నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

18, ఫిబ్రవరి 2023, శనివారం

స్పిరిట్యువల్ అస్ట్రాలజీ

నిజమైన  ఆధ్యాత్మిక అన్వేషణలో ఉన్నవాళ్లు, వాళ్ళ జీవితంలో మంచిదశలు జరుగుతుంటే, నన్ను వచ్చి కలుస్తూ ఉంటారు. అదేవిధంగా, నిన్న ఒకమ్మాయి హైద్రాబాద్ లో నేనుంటున్న అడ్రస్ వెదుక్కుంటూ వచ్చి, చాలాసేపు మాట్లాడి, తనకున్న సందేహాలను అడిగి సమాధానాలను తెలుసుకుంది. నా పుస్తకాలను కొన్నింటిని చదివానని చెప్పింది.

ఆ సంభాషణ క్లుప్తంగా మీ కోసం.

1. రెమెడీలతో కర్మ తీరుతుందా? మరైతే, హోమాలు లాంటివి చేయించిన తర్వాత కూడా సమస్యలు తీరవెందుకు? 

జవాబు: తీరుతుంది. అన్నిటికీ హోమాలు అవసరం ఉండదు. రోగాన్ని బట్టి మందు వెయ్యాలి. కమర్షియల్ జ్యోతిష్కులు చేసే రెమెడీలు పనిచేయవు. అదొక బిజినెస్ అంతే. సమస్యకు రెమెడీ సరిగా సరిపోవాలి. చేయించేవాడు కరెక్ట్ గా ఉండాలి. చేసేవాడు కూడా కరెక్ట్ గా ఉండాలి. అప్పుడే రెమెడీ పనిచేస్తుంది.

2. మరైతే, పెద్దపెద్దవాళ్లు కూడా హోమాలు అవీ ఎందుకు చేయించుకుంటున్నారు?

జవాబు: నువ్వనుకునే పెద్దవాళ్ళందరూ నా దృష్టిలో పెద్దవాళ్ళు కారు. బ్లాక్ మనీ గాళ్ళే అంతంత ఖర్చులు పెట్టి అవన్నీ చేయిస్తారు. కష్టపడి నిజాయితీగా సంపాదించినవాడెవడూ అలాంటి జ్యోతిష్కుల వెంట పడడు. అలాంటి రెమెడీలు చేయించుకోడు.

3. పనులు కాకపోతే, మళ్ళీ మళ్ళీ రెమెడీలు ఎందుకు చేయించుకుంటారు?

జవాబు: ఈ రెమెడీలు చేయించుకోనివాడికి పనులు కావడం లేదా? వాళ్ళకెలా అవుతున్నాయి మరి? వీళ్ళ భయానికి, నమ్మకానికి జ్యోతిష్కులను మేపుతున్నారు. రెమెడీలని చేస్తున్నారు. అంతే.

4. మరి మీరెలాంటి రెమెడీలు చెబుతారు?

జవాబు: ఇలాంటి రెమెడీలు మాత్రం చెప్పను. ఇవన్నీ, కేన్సర్ లోపలుంచుకుని పైకి అమృతాంజనం పూయడంలాంటివి. గుళ్ళు, పూజలు, హోమాలు, ఇవి అసలైన రెమెడీలు కావు. ముందు నీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. అదే నేను చేప్పే రెమెడీ.

5. అసలు మీరెందుకు ఆస్ట్రాలజీ నేర్పుతున్నారు?

జవాబు: సరైన ఆస్ట్రాలజీ ఏమిటో తెలుసుకోవాలనే జిజ్ఞాసువులకు దానిని నేర్పించడమే నా ఉద్దేశ్యం. నిజం నోరువిప్పకపోతే అబద్దం రాజ్యమేలుతుంది. అలా కాకూడదనే నేను చెబుతున్నాను.

6. షష్ట్యంశ చక్రాన్ని చూస్తే గతజన్మ తెలుస్తుందా?

జవాబు: ఆ చక్రానికి గతజన్మకి సంబంధం లేదు. ఉందని కొంతమంది తెలిసీ తెలియని జ్యోతిష్కులు, వాళ్ళ అనుచరులు అంటున్నారు. అసలు విషయమెంటో వాళ్లకు తెలీదు.

7. మీరు ఏ ఏ అంశ చక్రాలు చూస్తారు?

జవాబు: రాశి-నవాంశలను దాటి సాధారణంగా పైకి పోను. పాతకాలం నుంచీ సాంప్రదాయ జ్యోతిష్కులు రాశి, నవాంశలు మాత్రమే చూచేవారు. దానితోనే అన్నీ తెలుస్తాయి. నేనూ అంతే. ఎప్పుడో ఒకసారి మాత్రం అవసరమైన మిగతా అంశచక్రాలు చూస్తాను.

8. రాశిచక్రంతోనే గతజన్మ కూడా తెలుస్తుందా?

జవాబు: తెలుస్తుంది. అనుభవం మీద అన్నీ తెలుస్తాయి.

9. నేటి జ్యోతిష్కులు పిచ్చిపిచ్చి రెమెడీలు చెబుతూ డబ్బు బాగా సంపాదిస్తున్నారు కదా?  నాకు తెలిసిన ఒక పూజారి గతంలో పేదవాడుగా ఉండేవాడు. ఇప్పుడు హోమాలు చేయిస్తూ రెమెడీలు చేయిస్తూ లక్షలు పోగేశాడు. బాగా సంపాదిస్తున్నాడు. అలాంటివాళ్ళు కర్మను పోగేసుకోవడం లేదా?

జవాబు: వేసుకుంటున్నారు. వాళ్ళ జాతకాలలో మంచిదశలు నడుస్తున్నపుడు అది తెలీదు. దశలు మారినప్పుడు వాళ్లకూ వాతలు పడతాయి. అప్పుడు వాళ్లకు తెలుస్తుంది. అలాంటి వాళ్ళు వాళ్ళ జీవితంలో చాలా ఘోరమైన దెబ్బలు తింటారు.

10. అది ఈ జన్మలోనే తింటారా? వచ్చే జన్మకు పోస్ట్ ఫోన్ అవుతుందా?

జవాబు: రెండూ ఉంటాయి. ఇంకా ఎన్నో రకాలుగా ఉంటాయి. కర్మగతిని తెలుసుకోవాలంటే యోగదృష్టి ఉండాలి. లేకుంటే అర్ధం కాదు.

11. మీ ఉద్దేశ్యంలో ఒక జ్యోతిష్కుడు ఎలా బ్రతకాలి?

జవాబు: ఒక ఋషి లాగా బ్రతకాలి. సంసారం పైన, డబ్బుపైన ఆశ లేకుండా, ఇంట్లో లగ్జరీ ఐటెమ్స్ లేకుండా, టీవీ చూడకుండా, మొబైల్ వాడకుండా, ఒక్కపూట  తింటూ, నేలపైన పడుకుంటూ, సాధన చేసేవాడై ఉండాలి.

12. జ్యోతిష్కునికి మంత్రసాధన అవసరమా? ఉత్త లెక్కలతో జ్యోతిష్యం చెప్పలేమా?

జవాబు: మంత్రసాధన అవసరం. ఉత్త లెక్కలతో జ్యోతిష్యం అర్ధం కాదు. దానికి ఇంట్యూషన్ ఉండాలి. అది సాధనతోనే వస్తుంది.

13. ఇవన్నీ ఎవరు చేయగలుగుతారు?

జవాబు: చేయగలిగినవాడే చేస్తాడు. అందరూ చెయ్యలేరు.

14. ఇవన్నీ మీరు నేర్పిస్తారా?

జవాబు: అందరికీ నేర్పను. నాకు నచ్చినవాళ్లకు మాత్రమే నేర్పిస్తాను. ఆ నచ్చడమనేది వాళ్ళ వ్యక్తిత్వం పైన ఆధారపడి ఉంటుంది. నా ఇన్నర్ సర్కిల్ శిష్యులందరూ అలాంటివాళ్లే.

15. వీటిని మీ దగ్గర నేర్చుకోవాలంటే ఏం చెయ్యాలి?

జవాబు: నా శిష్యునిగా మారి, నా దారిలో నడవాలి. నన్ను అనుసరించాలి. అంటే, నేను నడచిన సాధనామార్గంలో నడవడానికి సిద్ధపడాలి. దానినే 'పంచవటి మార్గం' అని పిలుస్తున్నాం.

16. పుణ్యక్షేత్రాలు దర్శించడమంటే మీకెందుకు అయిష్టం?

జవాబు: అదేమీ లేదు. అక్కడికి సరిగ్గా వెళ్ళాలి. పిక్నిక్ లాగా పుణ్యక్షేత్రాలకు పోవడం నేనిష్టపడను. దాన్నొక సాధనగా చెయ్యాలి. వచ్చేనెలనుంచీ మేమంతా అనేక పుణ్యక్షేత్రాలు దర్శించబోతున్నాం. అయితే, అందరిలాగా లేకిగా వాటికి పోకుండా, మాదైన యోగవిధానంలో ఆ యాత్రలు చేస్తాం.

17. అరుణాచలంలో, కాశీలో ఎంతో ప్రశాంతత నాకు తెలియవచ్చింది. అది నిజమేనా?

జవాబు: అవును ఉంటుంది. అక్కడే కాదు. చాలా పుణ్యక్షేత్రాలలో ఆ ప్రశాంతత ఉంటుంది. దానిని ఫీలయ్యే స్థితిలో మనం ఉండాలి. 

18. ఇప్పుడు ఏ పుణ్యక్షేత్రంలో చూసినా విపరీతమైన జనం, గోల ఉంటున్నాయి కదా ! ఆ గోలలో ప్రశాంతతను  ఎలా ఫీలవ్వగలం? దానికోసం ఏం చెయ్యాలి?

జవాబు: ఆ జనానికి అతీతంగా నీ మనసును ఉంచుకోవాలి. వాళ్లలో ఉన్నా, వాళ్ళను చూడకుండా ఉండగలగాలి. లేదా పండుగరోజులలో అలాంటి క్షేత్రాలకు పోకుండా ఉండాలి. నీ ఇంట్లో నువ్వుంటూ సాధన చెయ్యడం ది బెస్ట్.

19. ఆస్ట్రాలజీలో మీ విధానానికి ఏం పేరును పెడతారు?

జవాబు: స్పిరిట్యువల్ ఆస్ట్రాలజీ అని దాన్ని పిలవవచ్చు.

20. దానిని అనుసరిస్తే ఏమౌతుంది?

జవాబు: నా మార్గంలో సాధన చేస్తే ఏమౌతుందో అదే అవుతుంది. కర్మ క్షాళనమై పోతుంది. జీవనసాఫల్యత లభిస్తుంది.

21. పనులు కావా?

జవాబు: పనులు అయినా, కాకపోయినా పట్టించుకోకుండా ఉండగలిగే స్థితిని నువ్వు  అందుకుంటావు. ఎవడి జీవితమైనా, అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా ఎవడికీ జరగవు. నువ్వు రెమెడీలు చేసినా అంతే, చేయకపోయినా అంతే, ఈ విషయం అర్ధమైతే నీకు జ్యోతిష్యం అవసరం లేదు. 

22. ఈ మాత్రం దానికి జ్యోతిష్యం నేర్చుకోవడమెందుకు?

జవాబు: అవును. ఒద్దనే నేనూ చెబుతున్నాను. నేర్చుకోమని నేనేమీ బలవంతం చేయడం లేదే?

23. ఒక జాతకాన్ని మనం చూస్తే దాని కర్మ మనకు అంటుకుంటుందా?

జవాబు: చూస్తే, కొద్దిగా అంటుకుంటుంది. రెమెడీలు చెప్పావంటే బాగా అంటుకుంటుంది. ఆ కర్మ నిన్ను తప్పకుండా పట్టి పీడిస్తుంది.

24. రెమెడీలు చెప్పకుండా జ్యోతిష్యం నేర్చుకోకూడదా?

జవాబు: సరదాగా నేర్చుకోవచ్చు. కానీ ఎందుకు? ఇన్నేళ్లు కష్టపడి ఇలాంటి సరదాలెందుకు? అక్కల్ట్ తో ఆటలు పనికిరావు. నీకు జ్యోతిష్యం వస్తే, ముందు నువ్వే ఊరుకోలేవు. ప్రతివాడి జాతకమూ చూస్తావు. వాళ్ళు రెమెడీలు అడుగుతారు. నువ్వు చెబుతావు. వాళ్ళ బురదను నువ్వు పూసుకుంటావు. కడుక్కోలేక అవస్థపడతావు. ఇంతే జరిగేది. 

25. మీరు జీవితంలో ఎంతో దూరం వచ్చారు కదా? ఇన్నాళ్ల మీ నడక మీకేమనిపిస్తోంది?

జవాబు: ఏమీ అనిపించడం లేదు. మామూలుగా ఉంది.

26. మీ దగ్గర జ్యోతిష్యం నేర్చుకోవాలంటే ఏం చెయ్యాలి?

జవాబు: ఇంత చెప్పినా, ఇంకా దానిని నేర్చుకోవాలని ఉందా? అయితే, త్వరలో మా ఆశ్రమంలో జరగబోయే రిట్రీట్స్ కు వచ్చి నేర్చుకో.

27. జ్యోతిష్కులకు మీరిచ్చే సలహా?

జవాబు: ముందు మీది మీరు కడుక్కోండి. తర్వాత లోకులది కడగవచ్చు.

ఈ విధంగా తన సందేహాలను తీర్చుకుని, సెలవు తీసుకుని ఆమె వెళ్ళిపోయింది.