Pages - Menu

Pages

16, మార్చి 2023, గురువారం

అరుణాచల యాత్ర - 8 (చంద్రశేఖర్ తో సంభాషణ)




మేము అరుణాచలంలో ఉన్న మూడురోజులూ చంద్రశేఖర్ రోజూ వచ్చి కలిసేవాడు. ఒకరోజున అతని రూమ్ కి కూడా వెళ్లి వచ్చాము. రమణాశ్రమంలోనూ, రోడ్లమీద నడుస్తూనూ, పేవుమెంట్ షాపుల్లో టీ త్రాగుతూనూ ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం.

తను ఇండియా అంతా బాగా తిరిగాడు. హిమాలయాలలో కూడా కొన్ని నెలలుండి సాధన చేశాడు. ఉత్తరకాశీలో చాలామంది సాధువులు అతనికి వ్యక్తిగతంగా తెలుసు.

మన ఆశ్రమం గురించి, నేను వ్రాసిన పుస్తకాల గురించి, ప్రస్తుతం పంచవటి కార్యక్రమాలగురించి తనతో చెప్పాను. 

'నాకు యోగమార్గం అంతగా తెలీదన్నగారు' అన్నాడు.

'చాలా మంచిది. పెద్ద తలనొప్పి వదిలింది నీకు. దానికంటే తంత్రం ఇంకా బురద. ఈ రెంటి జోలికి నువ్వు రాకపోవడమే మంచిది' అన్నాను.

'ఎందుకో మొదట్నుంచీ నాకీ రెండు మార్గాలతో పరిచయం లేదు' అన్నాడు.

'శుద్ధాద్వైతం తెలిసినవాడికి ఇంకేమీ అవసరంలేదు తమ్ముడూ. ఒక గ్లాసు నీటితో నీ దాహం తీరుతుంటే, నదిలోని నీళ్లన్నీ నీకెందుకు? అని రామకృష్ణులనేవారు. గుర్తుందా?' అన్నాను.

అవునన్నట్లు తలాడించాడు చంద్రశేఖర్.

'నేను ఉత్తరకాశీలో ఉన్నపుడు ఒక సాధువు నాకు పరిచయమయ్యాడు. అక్కడంతా చాలా చలిగా ఉంటుంది. చలికాలంలో అక్కడెవరూ ఉండలేరు. అంత మైనస్ లోకి వెళ్ళిపోతుంది. సాధువులందరూ ఖాళీచేసి హరిద్వార్ వచ్చేస్తారు. కానీ వింటర్లో కూడా ఆయనక్కడే ఉండేవాడు. భయంకరమైన  విల్ పవర్ ఉంటె తప్ప ఆ చలిని నరమానవుడు తట్టుకోలేడు. చలికాలంలో కూడా అక్కడే ఉంటూ తీవ్రమైన తపస్సు చేసేవాడు.  ఆయన కొన్ని తంత్రసాధనలు చేసేవాడు. ఆ క్రమంలో తనకు కొన్ని అద్భుతమైన శక్తులు సిద్ధించాయని నాతో అన్నాడు. ఆ శక్తులు చాలా తీవ్రమైనవి. వాటిని చూస్తే లోకం బిత్తరపోతుంది. నేటి బాబాలకు, స్వాములకు అలాంటి సిద్ధులు కనుచూపుమేరలో కూడా కనిపించవు. అలాంటివి ఆ శక్తులు. అవి ఆయనకు సిద్ధించాయి. అతనికి చాలా భయమేసిందట. ఆయన రూములో శారదామాత ఫోటో ఒకటి ఉండేది. వెంటనే అమ్మ ముందు సాగిలపడి, 'అమ్మా ఈ శక్తులు నాకొద్దు. నీవే తీసుకో' అని వేడుకున్నాడట.  వెంటనే ఆ శక్తులు అతన్ని వదలి పోయాయని నాతో అన్నాడు.

నార్త్ ఇండియాలో గొప్ప గొప్ప సిద్ధులను సంపాదించిన తాంత్రికులు తమ చివరిరోజులలో భయంకరమైన  బాధలు పడి దిక్కులేని చావు చచ్చారు. వయసులో ఉన్నపుడు, శక్తి ఉన్నపుడు, వాటిని తమ పనులకోసం వాడుకుంటారు. వీళ్ళ శక్తి క్షీణించగానే అవి రివెంజ్  తీర్చుకుంటాయి. తాంత్రికులు చాలామంది జీవితాలు విషాదాంతం అవుతాయి అన్నగారు' అన్నాడు.

'నిజమే తమ్ముడు. అందుకే తంత్రసాధన జోలికి పోవద్దని రామకృష్ణులు తమ భక్తులను హెచ్చరించారు. అవన్నీ నీకెందుకు? నీది శుద్ధాద్వైతం. అందులోనే ఉండు' అన్నాను.

రామకృష్ణా మిషన్  నుండి బయటకొచ్చి సొంతంగా బ్రతుకుతున్న నలుగురైదుగురు సన్యాసులు అరుణాచలంలో ఉన్నారని చంద్రశేఖర్ నాతో అన్నాడు. వాళ్లలో ఒకాయన IIT కాన్పూర్ ప్రోడక్ట్ అని, ప్రస్తుతం ఆయన భిక్షాటన చేస్తూ అరుణాచలంలో జీవిస్తున్నాడని నాతో అన్నాడు.

'నిజమైన బ్రాహ్మణ జీన్స్ అలాగే ఉంటాయి తమ్ముడూ. అవి లౌకిక సుఖాలను కోరుకోవు. ఎంతసేపూ తపస్సు,  ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. ఈ దారులలోకే అవి వెళతాయి. అదంతే' అన్నాను.

'రామకృష్ణా మిషన్ సాధువుల పైన మీ అభిప్రాయం?' అడిగాడు.

'మిగతావాళ్ళకంటే చాలా మెరుగు. కానీ ప్రస్తుతతరం రామకృష్ణమఠం సాధువుల పైన నాకు ఏమాత్రం మంచి అభిప్రాయం లేదు. వజ్రాల్లాంటి పాతతరం సాధువులను నేను చూశాను. వాళ్ళముందు వీళ్లంతా గులకరాళ్లే.  పైగా, మఠాన్ని వదిలేసి బయటకొచ్చారంటే వాళ్ళు వివేకానందస్వామిని ధిక్కరించినట్లే.  ఆయనకంటే గొప్ప జ్ఞానులా వీళ్ళు? అందుకే మఠాన్ని వదిలేసి బయటకొచ్చిన రామకృష్ణమఠం సాధువులంటే నాకు అస్సలు మంచి అభిప్రాయం లేదు' అన్నాను.

సంభాషణ అరుణాచలం వైపు మళ్లింది.

'ఇక్కడ రకరకాల మనుషులు, రకరకాల దేశాలవాళ్లున్నారు అన్నగారు. మొన్నొకడు ఒక రీసెర్చి చేశాడు. ఇక్కడ ఫుట్పాత్ మీద రాత్రిపూట చాలామంది సాధువులు పడుకుంటూ ఉంటారు. వాళ్లంతా బెగ్గర్లని మనం సాధారణంగా అనుకుంటాం. కానీ వాళ్లలో అద్భుతమైన నిజమైన సాధువులు కూడా ఉంటారు. అలాంటి వాళ్లలో IIT, IIM గ్రాడ్యుయేట్లు, పెద్ద MNC లలో పనిచేసి, ప్రపంచమీద విరక్తితో సాధువులుగా మారినవాళ్లు కూడా ఉంటారు. వాళ్ళు ఇక్కడ అడుక్కుంటూ, రోడ్లమీద పడుకుంటూ ధ్యానంలో కాలం గడుపుతూ ఉంటారు' అన్నాడు.'

'ఉంటారు తమ్ముడు. నూరుమంది నకిలీల మధ్యన ఒక వజ్రం కూడా ఉంటుంది. ఎవరి ఖర్మ వారిది. ఎవరి సాధన వారిది.  నువ్వు మాత్రం అలాంటివాడివే కదా? నువ్వుకూడా అలాంటి పొజిషన్ వదులుకుని వచ్చినవాడివే కదా. అదంతే' అన్నాను.

'ఒక భార్యాభర్తా ఇక్కడున్నారు. కావలసినంత సంపాదించుకున్నాక ఇద్దరూ ఉద్యోగాలు వదిలేశారు. పిల్లలు వద్దనుకున్నారు. ప్రస్తుతం ఇక్కడే ఉంటూ ధ్యానసాధన చేస్తున్నారు. హాల్లో విడివిడిగా ధ్యానానికి కూర్చుంటారు. కలిసి రారు. కలిసిపోరు. ఎవరి లైఫ్ వారిదే. కానీ ఫ్రెండ్స్ లాగా కలిసి ఉంటారు అంతే. అలాంటివాళ్ళు కూడా ఉన్నారిక్కడ.  అప్పుడప్పుడూ వచ్చిపోయేవాళ్లు కొందరు. ఇక్కడే స్థిరపడినవాళ్ళు కొందరు. సన్యాసులుగా ఉంటూ మఠాలను వదిలేసి ఇక్కడకొచ్చి ఉంటున్నవాళ్ళు కొందరు. సంసారులు మరికొందరు. భార్యలను ఇళ్లలో వదిలేసి ఇక్కడ ఉంటున్న భర్తలూ, భర్తలకు దూరంగా ఇక్కడే ఉంటున్న భార్యలూ - ఇలా ఎన్నో రకాల మనుషులు ఇక్కడున్నారు. ఇదొక మినీ ప్రపంచమన్నగారు' అన్నాడు.

నవ్వాను.

'అది మహర్షి ప్రభావం తమ్ముడూ. అచంచలమైన జ్ఞానజ్యోతి అది. దాని వెలుగు అలాగే ఉంటుంది' అన్నాను.

'యోగి రామసూరత్ కుమార్ ఆశ్రమంలో సాధువులకు భిక్ష పెడతారు. తిండికి గడిచిపోతుంది. ఎక్కడో ఒక రూమ్ తీసుకుని అందులో ఉంటూ, భిక్ష తింటూ సాధనలో ఉంటారు. అలాంటివాళ్ళు చాలామంది ఇక్కడున్నారు. హరిద్వార్, రిషీకేశ్ తర్వాత సాధువులకు భిక్ష బాగా దొరికే ప్రదేశం అరుణాచలమే అని ఒక సాధువు నాతో అన్నాడు'

'ఎవరాయన? అన్నాను. 

'ఒక జైన్ సాధువన్నగారు. కానీ ఆయన అద్వైతం పట్ల ఆకర్షితుడై హిందూసన్యాసి అయ్యాడు. నాకు హిమాలయాలలో పరిచయమయ్యాడు. వాళ్ళది చాలా రిచ్ ఫెమిలీ. 

'మా పేరెంట్స్ కి నేను అరుణాచలంలో ఉన్నానని తెలిస్తే, ఒక బజారు మొత్తం కొనేసి బంగారంతో నాకు  ఆశ్రమం కట్టించి ఇస్తారు. అంత రిచ్ ఫెమిలీ మాది. అందుకని వాళ్లకు నా అడ్రసు కూడా  తెలీకుండా హిమాలయాలలో ఉంటున్నాను. అప్పుడప్పుడూ అరుణాచలం వచ్చి  సాధన చేసుకుని మళ్ళీ హిమాలయాలకు పోతాను. నేను బ్రతికున్నానో లేనో కూడా వాళ్లకు తెలీదు. మా జైన్స్ లోనే పెద్ద మఠాధిపతిని చేస్తారు నన్ను. అది నాకిష్టం లేదు. అందుకే ఇలా అజ్ఞాతంగా ఉంటున్నాను' అని నాతో అన్నాడు. అతనికి మొబైల్ కూడా లేదు. వాడడు. మంచి అందగాడు యువకుడు. ఫిల్దీ రిచ్. కానీ సాధువయ్యాడు.  అంతటి వైరాగ్యం. నమ్ముతారా అన్నగారు?' అడిగాడు చంద్రశేఖర్.

'ఎందుకు నమ్మను? గత 50 ఏళ్ల నా నడకలో ఇలాంటివాళ్లను ఎంతో మందిని చూచాను' అన్నాను నేను.

'బాలాజీగారని ఒకాయన ఇక్కడ ఉన్నారు. బయట రూమ్ తీసుకుని ఉంటుంటారు. ఫెమిలీ చెన్నైలో ఉంటుంది. వాళ్ళు అప్పుడప్పుడూ ఇక్కడికొస్తారు. కానీ ఈయన రూముకు పోరు. ఈయన కూడా వాళ్లతో ఎక్కువ కలవడు. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 11, సాయంత్రం 5 నుంచి 9 వరకూ హాల్లో ధ్యానంలో ఉంటాడు. ప్రపంచంలో ఏది ఏమైనా ఈ దినచర్య మాత్రం తప్పదు. నేనూ హాల్లో కూచుని ధ్యానం చేస్తాను. అలా పరిచయమయ్యాడు.

నేను సాధారణంగా హాల్లో ఒక ప్లేస్ లో కూచుంటూ ఉంటాను. అందుకని అది నా ప్లేస్ అయిపొయింది. నేను హాల్లోకి వెళితే అక్కడ కూచున్నవాళ్ళు లేచి నాకు  ప్లేస్ ఇచ్చేవాళ్ళు, అదేదో నా సొంతమైనట్లు. కొన్నాళ్ళు గడ్డం పెంచాను. తెల్లడ్రస్ వేసేవాణ్ని. ఇక్కడే అయిదేళ్లుగా ఉంటున్నా కదా. అందరూ నన్ను గుర్తించి గౌరవించడం మొదలుపెట్టారు. రమణాశ్రమంలో అందరూ గుర్తించడం మొదలుపెట్టారు. ప్రపంచాన్ని వదిలేసి ఇక్కడికొస్తే ఈ గౌరవలేంట్రా భగవంతుడా? అనుకున్నా.  ఐడెంటిటీ కోల్పోడానికి ఇక్కడికొస్తే, ఇక్కడ కొత్త ఐడెంటిటీ తయారౌతోంది. అందుకని గడ్డం తీసేసి, మామూలు డ్రస్సులు వేసుకోవడం మొదలుపెట్టా. హాల్లో నేను మామూలుగా కూచునే ప్లేస్ మార్చేసి రోజుకొక చోట కూచోవడం మొదలుపెట్టా. ఇప్పుడు నన్నెవరూ గుర్తుపట్టరు. ఆ విధంగా వీళ్ళ గౌరవమర్యాదలనుంచి నన్ను నేను కాపాడుకున్నా' అన్నాడు.

'మంచి పని చేసావ్. వెరీ గుడ్' అన్నా.

ఆ మాటా ఈ మాటా మాట్లాడాక, 'ఇక్కడ క్రైమ్ రేట్ ఎలా ఉంది?' అడిగాను.

'ఉందన్నగారు. ఫారినర్స్ అమాయకంగా అందరినీ నమ్ముతారు. ప్రమాదంలో పడతారు. ఇక్కడందరూ మంచివాళ్ళేమీ కాదు. ఒక అమెరికన్ అమ్మాయిని కొండమీద రేప్ చేసి చంపేశారు. ఇంకొక రష్యన్ అమ్మాయి గ్యాంగ్ రేప్ కు గురైంది. మీడియాలో అదంతా వచ్చింది. చాలా గోల అయింది. కొండలలోకి వంటరిగా పోయి తిరిగితే మాత్రం డేంజరే, అందులోనూ అమ్మాయిలకు మరీ డేంజర్. ఎవరి జాగ్రత్తలో వాళ్ళుండాలి. తెల్లవారుజామున గిరిప్రదక్షిణ చేసే అమ్మాయిలను ఎటాక్ చేసేవారు ఉన్నారు. క్రైమ్ ఉంది. ఒకరోజున ఆశ్రమం ముందే నా మొబైల్ లాగుకోబోయారు.  క్షణంలో తప్పుకున్నాను ' అన్నాడు.

'ఇది జ్ఞానభూమి అన్నది నిజమే. మహర్షి మహాజ్ఞాని నిజమే. కానీ లోకల్స్ అందరూ జ్ఞానులేమీ కాదు కదా? వాళ్లలో క్రిమినల్స్ చాలామంది ఉంటారు. మహర్షి బ్రతికున్న రోజులలో దొంగలు ఆయన్నే కొట్టారు కదా.  అంతెందుకు? ఇక్కడ కనిపించే సాధువులలో చాలామంది దొంగసాధువులే.  క్రైమ్ చేసి ఈ వేషంలో తప్పించుకుని తిరిగేవాళ్లు కూడా చాలామంది ఇక్కడ ఉంటారు' అన్నాను.

'అవునన్నగారు. పైగా, యూ ట్యూబర్స్ వల్ల అరుణాచలం ఈమధ్యన చాలా చండాలం అయింది.  ఎవడెవడు ఇక్కడికి వస్తున్నాడో తెలీడం లేదు.  గిరిప్రదక్షిణం అంటూ ప్రతివాడూ ఇక్కడికి వస్తున్నాడు. కొండ చుట్టూ తెగ తిరుగుతున్నారు' అన్నాడు.

'వాళ్ళగురించి నాకు చెప్పకు తమ్ముడూ. అలాంటి నేలబారు గుంపంటే నాకు చాలా అసహ్యమని  నీకు తెలుసు కదా?' అన్నాను.

ఆ తర్వాత ఓషో, జిడ్డు, యూజీ, డోనాల్డ్ హాఫ్ మాన్, నిసర్గదత్త మహారాజ్, రమేష్ బల్సేకర్, మూఁజీ, పాపాజీ మొదలైన వాళ్ళ గురించి చర్చ నడించింది.

కాగ్నిషన్ సైన్స్ గురించి చాలా చెప్పాడు. అంతా విని ఇలా అన్నాను.

'కాగ్నిషన్ సైంటిస్టులు అద్వైతాన్ని సైన్సు పరిభాషలో చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే, కాశ్మీరశైవాన్ని మక్కీకి మక్కీ దించారు. మోడ్రన్ ఫిజిక్స్ అంతా వేదాంతమే. ఈ పోకడ ఫ్రిజాఫ్ కాప్ర మొదలైనవారితో మొదలైంది. ఐన్ స్టైన్ చెప్పినది కూడా మాయావాదానికి దగ్గరగా ఉంటుంది. ఇవన్నీ ఒదిలేసేయ్యి. ఈ సైంటిస్టులు ఎన్ని మాట్లాడినా, నువ్వు ఎంత అర్ధం చేసుకున్నా, అంతిమంగా నువ్వు నిర్వికల్పసమాధిలోకి దిగనిదే ఏమీ ప్రయోజనం లేదు. మిగతాదంతా ఉత్తవాగుడు మాత్రమే అని గ్రహించు'.

నేటి పాపులర్ టీవీ/యూట్యూబ్ గురువులగురించి తనేదో చెప్పబోతే, 'వాళ్ళ పేర్లెత్తకు తమ్ముడూ. మన నోళ్లు పాడౌతాయి. వద్దు' అంటూ వారించాను.

అదంతా వ్రాస్తే మరో నాలుగు ఎపిసోడ్లవుతాయి గనుక వ్రాయడం లేదు.

చివరగా, 'మళ్ళీ ఎప్పుడొస్తారన్నగారు?' అంటూ అడిగాడు.

'తెలీదు. ఈసారి ఇంకా తక్కువమందితో వస్తాను. లేదా ఒక్కడినే వస్తాను. అప్పుడు కొద్దిరోజులు ఇక్కడే ఉంటూ తపస్సులో కాలం గడుపుతాను, 

పుస్తకాలు ఎక్కువ చదవకు తమ్ముడూ. తపస్సు చేయి. అదే ప్రధానం, నెట్ ఎక్కువ చూడకు. మొబైల్ టైం బాగా తగ్గించు. నా మొబైల్ ప్రస్తుతం రోజంతా ఆఫ్ లోనే ఉంచుతున్నాను. సాయంత్రం ఒక గంట మాత్రం ఓపెన్ చేస్తాను. మన ఆశ్రమంలో రూల్ ఇది. నాతొ ఉండాలనుకునేవాళ్ళు మొదటగా మొబైల్ ను పక్కన పెట్టాలి. నువ్వూ అలాగే చెయ్యి. ప్రపంచంతో సంబంధాలు బాగా తగ్గించుకో. మన ఆశ్రమానికి వచ్చి కొన్నాళ్లుండు' అని తనకు సలహా ఇచ్చాను.

'వస్తానన్నగారు' అన్నాడు.

ఆ విధంగా మూడ్రోజుల అరుణాచలం యాత్రను ముగించి, కార్లో చెన్నై చేరుకొని, అక్కడ రైలెక్కి, బాపట్లలో దిగి, రాత్రికి జిల్లెళ్ళమూడి చేరుకున్నాం.

ఆ విధంగా పాండిచ్చేరి, ఆరోవిల్, తిరువణ్ణామలై యాత్రలు ముగిశాయి.