అమెరికాలో విమానాలెక్కడం మామూలే. ఇప్పటికి చాలాసార్లు ఎక్కడం జరిగింది. ఒకసారి రైలుప్రయాణం చేద్దామని అనుకున్నాను. ఇల్లినాయ్ రాష్ట్రంలో చికాగో దగ్గరలో షాంపేన్ సిటీ ఉంది. దీనిని షాంపేన్ అర్బానా అంటారు. షాంపేన్, అర్బానా అనే రెండు సిటీలు కలసి ఉంటాయి. ఇక్కడ 'యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినోయ్' ఉంది. ఇది చాలా పేరున్న యూనివర్సిటీ. అందుకని షాంపేన్ అనేది విద్యాకేంద్రమన్నమాట. అక్కడ మూడు రోజుల స్పిరిట్యువల్ రిట్రీట్ నిర్వహించే ప్లానుంది.
గతంలో 2016 లో ఇక్కడకొచ్చినపుడు ఇక్కడి సరస్వతీ ఆలయంలో ఉపన్యాసమిచ్చాను. ఇప్పుడు మళ్ళీ షాంపేన్ వెళ్తున్నాను. మిషిగన్ రాష్ట్రంలో నేనున్న ట్రాయ్ సిటీ నుండి ఇల్లినాయ్ రాష్ట్రంలోని షాంపేన్ కు రైల్లో పోదామని ప్లాన్ చేసాం. డ్రైవింగ్ అయితే ఆరేడు గంటలు పడుతుంది. రైల్లో పోతే రిలాక్స్ అవుతూ ప్రయాణం చేయవచ్చు.
ట్రాయ్ నుండి ముందు చికాగోకి వెళ్ళాలి. ఇది ఆరు గంటల ప్రయాణం. అక్కడ రెండు గంటలు ఆగి, మళ్ళీ ఇంకొక రైలెక్కి ఇంకొక రెండు గంటల ప్రయాణంతో షాంపేన్ చేరుకోవాలి. AMTRACK అనే రైల్వేకంపెనీ రైళ్లు ఈ రూట్లో నడుస్తుంటాయి.
మన రైల్వే సిస్టం కంటే ఇది భిన్నంగా ఉంది. ఈ రూట్లో విద్యుద్దీకరణ ఇంకా జరగలేదు. డీజిల్ ఇంజన్లే నడుస్తున్నాయి. కాకపోతే మేగ్జిమం స్పీడ్ 110 మైళ్ళుంది. అంటే దాదాపు 160 కి. మీ స్పీడులో పోతుంది. దీనిని మనం ఇంకా అందుకోలేకపోతున్నాం.
కొన్ని చోట్ల సింగిల్ లైనుగా, కొన్నిచోట్ల డబల్ లైనుగా ఉంది. ఎక్కువ ట్రెయిన్స్ తిరగడం లేదు గనుక, క్రాసింగులు లేవు. రైలు కూడా కిటకిటలాడుతూ లేదు. స్టాండింగ్ పాసింజర్స్ లేరు. ఈ రైలుకు అయిదు బోగీలు మాత్రమే ఉన్నాయి. ఎక్కడా హాకర్లు, బెగ్గర్లు కనపడలేదు. అంతా క్లాస్ గా ఉంది.
రైల్వే స్టేషన్లు ఎయిర్ పోర్ట్ ల్లాగా చాలా శుభ్రంగా ఉన్నాయి. స్టాఫ్ తక్కువ. ఎక్కువగా ఆటోమేషన్, మెకనైజేషన్ కనిపిస్తోంది. రైలుకు గార్డు బోగీ లేదు. ఒక టీటీఈ ఉన్నాడు. ఒక సూపర్ వైజర్ ఉన్నాడు. పాంట్రీ కార్ ఉంది. మనుషులందరూ ఎక్కాక టీటీఈ, ఇంజన్ డ్రైవర్ తో వాకీటాకీలో మాట్లాడుతున్నాడు. అప్పుడు ట్రెయిన్ స్టార్ట్ అవుతోంది. స్టేషన్లలో ఎనౌన్ మెంటు మొదలైనవి లేవు. ట్రెయిన్లో మాత్రం, రాబోయే స్టేషన్ ఏమిటి అనేది టీటీఈ ఎనౌన్స్ చేస్తున్నాడు.
పాంట్రీ కార్ చిన్న సైజు హోటల్ లాగా ఉంది. అక్కడ ఫుడ్ కొనుక్కుని అక్కడే కూర్చుని తినవచ్చు. పాంట్రీలో రెడ్ వైన్, వైట్ వైన్ కూడా దొరుకుతున్నాయి. టాయిలెట్స్, విమానాలలో ఉన్నట్లు చాలా శుభ్రంగా ఉన్నాయి. ఇది రైలు అని కాసేపు మర్చిపోతే, విమానంలో ఉన్నట్లే యాంబియెన్స్ అంతా నీట్ గా ఉంది.
లెవల్ క్రాసింగ్ గేట్ల దగ్గర మనుషులు లేరు. రెడ్ సిగ్నల్ పడితే కార్లు ఆగిపోతున్నాయి. గేట్ దగ్గర బూమ్ కూడా రైట్ హాఫ్ లోనే సగమే ఉంది. లెఫ్ట్ కి లేదు. మనుషుల్లో డిసిప్లిన్ ఉంది గనుక, అందరూ సిగ్నల్ పాటిస్తారు గనుక సాగిపోతున్నది. మన ఇండియాలో అయితే, వేసున్న గేటు క్రిందనించి దూరి స్కూటర్లు, మోటార్ సైకిళ్ళు తీసుకుపోతుంటారు. కొంతమందైతే, గేటు తియ్యమని గేట్ మ్యాన్ పైన దౌర్జన్యం కూడా చేస్తారు
గతంలో జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చింది.
నేను గుంటూరులో పనిచేస్తున్నప్పుడు ఒకరోజున నాకొక ఫోనొచ్చింది. ఆయనొక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. రిటైరయ్యాక రాజకీయాలలో దిగాడు. ఏమిటా ఈయన ఫోన్ చేశాడు అనుకుంటూ ఫోనెత్తా.
'DOM గారు, మా కారు లెవల్ క్రాసింగ్ గేటు దగ్గర ఆగిపోయి ఉన్నది. మేము అర్జంటుగా విజయవాడ వెళ్ళాలి. నాతోబాటు కార్లో ఫలానా MP గారున్నారు. ఈయన గతంలో మినిష్టర్ కూడా చేశారు. గేటు వెంటనే తియ్యమని మీ స్టాఫ్ కి చెప్పండి' అని కొంచం డిమాండ్ గా అడిగాడు.
ఆయనతో ఇలా చెప్పాను.
'చూడండి. మీ కోసం గేటు తీస్తే, గేట్ మ్యాన్ ఇంటికి పోతాడు. మీరేమో పైకి పోతారు. ఎందుకంటే సూపర్ ఫాస్ట్ ట్రెయిన్ వస్తోంది. అది గుద్దితే మీతోబాటు మీ కారులోని అందరూ పోతారు. అందుకని మీ కోసం వేసిన గేటును తియ్యడం కుదరదు. కొంచం సేపు వెయిట్ చెయ్యండి. సారీ' అని ఫోన్ పెట్టేశాను.
మన ఇండియాలో అలా ఉంటుంది ప్రతిదానిలో అందరి జోక్యం ! ఇక్కడ ఆ విధంగా చీప్ గా ప్రవర్తించేవాళ్లు ఎవరూ ఉండరు.
ఇండియా గూడ్సు రైళ్లలో ఎక్కువలో ఎక్కువ 60 వాగనులుంటాయి. ఇక్కడ నూరు పైగా ఉన్నాయి. సైజు కూడా మన వేగన్లకంటే డబలున్నాయి. గూడ్సు రైళ్లలో ఎక్కువగా కంటెయినర్ ట్రాఫిక్ పోతోంది.
చికాగో దగ్గరలో మాత్రమే సైడింగ్లు కనిపించాయి. పాయింట్లు కూడా పెద్ద స్టేషన్లలోనే ఉన్నాయి. చిన్న స్టేషన్లలో సైడింగ్లు, పాయింట్లు లేవు. సిగ్నలింగ్ వ్యవస్థ మనలాగే ఉంది. కంట్రోల్ రూమ్ ఎక్కడుంటుంది? ఆపరేటింగ్ సిస్టమ్ ఏమిటి? ఎలా పనిచేస్తుంది? మొదలైన లోతుపాతులు అడుగుదామంటే ఎవరూ అందుబాటులో లేరు.
విమానంలో ప్రయాణిస్తే, అమెరికా లోతుపాతులు చూడలేము. పైనుంచి అంతా ఒకేలాగా ఉంటుంది. అదే ట్రెయిన్ లో ప్రయాణిస్తే, ఊర్ల మధ్యలోనుంచి రైలు పోతుంది గనుక అంతా చూడచ్చు.
ట్రాయ్ లో రైలెక్కి ఆరు గంటల రైలు ప్రయాణం తర్వాత చికాగోలో దిగాము. ట్రాయ్ స్టేషన్లో టీసీ లేడు. స్టేషన్ మాస్టర్ ఉన్నాడేమో, ఎక్కడున్నాడో కనిపించలేదు. అసలా స్టేషన్లో ఎవరూ కన్పించలేదు. అంతా ఆటోమేటిక్ డోర్లు, లిఫ్ట్ మొదలైనవి ఉన్నాయి. ప్లాట్ ఫామ్ మీద కూడా ఎవరూ లేరు. ట్రెయిన్ రాబోయేముందు ఒక పదిమంది అమెరికన్స్ వచ్చి రైలెక్కారు. అంతే. రైలు వచ్చింది. మేము ఎక్కాక బయల్దేరింది. స్టాఫ్ ఎవరూ కనిపించలేదు.
కొన్ని ఫోటోలు ఇక్కడ చూడండి.