిపోతే ఉన్నట్టుండి విరిగిపోక తప్పదు. దేనికైనా సరే ఈ సూత్రం వర్తిస్తుంది.
జ్యోతిష్యపరంగా ఇది చాలా విచిత్రమైన సంఘటన. ఎలాగో వివరిస్తా వినండి.
భారతదేశానికి సూచిక అయిన మకరరాశి నుండి దశమంలో నాలుగు గ్రహాలున్నాయి. ఇవి జనసమ్మర్దాన్ని, చాలామంది మనుషులు ఒకచోట గుమికూడటాన్ని సూచిస్తున్నాయి.
తులారాశి త్రాసును సూచిస్తుంది. గాలికి త్రాసు ఉయ్యాలలాగా ఊగుతుంది. వేలాడే బ్రిడ్జి కూడా ఒక త్రాసు లాంటిదే. ఊపితే అదీ ఊగుతుంది. బరువెక్కువైతే తెగుతుంది. తులారాశి వాయుతత్వ రాశి, అందుకే, గాలిలో వేలాడే బ్రిడ్జి ప్రమాదం జరిగింది.
శని దశమదృష్టి తులమీదుంది. కుజుని పంచమదృష్టి తులమీదుంది. ఇది యాక్సిడెంట్ యోగమని నా పుస్తకాలలో కూడా వ్రాశాను. కనుక, ఘోరప్రమాదం జరిగింది.
తులారాశి పశ్చిమదిక్కును సూచిస్తుంది. అందుకే, ఇండియాలో పడమరదిక్కున ఉన్న గుజరాత్ లో ఈ ప్రమాదం జరిగింది.
తులలో నాలుగు గ్రహాలున్నాయి. వీరు రవి, బుధ, శుక్ర, కేతువులు. వీరిలో, రవి నీచస్థితిలో ఉన్నాడు, బుధ శుక్రులు అస్తంగతులయ్యారు. కేతువు వీళ్లందరినీ మింగేశాడు. నీచరవి, లాభం కోసం 400 మందిని బ్రిడ్జి ఎక్కించిన నీచపు అధికారులకు సూచకుడు. బుధుడు చిన్నపిల్లలకు, శుక్రుడు ఆడవాళ్లకు సూచకులు. వీళ్ళే ఈ ప్రమాదంలో ఎక్కువగా చనిపోయినవాళ్లు. మరి ఇలాంటి గ్రహస్థితిలో, ఇలాంటి ఘోర ప్రమాదం జరగక ఇంకేం జరుగుతుంది?
మిధునంలో కుజుడు, ఆకతాయి కుర్రవాళ్ళకు సూచకుడు. ఆయన దృష్టి ఈ నాలుగు గ్రహాలమీదుంది. కుర్రవాళ్ళ గుంపు ఆకతాయితనంగా బ్రిడ్జిని ఊపడమే, అది కూలడానికి కారణమైంది.
చూశారా ప్రమాదాలకు గ్రహస్థితులు ఎలా ఖచ్చితమైన కారణాలౌతాయో?
ఇప్పుడొక సందేహం మీకు రావచ్చు. అదేంటంటే, 'ముందే చెప్పి ఈ ప్రమాదాన్ని తప్పించవచ్చు కదా?' అని.
'ఎందుకు తప్పించాలి?' అని నేనంటాను.
అది సాధ్యం కాదని కూడా కొన్ని వందలసార్లు ఇప్పటికే చెప్పాను. గ్లోబల్ కర్మను తప్పించడం ఎవరికీ సాధ్యం కాదు. వాళ్ళు చేసుకున్న ఖర్మను బట్టి జనం ఆ విధంగా చస్తారు. దానిని తప్పించడానికి జ్యోతిష్కుడెవరు? అసలు ఎందుకు ప్రయత్నించాలి? ఇతరుల కర్మలో మనమెందుకు జోక్యం చేసుకోవాలి? ఎవడెలా పోతే మనకెందుకు? చూస్తూ ఉండాలంతే.
ఆ క్షణంలో ఎవరైనా అక్కడ నిలబడి, 'ఒద్దురా బాబు. ఎక్కద్దు. ప్రమాదం' అని మొత్తుకున్నా ఎవడూ వినడు. వాడినొక పిచ్చివాడుగా చూసి హేళన చేస్తారు. ఇది నేటి లోకరీతి. పోనీ, వాళ్లంతా విని, ఆ బ్రిడ్జి ఎక్కకుండా ఉంటే, అప్పటికా ప్రమాదం తప్పవచ్చు, కానీ ఇంకొకచోట మళ్ళీ ఇలాంటి పరిస్థితిలోనే ఇరుక్కుని, వాళ్ళందరూ చస్తారు. లేదా, రకరకాల ఇతర కారణాలతో చస్తారు. కనుక సామూహిక కర్మను తప్పించడం ఎవరికీ సాధ్యం కాదు, ఒక్క దైవశక్తి తోడుగా ఉంటే తప్ప ఆ పనిని ఎవ్వరూ చెయ్యలేరు. చెయ్యకూడదు కూడా. ఈ లోపల, పనీపాటా లేకుండా అలా చెప్పి ఆ ప్రమాదాలను తప్పించిన జ్యోతిష్కుడికి వేటు పడుతుంది. వాడు ఏదో ఒక యాక్సిడెంట్లో పోతాడు. ఎందుకా ఖర్మ?
జ్యోతిష్యశాస్త్రం అంటే ఆషామాషీ పిల్లలాట కాదు. ఇది కర్మతో చెలగాటం. ఇది తమాషా వ్యవహారం కానేకాదు. దైవశాస్త్రం. వ్యక్తిగతంగా మాత్రమే ఎవరి కర్మనైనా తప్పించడానికి వీలౌతుంది. అదికూడా, ఆ వ్యక్తి పధ్ధతి తప్పకుండా, నిజాయితీగా, సరిగ్గా ఉంటే మాత్రమే, ఆ విధంగా కర్మను తప్పించడం సాధ్యమౌతుంది. మంది కర్మను తప్పించడం ఎవరికీ సాధ్యం కాదు. ఎవడిష్టం వచ్చినట్టు వాడు పిచ్చిపిచ్చి పనులు చేసుకుని, కర్మను పోగేసుకుని, 'తప్పించండి' అంటే, ఎందుకు తప్పించాలి? చెప్పినా ఆ గుంపులో ఎవడు వింటాడు? 'పోగాలము వచ్చినవాడు కనడు వినడు' అని ఊరకనే అనలేదు మరి !
డబ్బుకోసం ఆశపడి జ్యోతిష్య రెమెడీలు ఎప్పుడూ ఎవరికీ చెప్పకూడదు. అలా చెప్పేవారి కుటుంబాలు నాశనమౌతాయి. అందుకే, కమర్షియల్ జ్యోతిష్కుల కుటుంబాలు ఎప్పుడూ పైకిరావు. జ్యోతిష్యశాస్త్రానికి ఈ శాపం ఉన్నది. ఇది తెలియక ప్రతివాళ్ళూ జ్యోతిష్యంతో ఆటలాడి చేతులు కాల్చుకుంటూ ఉంటారు. కొంతమంది గాయత్రీజపం చేసి ఆ దోషం పోగొట్టుకుంటామని అంటారు గాని, అది సాధ్యం కాదు. తూతూ మంత్రంగా చేసే గాయత్రీజపం, రెమెడీలు చెప్పిన దోషాన్ని, చేయించిన దోషాన్ని, ఏమాత్రమూ పోగొట్టలేదు.
అదలా ఉంచితే, ఈ ప్రమాదం గురించి ఇక్కడ అమెరికాలో రకరకాలుగా హేళనగా మాట్లాడుతున్నారు. ఇది మామూలే. ఇండియా అంటేనే ఇక్కడ చాలా చిన్నచూపు. ఇండియాలో వ్యవస్థలు ఉండవని, లా అండ్ ఆర్డర్ ఉండదని, జనాభా అంతా పనికిరాని గుంపని, కట్టుబడిలోగాని, మెయింటెనెన్స్ లో గాని సరైన ప్రమాణాలు ఉండవని, అంతా లంచాల మయమని, అన్నీ మాఫీ అవుతాయని, ఇక్కడ అనుకుంటూ ఉంటారు. కనుక ఎవరూ 'అయ్యోపాపం' అనడం లేదు. 'ఇండియాలాంటి దేశంలో అలా కాక ఇంకెలా జరుగుతుందిలే?' అంటున్నారు. 'ఇండియా, స్పేస్ లోకి రాకెట్లను పంపిస్తోంది. భూమ్మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను మాత్రం కాపాడుకోలేకపోతోంది' అంటూ ఎగతాళిగా మాట్లాడుతున్నారు.
వాళ్లనుకునేదానిలో కూడా నిజాలున్నాయి కదా? మనమేం అనగలం?