Pages - Menu

Pages

14, మార్చి 2023, మంగళవారం

అరుణాచల యాత్ర - 4 (గిరి ప్రదక్షిణం ప్లాన్ చేశారా?)

చలంగారి సమాధి రోడ్డుపక్కన పడి ఉంది.

ఒకనాడు ఆంధ్రదేశాన్ని గగ్గోలు పెట్టించిన గొప్ప రచయిత, స్త్రీల స్వేచ్ఛ కోసం తపించిన గొప్ప మానవతా వాది, సౌందర్యపిపాసి అయిన గుడిపాటి వెంకటాచలం నేడు పరాయి రాష్ట్రంలో రోడ్డుపక్కన దుమ్ములో దిక్కులేకుండా పడి ఉన్నాడు.

చలం విలువను తెలుగుప్రజలు గుర్తించలేదు. నేటి తరానికి చలమెవరో తెలీను కూడా తెలీదు. ఇది తెలుగుప్రజల దురదృష్టం.

తెలుగుప్రజలు డబ్బుకు, ఆస్తులకు ఇచ్చిన విలువ ఆదర్శాలకు ఆధ్యాత్మికతకు ఇవ్వరు. అది వాళ్ళ జీన్స్ లోనే లేదని నా అనుమానం.

చలంగారి జీవితాన్ని చదివితే, సాంప్రదాయ బ్రాహ్మణబాలుడిగా మొదలై, బ్రహ్మసమాజపు ఆదర్శాలతో పెరిగి, స్త్రీవాదిగా, మానవతావాదిగా, సౌందర్యారాధకుడిగా ఎదిగి, ప్రపంచంలోని అసమానతలు, దుర్మార్గాలు ఎందుకున్నాయి? అవి అంతం కావా? అంటూ తపించి, సమాధానాలు దొరకక, చివరకు రమణమహర్షి నీడలో సేదతీరిన ఒక గొప్ప మనిషి దర్శనమిస్తాడు. సౌరిస్ వంటి యోగినికి తండ్రి అయ్యే అర్హతను బట్టి చలం జీన్స్ ఎలాంటివో అర్ధం చేసుకోవచ్చు. చలంగారిని చూడటానికి జిల్లెళ్ళమూడి అమ్మగారు వచ్చారు. UG గారు తరచుగా తిరువన్నామలై వచ్చేవారు. చలంలో ఏమీ లేకపోతే అలాంటి మహనీయులు ఇంతదూరం ఎందుకొస్తారు?

అలాంటి చలంగారి సమాధి తమిళనాడులో ఇలా పడి ఉంది. కనీసం బెంగాలీలను చూసైనా తెలుగువాళ్లు బుద్ధి తెచ్చుకోవాలి. టాగోర్ ని గాని, జతీంద్రమోహన్ని గాని, సత్యేంద్రనాథ్ ని గాని, కాజీ నజరుల్ ఇస్లాంని గాని వాళ్ళు ఎలా గౌరవిస్తున్నారు? మన రచయితలను మనం ఎలా గౌరవిస్తున్నాం?

అభిరుచి లేని చవకబారు మనస్తత్వాలలో తెలుగుజాతి ముందుంటుందని నా ఇంకొక పెద్ద అనుమానం. వాళ్లకు తెలిసిన 'కళ', కుప్పిగంతులు, కప్పగెంతులు వేసే సినిమాలేగా మరి ! అంతకంటే గొప్ప అభిరుచి వాళ్లకెక్కడేడిసింది గనుక?

పెనమలూరు రోడ్డు పక్కన దుమ్ములో కూర్చుని ఉండే మాల పిచ్చమ్మగారిని చలం తన విజయవాడ రోజులలో తరచుగా సందర్శించేవాడు. ఆమె సమాధి విజయవాడలో రోడ్డుపక్కన ఉంది. చలం సమాధి అరుణాచలంలో రోడ్డు పక్కన ఉంది. ఏంటీ పోలిక?

మాలపిచ్చమ్మ గారి సమాధిని యూ ట్యూబర్లు ఇంకా సొమ్ము చేసుకోలేదా? అదామె అదృష్టం !

కొద్దిసేపు మౌనంగా అక్కడున్న తర్వాత వెనక్కు బయల్దేరాం.

'గిరిప్రదక్షిణం ప్లాన్ చేశారా?' అడిగాడు చంద్రశేఖర్.

'ఇప్పుడు చేస్తున్నది అది కాదా?' అన్నాను.

'అలాకాదు, అందరూ చేసేటట్లు' అన్నాడు.

'అందరూ చేసేదానిలో ఔన్నత్యం కనిపిస్తే అలాగే చేసేవాణ్ణి' అన్నాను.

చంద్రశేఖర్ తన రూమ్ కి వెళ్ళిపోయాడు. మేము ఆంధ్రాశ్రమం దారి పట్టాము.