“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

12, డిసెంబర్ 2022, సోమవారం

మూడవ అమెరికా యాత్ర - 66 (ఇంటర్ ఫెయిల్ మీటింగ్)





మొన్నీ మధ్యన ఇక్కడొక 'ఇంటర్ ఫెయిత్ మీటింగ్' కు వెళ్లాను. అంటే, అనేక మతాల మధ్యన జరిగే అవగాహనా సమ్మేళనం అన్నమాట. ఇది 'షారే జెడెక్' అనే యూదుమత టెంపుల్ లో జరిగింది.

ఇది డెట్రాయిట్ లో ఉన్న చాలా పెద్ద టెంపుల్. https://www.shaareyzedek.org/ అనే చోట దీని గురించి పూర్తి వివరాలను చూడవచ్చు.

దాదాపు ముప్పై నలభై ఎకరాలలో ఉంది ఈ టెంపుల్. చాలా రిచ్ గా ఉంది. స్టార్ ఆఫ్ సోలమన్ ను గుర్తు తెచ్చేలాగా, కిందకీ పైకీ ఉన్న త్రిభుజాల డిజైన్లో బాగా కట్టారు. యూదులంతా బాగా ధనికులే. అమెరికాలో వీళ్ళు సూపర్ రిచ్ సిటిజెన్స్ గా ఉంటారు. వాళ్ళ టెంపుల్స్ కి కూడా బాగా డొనేషన్ ఇస్తారు. కనుక అవన్నీ బాగా విశాలంగా, రిచ్ గా ఉంటాయి.

ప్రస్తుతం ఇక్కడ యూదుమతానికి చెందిన 'హనుక్కా' అనే పండుగ జరుగుతోంది. క్రీ. పూ 164 లో యూదుల రెండో ఆలయాన్ని గ్రీకుల బారినుండి కాపాడుకుని తిరిగి దానిని కైవశం చేసుకున్నారు. ఆ సందర్భంగా, మెనోరా అనబడే యూదుల దీపపుసెమ్మెను వెలిగించడానికి అక్కడ ఒక రోజు మాత్రమే సరిపోతుందని అనుకున్న నూనె వారం రోజులపాటు ఆ దీపాలను వెలిగించిందట. ఆలయస్వాధీనాన్ని, దీపాల అద్భుతాన్ని పురస్కరించుకుని యూదులు అప్పటినుంచీ 'హనుక్కా' అనే ఈ పండుగను చేసుకుంటారు. ఇది మన దీపావళికి అటూఇటుగా వస్తుంది. అందుకని, ఇక్కడున్న హిందూ సంఘాల లీడర్స్ కూడా యూదులతో కలసి, రెండు పండుగలూ ఒకే కప్పు క్రింద జరుపుకుందామని అనుకున్నారులాగా ఉంది.

ఈ ఈవెంట్ అలా జరిగింది.

మొదటి రోజున మెనోరాలో ఒక దీపాన్ని మాత్రమే వెలిగిస్తారు. రోజుకొక్క దీపం చొప్పున ఏడు రోజులలో ఏడు దీపాలను వెలిగిస్తూ పోతారు.  ఒకప్పుడు మెనోరాలో ఏడు దీపాలుండేవిట. ఇప్పుడు తొమ్మిదయ్యాయని అక్కడ రబ్బీ చెప్పాడు. యూదుల ప్రీస్ట్ ని మనం 'రబ్బీ' అంటాము గాని, వాళ్ళు 'రబ్బై' అని అంటున్నారు.

సమావేశంలో యూదులు, హిందువులే ఉన్నప్పటికీ, క్రైస్తవులను, ముస్లిములను కూడా ఆహ్వానించారు.  వాళ్ళు ఒకరిద్దరు మాత్రమే వచ్చారు. క్రిస్టియన్ లీడర్ ఒకామె, ముస్లిం ఇమామ్ ఒకాయన వచ్చారు. మంచి స్నేహపూరిత వాతావరణంలోనే సమావేశం జరిగింది. కాకపోతే, హిందూమతం గురించి, యూదుమతం గురించి తప్ప మిగతా విషయాలన్నీ మాట్లాడుకున్నారు. అదే వింత !

మన హిందూమతం గురించి వివరించడానికి భారతీయ టెంపుల్ నుండి శారదాకుమార్ అని ఒక సండే స్కూల్ టీచర్ని తెచ్చారు. ఆమె చిన్మయా మిషన్ లో ట్రెయినింగ్ అయి 'ఆచార్య' అనే పట్టాను పొందిందట. దీపావళి గురించి ఆమె వివరించి చెప్పిన వివరణ చాలా పేలవంగా, నిరాశాజనకంగా ఉండటమే కాక, పూర్తిగా నెగటివ్ ఇంప్రెషన్ ను శ్రోతలలో కలిగించేలా ఉంది. ఆమె మాట్లాడుతున్నంత సేపూ సభలో ఉన్న యూదు సోదరులు, సోదరీమణులు జోగుతున్నారు. లేదా విసుగ్గా ముఖాలు పెట్టుకుని ఉన్నారు.

ఉదాహరణకు, దీపావళిని వివరిస్తూ ఆమె, 'ఇండియాలో అందరూ ఈ రోజులలో పొద్దున్నే లేచి తలకు నూనె పట్టించుకుని గంగానదిలో మునుగుతారు. అది మా సాంప్రదాయం' అని చెప్పింది. నేను సభికుల వైపు చూస్తే వాళ్లంతా వాంతికొచ్చినట్లు ముఖాలు పెట్టారు. అంటే, 'ఒరే ఇండియన్ దరిద్రుల్లారా. నదులని ఆ విధంగా పాడుచేస్తున్నారన్న మాట మీరంతా' అన్నట్లుగా ఉంది వాళ్ళ ఫీలింగ్.

నావరకూ నేనెప్పుడూ ఆ విధంగా చేసినట్టు ఎంత చించుకున్నా నాకు గుర్తుకు రాలేదు. ప్రతి ఊర్లోనూ గంగానది ఎలా ఉంటుంది? పోనీ నదులున్న ఊర్లలో కూడా హిందువులెవరూ అలా పొద్దున్నే నూనె పూసుకుని నదిలో మునగరు. ఇక్కడ హిందూ లీడర్స్ అనేవాళ్ళు, ఇలాంటి బ్యాడ్ ప్రాపగాండా ఎందుకు చేస్తున్నారో, ఎందుకిలాంటి నెగటివ్ భావాలను ప్రచారం చేస్తున్నారో నాకైతే అర్ధం కాలేదు. ఇటువంటి ప్రచారాలవల్లే హిందూమతం అంటే సరియైన అవగాహన కలగకపోగా, నెగటివ్ భావాలు వినేవారిలో కలుగుతాయి. చేతనైతే సరిగ్గా చెప్పాలి, లేకపోతే ఊరుకోవాలి. ఇలా ఎందుకు చెయ్యడం? అనిపించింది.

హనుక్కా పండుగ జరిగిన ఎనిమిది రోజులూ యూదులు ఏడవకూడదు. కనుక, ఏడుపు ప్రార్ధనలు కూడా పనికిరావు. అవి పండుగ రోజులు గనుక, జోకులు, సరదా వాతావరణం ఉండాలట. ప్రోగ్రామ్ కూడా అలాగే జరిగింది.

చివరలో మన స్వీట్లు, యూదుల ఏదో స్నాక్స్ కలిపి అందరూ స్వీకరించారు. అదొక పార్టీలాగా జరిగింది. సభికులలో ఉన్న కొందరు స్కాలర్స్ కి నన్ను పరిచయం చేస్తామని నన్ను ఆహ్వానించిన ఆయన అంటే, వద్దని వారించాను.

ఇక మేము సెలవు తీసుకుని వచ్చేశాము.

ఇంటికొచ్చాక సమావేశం ఆర్గనైజర్ దగ్గర నుండి నాకొక మెసేజి వచ్చింది.

'సారీ అండి. మీకు ఇక్కడ స్కాలర్స్ ని పరిచయం చేద్దామని అనుకోని మిమ్మల్ని ఆహ్వానించాను. అది వీలుకాలేదు. సమావేశం మీకు విసుగు పుట్టినట్లుగా ఉంది' అనేది దాని సారాంశం.

ఇలా రిప్లై ఇచ్చాను.

'విసుగు పుట్టినమాట వాస్తవమే. ఆ స్కాలర్స్ దగ్గర నేను నేర్చుకునేది ఏమీ లేదు. నా దగ్గర నేర్చుకునే అదృష్టం వాళ్ళకింకా రాలేదు. పోతే, మీటింగ్ అంతా చాలా పేలవంగా నిరాశాజనకంగా ఉంది. హిందూ, యూదు మతాల మధ్యన చక్కటి ఇంటరాక్షన్ జరిగి ఉంటే బాగుండేది. మీ సమావేశాన్ని ఇంకా చాలా బాగా జరిపి ఉండవచ్చు.  హిందూ, యూదు మతాల మూలాలను, వాటిమధ్యనున్న పోలికలను, భేదాలను గురించి చర్చించి ఉండవచ్చు. Lost Tribes of Israel అనేవాళ్ళు రెండువేల ఏళ్ళనుండీ ఇండియాలో ఎలా తలదాచుకున్నారో వివరించి ఉండవచ్చు. ప్రపంచమంతా వాళ్ళని వెంటాడి వేటాడినా, రెండువేల ఏళ్లుగా ఇండియా వాళ్ళని ఎలా తల్లిలాగా కాపాడుతూ వచ్చిందో చెప్పి ఉండవచ్చు. అలా చేసి ఉన్నట్లయితే, వాళ్ళ దృష్టిలో ఇండియా గౌరవం పెరిగి ఉండేది. అటువంటి కోర్ విషయాలు చర్చిస్తే బాగుండేది' అని మెసేజి చేశాను.

అక్కడి రబ్బై ఒకాయన 'నేను మోసెస్ తమ్ముడి వంశం వాడిని. ఆ వంశంలో మాది ఇన్నో తరం. మేమంతా గాయకులము. అప్పటినుంచీ యూదుమతానికి చెందిన పాటలను ఇప్పటివరకూ పాడుతూ వస్తున్నాము' అని చెప్పి, గిటార్ మీద ఆ పాటలను పాడి వినిపించాడు.  మన వైపు నుండి, మనవాళ్ళు, ద్రుపద్ రాగాన్ని, కొన్ని భజనలను పాడి వినిపించారు. వాటిని మాత్రం యూదులు చాలా బాగా ఆనందించారు.

'హిందూమతంలో రసగుల్లాలు తింటాము' అని మనమంటే, 'యూదుమతంలో ఇవి తింటాము' అని  వాళ్ళు చెప్పారు. 'మేము ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాము' అని వీళ్లంటే, 'మేము ఈ విధంగా చేసుకుంటాము' అని వాళ్ళన్నారు. ఆ విధంగా ఆ మీటింగ్ జరిగింది గాని, అసలైన కోర్ ఇష్యుస్ ఎవరూ మాట్లాడలేదు.

ఎవరి విభేదాలు వారిలోనే ఉన్నాయి. బయటకు మాత్రం అందరూ బాగా నటించారు.

ఎందుకిలా అంటున్నానంటే, మ్యూజిక్ నీ సాంగ్స్ నీ అందరూ ఎంజాయ్ చేసినప్పటికీ, ముస్లిం ఇమామ్ మాత్రం చాలా అసహనంగా కనిపించాడు. ఇస్లాంలో మ్యూజిక్ అనేది ఒక పాపం కదా మరి? ఆయన దాన్నెలా ఎంజాయ్ చేయగలడు? ఖురాన్ ఒప్పుకోదు. పాపం ముళ్ళమీద కూచున్నట్టు కూచున్నాడు.

ఉన్న విభేదాలన్నీ కోర్ లో ఉంచుకుని, పైకి మాత్రం షేక్ హాండ్స్ ఇచ్చుకుంటూ,  నవ్వుతూ స్వీట్లు తింటే, అది ఇంటర్ ఫెయిత్ మీటింగ్ ఎలా అవుతుందో నాకైతే అర్ధం కాలేదు. అది ఇంటర్ ఫెయిత్ కాదు, ఇంటర్ ఫెయిల్ అని నాకనిపించింది.

నా చిన్నపుడు 'టెన్త్ పాస్, ఇంటర్ ఫెయిల్' అనే జోకు బాగా ప్రచారంలో ఉండేది. లేదా ఇంటర్ పాస్, టెంత్ ఫెయిలా? ఏదో ఒకటి సరిగ్గా గుర్తులేదు.

ఆ విద్ధంగా 'ఇంటర్ ఫెయిల్' మీటింగ్ ను ఆస్వాదించి, తలనొప్పితో ఇంటికి తిరిగి వచ్చాను. ఇకమీదట ఇలాంటి మీటింగ్స్ కి వెళ్లకూడదని నిశ్చయించుకున్నాను.

అమెరికాలో మన హిందూ దేవాలయాల కమిటీ మెంబర్లు, హిందూమతాన్ని ప్రచారం చేస్తున్నామన్న భ్రమలలో ఉంటూ,  దానిగురించి పూర్తి నెగటివ్ ఇమేజిని ఇక్కడి వారిలో కలిగిస్తున్నారు. హిందూమతం కోర్ లో ఏముందో అర్ధం చేసుకోకుండా, వాళ్లకు తెలిసిన మూడు ఆచారాలు, నాలుగు పండుగలే హిందూమతం అనే భ్రమలలో ఉన్నారు. హిందూమతమంటే ఏమిటో ముందు వీళ్లకు సరిగ్గా అర్ధమైతే కదా, ఇతరులకు ప్రచారం చేసేది !

హిందూమతాన్ని మొత్తాన్నీ ఒక గొడుగు క్రిందకు తెచ్చి దానిని ఆర్గనైజ్ చేసే ఒక సెంట్రల్ కమిటీ లేకపోవడం మనకున్న అతిపెద్ద సమస్యలలో ఒకటి. అది లేకపోయేటప్పటికీ, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ప్రచారాలు, కామెంట్లు, కార్యక్రమాలు చేస్తున్నారు. అందరూ హిందూమతాన్ని ఉద్ధరిస్తున్నామనే అనుకుంటున్నారు. కానీ ఎంత ఉద్ధరిస్తున్నారు? ఎంత నష్టపరుస్తున్నారు? అనేది మాత్రం వారికి అర్ధం కావడం లేదు. ఎవరికిష్టం వచ్చినల్టు వారు మాట్లాడుతుంటే, ఇతరమతాలకు అదే ఒక అలుసు అవుతోంది. 

ఇదంతా చూస్తుంటే, 1990 లలో జరిగిన ఒక సంఘటన నాకు గుర్తొచ్చింది.

రామకృష్ణ వివేకానంద భావప్రచార పరిషత్ సభ్యులమంటూ కొంతమంది వెళ్లి బేలూర్ మఠంలో అప్పటి అధ్యక్షులైన శ్రీ భూతేశానందస్వామిని దర్శించారు. రామకృష్ణ వివేకానందుల భావాలను సమాజంలో ప్రచారం చేస్తామని  వారు ఆయనతో అన్నారు.

దానికాయన సున్నితంగా ఇలా అన్నారట, 'భావప్రచారానికి ముందు మీలో ఉండవలసింది భావశుద్ధి'.

అంతకు మించి ఆయన ఇంకేమీ అనలేదు. ఈ విషయాన్ని వారిలో ఒకాయనే నాతో అన్నాడు.

మనకే సరియైన అవగాహన లేదు. మనం ఇతరులకు ఏ విధంగా బోధించగలం?