నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

16, నవంబర్ 2022, బుధవారం

మూడవ అమెరికా యాత్ర - 57 (గంగిగోవు పాలు)

మొన్నొకాయన కనబడి, 'మా అబ్బాయిని తీసుకుని ఆదివారం సాయంత్రం మీ దగ్గరికి వస్తాను, మీ ఆశీస్సులు వాడికి కావాలి' అన్నాడు. 2017 లో నా స్పీచి ఆయన విన్నాట్ట. ఇప్పుడు మళ్ళీ షాంపేన్ కు వచ్చానని తెలిసి, వాళ్ళబ్బాయిని తీస్కుని వస్తానంటాడు. 

'ఆశీస్సులు కావలసింది నీకు. మీ అబ్బాయికి కాదు. రావద్దు' అని చెప్పాను.

ఆశీస్సులివ్వడానికి నేనేమైనా స్వామీజీనా? పైగా, వారికి కావలసిన ఆశీస్సులేమిటి? అన్నిట్లో కలసి రావడం, డబ్బులు బాగా సంపాదించడం, ఇవేగా? నాకు నచ్చనిదే ఇలాంటి ఆశీస్సులివ్వడం. నేనేం చెబుతున్నానో అర్ధం చేసుకోకుండా, వాళ్ళేదో ఊహించుకుని, నన్నలా చెయ్యమంటే, నాకెలా కుదురుతుంది? నేనున్నది అందరి ట్యూన్స్ కు డాన్స్ చెయ్యడానికి కాదు. నా ట్యూనంటూ ఒకటేడిసింది. దాన్ని నేర్చుకునేవారు నాక్కావాలి.

ఆయన మళ్ళీ అడిగితే, ఇలా చెప్పమన్నాను.

'పాదపూజకైతే పదివేల డాలర్లు అవుతాయి. పోనీ మీరు తెలిసిన వాళ్ళు కాబట్టి తొమ్మిది వేలివ్వండి. గురూజీ ఏదోరకంగా సర్దుకుంటారు'  

మళ్ళీ ఆయన మాట్లాడితే ఒట్టు !

ఇంకొకాయన ఊరకే ఒకసారి సరదాగా వచ్చి కలుస్తానన్నాడు.

'రావద్దు' అని చెప్పమన్నాను.

సరదాగా కలవడానికి నేనేమైనా ఈయన గర్ల్ ఫ్రెండ్ నా? ఈరోజుల్లో అదికూడా ఊరకే ఏమీ కలవదు.  దానికి బోలెడు గిఫ్టులివ్వాల్సి ఉంటుంది. పైగా ఊరకే వచ్చి కాలక్షేపం కబుర్లు, ఇండియా రాజకీయాలు మాట్లాడటానికి నేనేమీ పనీపాటా లేనివాడిని కాను. అలాంటివాళ్ళు చాలామందుంటారు. పోయి వాళ్ళతో ముచ్చట్లేసుకోమని చెప్పాను. వాళ్ళ విజ్ఞానప్రదర్శనకు నేనొక్కడినే దొరికానా? నాకున్న విజ్ఞానమే ఎక్కువై నేను చస్తుంటే పైగా వీళ్ళ విజ్ఞానాన్ని నేనెక్కడ మోసేది?

ఇంకొకామె, 'నేను పాతికేళ్లుగా అమెరికాలో క్రియాయోగా టీచర్ని. నా అనుభవాలు మీతో పంచుకుందామని అనుకుంటున్నాను. ఎప్పుడు రమ్మంటారు?' అని మెయిల్ చేసింది.

'ఈ పంచుకోవడం, ఉంచుకోవడం, చించుకోవడాల మీద నాకు మంచి అభిప్రాయం లేదు. మీరు రావద్దు. మీతో ఏది పంచుకోవడానికైనా నేను సిద్ధంగా లేను. సారీ' అని చెప్పాను.

ఈమెకు ఒక శ్రోత కావాలి. ఆమె సోకాల్డ్ అనుభవాలు విని, 'అబ్బా మీరెంత గ్రేటో? మీరు కాబట్టి ఇంత చిన్నవయసులోనే ఇంతమందితో ఇన్ని అనుభవాలు సంపాదించారు. వేరెవరి వల్లా ఇలాంటిది సాధ్యం కాదు' అని ఆమెకు డప్పు కొట్టాలి. ఇది నేనెక్కడ చెయ్యగలను?

నాకు భజన చేసేవాళ్ళకోసం నేను చూస్తుంటే, ఈమెకు నేను భజన చేయాలట. భలే ఉంది. 

'పోపోవమ్మా, వేరే బకరాని వెతుక్కో' అని మెయిలిచ్చాను.

ఇంకొకాయన, 'ఏమండి? నేను ఆధ్యాత్మికానికి పనికొస్తానా? లేక లౌకికంలో ఉండమంటారా? నా జనానా వివరాలు పంపిస్తున్నాను. చూసి చెప్పండి' అని మెయిలిచ్చాడు.

'జనన వివరాలు' అని వ్రాయవలసింది 'జనానా వివరాలు' అని వ్రాశాడు మెయిల్లో.

అతనికిలా రిప్లై ఇచ్చాను.

'చూడు బాబు. నీ జనానా చాలా పెద్దదిగా ఉంది. అసలే ఇండియాలో జనాభా ఎక్కువైపోయింది. నీవంతు కృషితో దాన్నింకా పెంచకు. ఆ జనానాని వదిలేసి ఒక్కదానితో ఉండు. అప్పుడు బాగుపడతావు. ఇంత చిన్నప్రశ్నకు నీ జాతకం చూడక్కరలేదు. నీవు మెయిల్ చేసిన విధానాన్ని బట్టి నీ మొత్తం జాతకం చెప్పగలను. నువ్వు ఆధ్యాత్మికానికీ పనికిరావు, లౌకికానికీ పనికిరావు. వెంటనే బాంబే వెళ్లే రైలెక్కు. అక్కడ  చప్పట్లు కొట్టుకుంటూ షాపుల వెంట తిరిగే బ్యాచ్ ఒకటుంటుంది. అందులో చేరు. నీకదే సరైనది'

'నాకు ఆకలైనప్పుడు నాకు గుర్తు చెయ్యి' అన్నాట్ట వెనకటికి ఒకాయన ! అలా ఉంది. కలెప్పుడౌతుందో జ్యోతిష్యం చూచి తెలుసుకోనక్కరలేదు. ఒక కప్పు ఆముదం త్రాగితే చాలు. మర్నాటికి బ్రహ్మాండంగా ఆకలౌతుంది.

ఆధ్యాత్మికానికి పనికొస్తాడో లేదో నేను చెప్పాలట ! ఎంత కామెడీగా ఉందో ! ఇంకా నయం. 'నేను పెళ్ళికి పనికొస్తానా?' అని అడగలేదు. బ్రతికిపోయాను.

లోకమంతా ఇలాంటి మనుషులతో నిండి ఉంది. ఇలాంటి త్రికరణశుద్ధి లేని మనుషులతో నాకెందుకు? సరియైన దృక్పధం ఉన్నవాడు ఒక్కడు చాలు. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి ఖరము పాలు?

ఒకవేళ గంగిగోవు పాలు దొరకలేదనుకో. అప్పుడేం చెయ్యాలి? దొరక్కపోతే పోనీ, నా టైం నాకు మిగుల్తుంది. సోది మనుషులతో సోది కాలక్షేపం తప్పుతుంది కదా? అదే చాలు.

గంగాజలం దొరకలేదని బురదనీళ్ళు త్రాగలేము కదా? ఆవుపాలు దొరకలేదని ఆముదం త్రాగలేము కదా ! నావరకూ నాకంత దాహమైతే లేదు.

ఏం లోకమో? ఏమి మనుషులో?