నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

22, డిసెంబర్ 2022, గురువారం

మూడవ అమెరికా యాత్ర - 69 (దీర్ఘరాత్రి ముగుస్తోంది)

అమెరికాలో నేనున్న ప్రాంతం కెనడాకు చాలా దగ్గర. ఇక్కడనుంచి 45 నిముషాలలో కెనడా బార్డర్ దాటి కెనడాలొకి వెళ్ళవచ్చు. నిజానికి, చాలామంది కెనడాలో ఉంటూ, ప్రతిరోజూ డెట్రాయిట్ కి వచ్చి ఉద్యోగాలు చేసుకుని పోతూ ఉంటారు. కొంతమందైతే, కెనడాలో ఉంటూ, డెట్రాయిట్లో షాపింగ్ కని కూడా వస్తూ ఉంటారు. 

ఈరోజు డిసెంబర్ 21. దీనిని వింటర్ సోల్ స్టెయిస్ అంటారని అందరికీ తెలిసిన విషయమే. ఈరోజున అతి దీర్ఘమైన రాత్రి ఉంటుంది. భూమధ్యరేఖ దగ్గరలో పెద్ద తేడా ఉండకపోయినప్పటికీ, ధృవాలకు దగ్గరగా పోయేకొద్దీ ఇది పెరుగుతుంది.

డెట్రాయిట్ లో ఈరోజు రాత్రి అతి దీర్ఘరాత్రి. అంటే, దాదాపు 15 గంటలుంటుంది. పగలేమో 9 గంటలు మాత్రమే ఉంటుంది. ఈరోజు సాయంత్రం 5 కి చీకటి పడింది. రేపు ఉదయం 8 కి తెల్లారుతుంది. అంటే రాత్రి నిడివి 15 గంటలు.

రేపటినుంచీ రాత్రి తగ్గుతూ, పగలు పెరుగుతూ పోతుంది. అంటే, వెలుగు పెరుగుతుంది. చీకటి తగ్గుతుంది. అందుకని, ప్రాచీనకాలంలో ఈరోజును 'ఫెస్టివల్ ఆఫ్ లైట్స్' లేదా 'దీపావళి' అని జరుపుకునేవారు. అన్ని దేశాలలోనూ ఈ పండుగ ఏదో ఒక పేరుతొ ఉంది. ఎందుకంటే ఇది ప్రకృతిలో జరిగే మార్పు కాబట్టి, అన్ని దేశాలలోనూ ఇది ఉంటుంది కాబట్టి, ప్రాచీన దేశాలలోని  ప్రజలు దీనిని చేసుకునేవారు. చలిరోజులు తగ్గిపోతూ, వెలుగు వేడి రేపటినుంచి పెరుగుతాయి కాబట్టి దీనిని ఒక పండుగగా జరుపుకునేవారు.

ఇదంతా క్రీస్తు పూర్వం ఎన్నో వేల ఏళ్ళనుంచీ ఉంది. కానీ, క్రైస్తవం దీనిని కాపీ కొట్టి, ఇదే క్రీస్తు పుట్టినరోజంటూ అబద్దాలు చెప్పడం మొదలుపెట్టి, డిసెంబర్ 25 ను కబ్జా చేసేసింది. రెండువేల ఏళ్ళనుంచీ ఇదే అబద్దాన్ని ఊదరకొడుతూ నేడు ప్రపంచమంతా ఇది నిజమేనేమో అని అనుకునేలాగా చేసేసింది.

నిజానికి డిసెంబర్ 25 న క్రీస్తు పుట్టనేలేదు. నా పరిశోధనా గ్రంధం 'డిసెంబర్ 25 న క్రీస్తు జన్మించాడా?' లో, బైబిల్లో ఉన్న రుజువులతోను,  ఖగోళ సాక్ష్యాలతోను ఈ విషయాన్ని స్పష్టంగా నిరూపించాను. ఆ పుస్తకాన్ని ఉచిత పుస్తకంగా డౌన్లోడ్ కోసం ఉంచాను కూడా.

ఇంకొక నాలుగు రోజులలో క్రిస్మస్ అనే ఒక అబద్దపు పండుగను ప్రపంచమంతా జరుపుకుంటున్నది. అంటే, ప్రపంచానికి సత్యం అక్కర్లేదు. అబద్దమే కావాలి. లక్షసార్లు ఒక అబద్దాన్ని పదేపదే చెబితే అది నిజమౌతుందని తెల్లవాళ్ళకు బాగా తెలుసు. అందుకే క్రిస్మస్ అనే ఈ అబద్దపు పండుగను సృష్టించి ప్రపంచం నెత్తిన రుద్దారు. అంతేకాదు, ఇండియా చరిత్రనంతా మార్చిపారేసి పుస్తకాలు వ్రాయించి దానిని ప్రపంచం నమ్మేలాగా చేశారు. కానీ సత్యాన్ని ఎక్కువకాలం దాచలేరు. అది ఎవరికీ సాధ్యం కాదు.

నిజానికి ఈ సోల్ స్టెస్ లనేవి, ప్రకృతిలో కలిగే మార్పులు. అందులో డిసెంబర్లో వచ్చే ఈ మార్పుకు సూచనగా 'ఫెస్టివల్ ఆఫ్ లైట్స్' లేదా దీపావళిని ఈరోజున జరుపుకోవాలి. ప్రాచీనకాలంలో ప్రపంచమంతా దీనిని జరుపుకునేది కూడా. క్రైస్తవం పుణ్యమాని నిజమైన పండుగ మాయమై, అబద్దపు వేడుక చలామణీలోకి వచ్చింది.

ఈ మార్పును స్వాగతించే రాత్రి నేడే. అందుకే ఇది దీర్ఘరాత్రి. ఆరునెలలుగా తగ్గుతున్న పగలు రేపటినుంచి పెరగడం మొదలుపెడుతుంది. చీకటి తగ్గడం, వెలుగు పెరగడం రేపటినుంచి మొదలౌతుంది.

వెలుగుకు స్వాగతం చెబుదాం. అబద్దాలను అబద్దాలుగా గుర్తిద్దాం.

మీకు సత్యం కావాలో, అసత్యం కావాలో మీరే తేల్చుకోండి.

మీరు సత్యం వైపున్నారో, అసత్యం వైపే ఎప్పటికీ ఉంటారో మీరే తేల్చుకోండి.