Pages - Menu

Pages

19, మార్చి 2023, ఆదివారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 49 (ధ్వనికాలుష్యంతో నరకంగా మారుతున్న జిల్లెళ్ళమూడి)

జిల్లెళ్ళమూడికి వచ్చిన ఈ వారంలో నేను గమనించిన మరొక విషయం ఏమంటే, ఇంత చిన్న పల్లెలో  కూడా భయంకరమైన శబ్దకాలుష్యం ఉండటం.

నా సర్వీసులో నేనెన్నో సిటీలు చూశాను. మేజర్ రైల్వే స్టేషన్లు అన్నీ చూశాను. ఢిల్లీ, ముంబాయి, కలకత్తా, మద్రాస్ మొదలైన సిటీలలో భయంకరమైన జనసాంద్రత ఉన్న ప్రదేశాలు చూశాను. అక్కడ శబ్దకాలుష్యం ఉండటం సహజమే. కానీ పట్టుమని వెయ్యిమంది జనాభా లేని జిల్లెళ్ళమూడిలో, విపరీతమైన శబ్దకాలుష్యం ఉండటాన్ని ఇప్పుడే గమనిస్తున్నాను.

ఢిల్లీ కన్నాట్ ప్లేస్ కంటే, కలకత్తా హౌరాబ్రిడ్జి కంటే ఎక్కువ ధ్వనికాలుష్యం జిల్లెళ్ళమూడి కుగ్రామంలో ప్రస్తుతం ఉంది. నమ్మలేరా? ఇది నిజం. వినండి మరి.

జిల్లెళ్ళమూడి జనాభా 1000 మంది మాత్రమే. ఈ పల్లెలో కేవలం ఏడు చిన్నపాటి వీధులున్నాయి అంతే. ఇక్కడ డ్రైనేజి వ్యవస్థ లేదు. ఫోన్ కనెక్టివిటీ సరిగ్గా లేదు. బస్సుసౌకర్యం లేదు. ఇంటర్నెట్ గురించి  చెప్పే పనే లేదు. గట్టిగా వర్షాలు పడితే పొలాలమధ్య నీటిలో చిక్కుకుపోతుంది ఈ ఊరు. 

ఇలాంటి కుగ్రామంలో నాలుగు గుళ్ళున్నాయి. మూడు చర్చీలున్నాయి. ఒక మసీదుంది. అన్నింటికీ మైకులున్నాయి. ఒక్కో చర్చికి నాలుగు దిక్కులకూ నాలుగు మైకులున్నాయి. మసీదుకు కూడా అంతే. వీటి మధ్యలో జిల్లెళ్ళమూడి అమ్మగారి సమాధి ఉన్న ఆశ్రమం ఉన్నది.

మూడు చర్చిలలో ఒక చర్చి ఈమధ్యన బాగా డెవలప్ అవుతున్నది. బయటనుంచి వచ్చే పాస్టర్ల కోసం ఈ మధ్యనే ఒక గెస్ట్ హౌస్ కూడా దాని పక్కనే కట్టారు. మిగతా రెండూ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయి. డెవలప్ అయిన చర్చికున్న మైకులనుంచి  గంటగంటకూ టైం చెబుతూ, గంటలు కొడుతూ, బైబుల్ వాక్యాలు వినిపించే వ్యవస్థ ఒకటి నడుస్తున్నది. అది ఆటోమేటిక్ వ్యవస్థ. ఈ మైకులు, చుట్టూ ఉన్న నాలుగు ఊర్లకు వినిపించేటంత సౌండ్ తో ఉంటాయి. ఉదయం 5 కు మొదలయ్యే ఈ మైకు రాత్రి 10 వరకూ మోగుతూనే ఉంటుంది. ఊరు దద్దరిల్లిపోతూ ఉంటుంది.

ఇక మసీదు విషయం. మక్కామసీదులో కూడా ఇంత ఠంఛనుగా నమాజ్ చేస్తారో లేదోగాని,  ఈ ఊరి మసీదులో మాత్రం రోజుకు అయిదుసార్లు పక్కాగా నమాజ్ చేస్తారు. అదికూడా పక్క ఊళ్లకు వినిపించేటంత పెద్ద సౌండుతో !

ఇవిగాక, మూడు కులగుళ్ళున్నాయి. ఏ కులానికి వాళ్ళ గుడి ఉంది. వీటిల్లో సినిమా భక్తిపాటలు మారుమోగుతూ ఉంటాయి.

ఇవన్నీ ఆగినప్పుడు అమ్మగారి ఆలయంలో అఖండ నామస్మరణ మైకు 24X7 పెద్ద సౌండుతో నడుస్తూ ఉంటుంది.

వెరసి ఉదయం అయిదునుంచి రాత్రి పదివరకూ ఈ ఊరిలో ఎవరికీ ప్రశాంతత అనేది లేకుండా ఉన్నది. వీకెండ్ వచ్చిందంటే, బయటనుంచి క్రైస్తవపాస్టర్లు దిగుతున్నారు. రోజంతా బైబిలు బోధలతో మైకులు దద్దరిల్లుతున్నాయి. పైగా, ఇక్కడ మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీ అని ఒక కాలేజీ  ఉంది. అందులో దాదాపు 500 మంది విద్యార్థినీ విద్యార్థులు చదువుకుంటున్నారు. చర్చ్ మైకులలో ఒకటి కాలేజీవైపు, మరొకటి జిల్లెళ్ళమూడి అమ్మగారి ఆలయం వైపు గురిపెట్టబడి ఉన్నాయి. కాలేజీ క్లాసులలో పాఠాలకంటే, బైబిలు వాక్యాలే విద్యార్థులకు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. వాళ్ళ చదువు ఎలా సాగుతుందో దేవుడికే ఎరుక. ఈ మైకుల గోల వల్ల,  జిల్లెళ్ళమూడి అమ్మగారి ఆశ్రమంలో ధ్యానం చేసుకోవడం భక్తులకు అసాధ్యంగా మారింది. 

చర్చిలు, మసీదు, రెండూ కలసికట్టుగా అమ్మగారి ఆలయాన్ని టార్గెట్ చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. వీటికి వెనుక, బయటవాళ్ళ నుంచి ఫండింగ్ ఉండటం సుస్పష్టం.

'గట్టిగా వాళ్లకు చెప్పకూడదా?' అని నేను కొందరిని అడిగాను.

'చెప్పాము, వాళ్ళు వినడం లేదు' అని వీళ్లన్నారు.

'కంప్లెయింట్ ఇవ్వండి' అన్నాను.

ఎవరికివారే, 'మనకెందుకు?' అన్నట్లు మాట్లాడారు.

వాళ్ళకు చెప్పాలంటే ముందు వీళ్ళ మైక్ ఆపాలి కదా? వాళ్ళు తిరిగి కంప్లెయింట్ ఇస్తే వీళ్ళేం చేస్తారు? ఎదుటివారికి చెప్పాలంటే, ముందు మనం కరెక్ట్ గా ఉండాలి కదా?

ఆశ్రమకమిటీ వారు భక్తుల  అసౌకర్యాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఒకళ్ళని చూసి మరొకరు మైకులు పెడుతూ అందరూ కలిసి ప్రశాంతమైన పల్లె జీవితాన్ని దుర్భరం చేస్తున్నారు 

ఇక్కడే స్థిరపడి ఉండాలని వచ్చిన రిటైర్డ్ భక్తులు కొంతమంది, ఈ ధ్వని కాలుష్యానికి భయపడి, కొనుక్కున్న ఇళ్లను అమ్మకానికి పెట్టేసి హైద్రాబాద్ మొదలైన ఊర్లకు వెళ్లిపోయారని నాకు కొందరు చెప్పారు.

ఒకటి రెండు SC క్రైస్తవ కుటుంబాలు కావాలని చేస్తున్న అరాచకంగా దీనిని కొందరు భక్తులు నాకు వర్ణించి చెప్పారు. ఈ దేశసంస్కృతికి వ్యతిరేకంగా తమ భావజాలాన్ని పెంచుకోవడం, అబద్ధాలు నూరిపోసే పరాయిమతాలకు దగ్గరవడం, హిందూమతానికి వ్యతిరేకంగా పనిచేయడం వాళ్ళలో కొత్తేముంది? అని నాకనిపించింది.

హిందూ, క్రైస్తవ, ఇస్లాం ఉన్మాదాలు తలకెక్కితే, ప్రశాంతంగా జీవిస్తున్న ఒక కుగ్రామంలో ఎలాంటి చిచ్చు రేగుతుందో, అక్కడి నిశ్శబ్దం ఎలా  మైకుల నరకంగా మారుతుందో అనడానికి నేటి జిల్లెళ్ళమూడి ఒక ఉదాహరణ !

మితిమీరిన సౌండ్ పొల్యూషన్ వల్ల హార్ట్ దెబ్బ తింటుందని, హార్ట్  ఎటాక్స్ వస్తాయని ఈ పల్లెటూరి గొర్రెలకు ఎవరు చెబితే అర్థమవుతుంది? రోగాలకు కులం మతం తెలీవు. అవి ఎవరికైనా వస్తాయి.

ఈ సౌండ్ పొల్యూషన్ వల్ల,  ప్రజలుగాని భక్తులుగాని ఇక్కడ ఉండలేని దుర్భరపరిస్థితి త్వరలో తలెత్తేలా ఉంది.

'మీలో చైతన్యం రానంతవరకూ మీరు బాధపడక తప్పదు' అని భక్తులతో చెప్పాను.

'మీరు పూనుకోవచ్చు కదా?' అన్నట్టుగా  వారి ఉద్దేశ్యం ధ్వనించింది.

'నేను ఇక్కడ ఉండేవాణ్ణి కాను. నాలుగురోజులు ఉండి  నా దారిన  మా ఆశ్రమానికి వెళ్ళిపోతాను.  పర్మనెంట్ గా ఉండేది మీరు. మీరే తేల్చుకోవాలి. నన్నడిగితే ముందు  మీ ఆలయ మైక్ ఆపమంటాను. అందరి మైకులూ తీసేయడం ఒక్కటే దీనికి పరిష్కారం' అని చెప్పాను.

అసలు, భక్తికీ మైకుకీ సంబంధమేంటో?

వాళ్ళెవరూ దీనిని అమలు చేసేటట్లు నాకు కనిపించలేదు. ఈ సమస్యకు పరిష్కారమూ కనిపించడం లేదు. లా అండ్ ఆర్డర్ అధమస్థాయిలో ఉన్న ఇండియాలో ఇంతకంటే ఏం ఆశించగలం?

ఆలయాల మీదా, మహాత్ముల మీదా వీడియోలు తీసి డబ్బు చేసుకునే యూట్యూబు చానెళ్లు ఇలాంటి అసలైన సమస్యల పైన దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది.

ఒక భక్తుడు నాతో ఇలా అన్నాడు, 'జిల్లెళ్ళమూడి భారతదేశానికి నమూనా' అని.

'నిజమే. రాజుకుంటున్న కులమతద్వేషాల లోనా?' అని నేనన్నాను.