నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

19, ఫిబ్రవరి 2023, ఆదివారం

శివరాత్రా? ఎప్పుడు?

ఇవాళ పొద్దున్నే టిఫిన్ తెద్దామని బయటకెళ్ళాను.

వాళ్ళప్పుడే షాపు తెరుస్తున్నారు.

'కొత్తబిచ్చగాడు పొద్దెరగడు' అన్నట్లు వాళ్ళకంటే ముందు అక్కడికెళ్లిన నన్ను చూసి నవ్వారు.

'కొద్దిసేపు కూచుంటాలే, వాయి వెయ్యండి' అని షాపు బయట చప్టా మీద కూచున్నాను.

ఇంతలో టిఫిన్ సెంటర్ దగ్గర ఒక శిష్యురాలు ఎదురైంది.

టిఫిన్ తయారయ్యేలోపల, ఆ మాటా ఈ మాటా మాట్లాడుకుంటూ రోడ్డుమీద వెయిట్ చేశాం.

నా ముఖం చూస్తే ఏమనిపించిందో, 'నిన్న రాత్రి నిద్రపోలేదా?' అంది.

'లేదు' అన్నాను.

'అవున్లే. శివరాత్రి  కదా?' అన్నది తను.

ఆశ్చర్యం వేసింది.

'నిన్న శివరాత్రా?' అడిగాను.

'అవును' అంది.

'అరే ! మర్చేపోయాను' అన్నాను.

ఆ సంగతి నిజంగా నాకు గుర్తే లేదు. కానీ మూడు రోజులనుంచీ రాత్రిళ్ళు నాకు నిద్ర లేదు.

మా మాటలు వింటున్న కొంతమంది ఎగాదిగా చూశారు, 'వీడెవడురా బాబు?' అన్నట్లు.

టిఫిన్ తీసుకుని, వాళ్ళింటికి తనెళ్ళిపోయింది. నేను మా ఇంటి దారి పట్టాను.

దారంతా నవ్వొస్తూనే ఉంది.

'పర్వదినాలను మనం జరుపుకోకూడదు. అవి మనచేత జరిపించబడాలి' అని నేనెప్పుడూ చెప్పే మాట ఇలా మళ్ళీ నిజమైంది.

లోకమంతా నిన్న ఒక్క రాత్రి మాత్రం అభిషేకాలు పూజలు చేస్తుంది. ఇవాళ్టినుంచి మళ్ళీ శివరాత్రి వరకూ శివుడు ఎవరికీ గుర్తురాడు, అవసరం పడితే తప్ప ! 

శివుడిని మర్చిపోయి, శివరాత్రి గుర్తుండటం కంటే, శివుడిలో ఉంటూ శివరాత్రిని మర్చిపోవడం మంచిదే కదూ !