Pages - Menu

Pages

12, జనవరి 2023, గురువారం

మూడవ అమెరికా యాత్ర - 81 (తిరుమల ట్రిప్ రద్దు చేసుకున్నాం)

రెండువారాలలో ఇండియాకు ప్రయాణం.

ఇండియా వెళ్ళాక, ఆశ్రమం పనులు, పంచవటి పనులు ముమ్మరంగా మొదలౌతాయి. దానికి ముందుగా ఒక పదిమంది శిష్యులతో కలసి ముందు తిరుపతి వెళ్లి, వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని, ఆ తరువాత ఒంగోలుకు వచ్చి, ఆశ్రమం పనులు మొదలుపెడదామని అనుకున్నాం. కానీ, తిరుమలలో కాటేజీలు, దర్శనం టికెట్లు, అన్నింటికీ రేట్లు పెంచేయడం, హుండీ డబ్బులను క్రైస్తవమిషనరీలకు, చర్చిలకు మళ్లిస్తున్నారన్న వార్తలు వినవస్తున్న క్రమంలో, పొరపాటున కూడా తిరుమల వెళ్లకూడదని నిశ్చయించుకుని, మా నిర్ణయాన్ని మార్చుకున్నాం.

ఏ దేవస్థానానికైనా మనమిస్తున్న డబ్బులలో ప్రతి రూపాయీ హిందూమతానికి మాత్రమే ఉపయోగపడాలి గాని, చర్చిలకు, హజ్ యాత్ర సబ్సిడీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు. ఆ విధంగా తిరుమల ఎడ్మినిస్ట్రేషన్ సంస్కరింపబడేటంతవరకూ తిరుమలకు వెళ్లకూడదని నిశ్చయించుకుని, నేనూ నాతోపాటు ఒక పదిమంది శిష్యులు, తిరుమల ట్రిప్ ను క్యాన్సిల్ చేసుకున్నాము. దానిబదులు ఇక్కడ నోవై లో ఉన్న వెంకటేశ్వరస్వామి దేవాలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుని తిరిగి వచ్చాం.

వీకెండ్ కాదు కాబట్టి, ఈరోజు ఇక్కడ దేవాలయమంతా ఖాళీగా ఉంది. జనం లేరు. తొక్కిడి, హడావుడి లేవు. ప్రశాంతంగా కావలసినంతసేపు కూర్చుని జపధ్యానములు చేసుకుని, స్వామిని ప్రార్ధించి ఇంటికి తిరిగి వచ్చాం.

ఈ సందర్భంగా, నా శిష్యులందరికీ ఒక ఆదేశాన్నిస్తున్నాను. షిరిడీకి ఎట్టి పరిస్థితులలోనూ వెళ్ళకండి. ఎందుకంటే, ముస్లింఫకీర్ అయిన షిరిడీసాయిబాబాను మనం ఆరాధించవలసిన అగత్యం ఎంతమాత్రమూ లేదు. అలా ఆరాధించడం హిందూమతానికి మనం చేస్తున్న దారుణమైన అపచారమని నేను నమ్ముతాను. నా శిష్యులు కూడా దీనిని ఖచ్చితంగా పాటించాలి. 

అదేవిధంగా, మళ్ళీ నేను చెప్పేటంతవరకూ తిరుమలకు కూడా వెళ్ళకండి. మీ ఇంటిలోనే స్వామిని ప్రార్ధించండి. లేదా మీ దగ్గరలో ఉన్న ప్రయివేట్ యాజమాన్యం నడుపుతున్న హిందూ దేవాలయానికి వెళ్ళండి. నా శిష్యులైనవారు ఈ ఆదేశాలను ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. గమనించండి.

నోవై వెంకటేశ్వర ఆలయం ఫోటోలను బయటనుండి ఇక్కడ చూడండి.