నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

14, మార్చి 2023, మంగళవారం

అరుణాచల యాత్ర - 7 (కాషాయం ఒక భ్రమ)

కాషాయం కట్టినా
కషాయం వదలకపోతే
విషాదంతో ముగిసిపోవడం
వీరసన్యాసుల జీవితలక్షణం

బ్రహ్మచర్య దీక్షలూ
సన్యాసపు టెక్కులూ
అహానికి ఆనవాళ్ళైతే
ఆ జీవితం ఉభయభ్రష్టత్వం

తెల్లగోచీ కట్టుకున్న మహర్షి చుట్టూ
కాషాయాలు కట్టిన సన్యాసులు
పిల్లవాడైన దక్షిణామూర్తి చుట్టూ
వినమ్రులై కూచున్న వృద్ధఋషులు

ధ్యానంలో ఓనమాలు తెలియకుండా
దానిపై గ్రంధాలు వ్రాస్తున్న పిల్లసన్నాసులు
సన్యాస సంస్థను వదిలేసి బయటకొచ్చి
సంసారం సాగిస్తున్న పిచ్చిసన్యాసులు

సన్యాసం పుచ్చుకోవడం కాదు
సన్యాసివి కావాలని
మహర్షి చెప్పిన మాట
ఎంత సత్యం?

సంసారాన్ని నువ్వు వదలడం కాదు
సంసారం నిన్ను వదలాలని
రామకృష్ణులు చెప్పినమాట
అంతే సత్యం

కాషాయం ఒక భ్రమ
సన్యాసం అనవసరపు శ్రమ
పాండిత్యం ఒక బూటకం
పారలౌకికం పనికిరాని నాటకం